నవశకానికి నాంది

ABN , First Publish Date - 2021-07-08T06:30:41+05:30 IST

త్రిపుర వెస్ట్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా గెలుపొందిన 50 సంవత్సరాల ప్రతిమా భౌమిక్‌ 1991 నుంచి భారతీయ జనతా పార్టీలో సభ్యురాలు.

నవశకానికి నాంది

ప్రతిమా భౌమిక్‌... డాక్టర్‌ భారతి పవార్‌... ఒకరిది ఈశాన్య రాష్ట్రం... మరొకరిది మహారాష్ట్ర ప్రాంతం. ఇద్దరి నేపథ్యాలు వేరైనా... సామాజిక సేవతో ప్రజలతో మమేకమైన మహిళామణులు వీరు. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ప్రకటించిన కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. తొలిసారి మంత్రులుగా బాధ్యతలు చేపడుతున్న వీరిద్దరూ... నవశకానికి నాంది పలుకుతున్నారు. 


మొదటి జీతం వరద బాధితులకు 

త్రిపుర వెస్ట్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా గెలుపొందిన 50 సంవత్సరాల ప్రతిమా భౌమిక్‌ 1991 నుంచి భారతీయ జనతా పార్టీలో సభ్యురాలు. ‘దీదీ’గా సుపరిచితురాలైన ప్రతిమ త్రిపుర ముఖ్యమంత్రి శ్రీబిలాప్‌ కుమార్‌ వర్గంలో కీలకం. 2016లో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సోనమురాలోని బరనారాయణ్‌ ప్రాంతం నుంచి వచ్చిన ఆమె... అగర్తలలోని ఉమెన్స్‌ కాలేజీలో బయోసైన్స్‌లో డిగ్రీ చేశారు. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ ఆమెకు టికెట్‌ ఇచ్చింది. తొలిసారి పోటీ చేసి మూడు లక్షలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థిపై గెలుపొందారు. ‘‘త్రిపురను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యం’ అని నాడు ఆమె ప్రకటించారు. అన్నట్టుగానే రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆ తరువాత ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించారు. పార్లమెంట్‌ సభ్యురాలిగా తనకు వచ్చిన మొదటి నెల జీతం లక్ష రూపాయలను అసోం వరద బాధితుల సహాయ నిధికి అందించి పెద్ద మనసు చాటుకున్నారు.


ఆమెది ప్రజల పక్షం

డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌... మహారాష్ట్రలోని డిండోరి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ఆమె కింది స్థాయి నుంచి ఎదిగిన మహిళ. గతంలో ‘నాశిక్‌ జిల్లా పరిషత్‌’ సభ్యురాలిగా పని చేశారు. ఆ సమయంలో మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపంపై దృష్టి పెట్టారు. బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేశారు. అలాగే ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగు నీటి కోసం పోరాడారు. నాశిక్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివిన ఆమె... ప్రజా సేవలో భాగమయ్యారు. మహారాష్ట్రలోని ఖండేష్‌ ఆమె సొంత ఊరు. 42 ఏళ్ల భారతి సేవా నిరతి, ప్రజల్లో ఉన్న మంచి పేరు ఆమెకు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ దక్కేలా చేశాయి. అంతేకాదు... అదే సంవత్సరం ఉత్తమ మహిళా పార్లమెంటేరియన్‌ అవార్డు కూడా అందుకున్నారు. ప్రజాక్షేత్రంలో తొలి పరీక్షలోనే నెగ్గిన భారతి... ఇప్పుడు కేంద్ర మంత్రి అవ్వడం అభినందనీయం. 

Updated Date - 2021-07-08T06:30:41+05:30 IST