సోదరునికి స్వీటుతో

ABN , First Publish Date - 2021-08-21T08:08:57+05:30 IST

సోదరులకు రాఖీ కట్టి స్వీటుతో నోరు తీపి చేయడం సంప్రదాయం. అలాగని

సోదరునికి  స్వీటుతో

సోదరులకు రాఖీ కట్టి స్వీటుతో నోరు తీపి చేయడం సంప్రదాయం. అలాగని కొనుగోలు చేసిన స్వీటుతో కాకుండా మీరు ఇంట్లో తయారుచేసిన స్వీటుతో నోరు తీపి చేస్తే ఆ అనుభూతే వేరు. డబల్‌ కా మీఠా, అప్రికాట్‌ పుడ్డింగ్‌, కద్దు కా హల్వా, అనోకీ ఖీర్‌ వంటి వాటితో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోండి. 




డబల్‌ కా మీఠా


కావలసినవి

జంబో బ్రెడ్‌ - 8 స్లైస్‌లు, పంచదార - 200గ్రా, వనస్పతి - 500గ్రా, కోవా - 100గ్రా, యాలకులు - 10గ్రా.


తయారీ విధానం


 ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌ను నాలుగు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

 స్టవ్‌పై పాన్‌ పెట్టి వనస్పతి  వేసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

 తరువాత స్టవ్‌పై మరొక కడాయి పెట్టి పంచదార, నీళ్లు పోసి పంచదార పానకం తయారుచేసుకోవాలి. 

 ఇప్పుడు ఆ పానకంలో ఫ్రై చేసిన బ్రెడ్‌ ముక్కలు వేయాలి. 

 చివరగా కోవా, యాలకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.




అప్రికాట్‌ పుడ్డింగ్‌


కావలసినవి

డ్రై అప్రికాట్స్‌ - 200గ్రా, బిస్కట్ల పొడి - 50గ్రా, స్పాంజి కేకు పొడి  - 50గ్రా, పాలు - 200ఎం.ఎల్‌, పంచదార - 50గ్రా, విప్ప్‌డ్‌ క్రీమ్‌ - 30గ్రా, చెర్రీలు - నాలుగైదు, పుదీనా ఆకులు - కొద్దిగా, జామ్‌ - ఒక టేబుల్‌స్పూన్‌. 


తయారీ విధానం

 ఒక బౌల్‌  తీసుకుని అందులో పాలు పోసి, బిస్కట్ల పొడి, స్పాంజి కేకు పొడి, పంచదార వేసి కలుపుకోవాలి. 

 మరొక డెజర్ట్‌ బౌల్‌ తీసుకుని అందులో డ్రై అప్రికాట్స్‌ను ముక్కలుగా చేసి లేయర్‌లా పరుచుకోవాలి. వాటిపై బిస్కట్ల పొడి మిశ్రమాన్ని లేయర్‌ వేయాలి. 

 ఇప్పుడు వాటిపై విప్ప్‌డ్‌ క్రీమ్‌ను లేయర్‌లా వేసుకోవాలి. చెర్రీలు, పుదీనా ఆకులు, జామ్‌తో గార్నిష్‌ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.




కద్దు కా హల్వా


కావలసినవి

సొరకాయ - ఒక కిలో, పాలు - అర లీటరు, పంచదార - 200గ్రా, నెయ్యి - 50గ్రా, యాలకులు - 10గ్రా, బాదం - 20గ్రా.


తయారీ విధానం

 సొరకాయ పొట్టుతీసి సన్నగా తురమాలి. 

 స్టవ్‌పై కడాయి పెట్టి పాలు పోసి తురిమిన సొరకాయ వేసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత పంచదార, నెయ్యి వేయాలి. యాలకులను పొడి చేసి వేసుకోవాలి. 

 చివరగా బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.




అనోకీ ఖీర్‌


కావలసినవి

తెల్ల ఉల్లిపాయలు - 500గ్రా, పాలు - ఒక లీటరు, పంచదార - 150గ్రా, యాలకులు - 10గ్రా, పిస్తా - 10గ్రా, వెనిగర్‌ - కొద్దిగా.


తయారీ విధానం

 ఉల్లిపాయలను సన్నగా తరిగి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

 స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి నీళ్లుపోసి ఉల్లిపాయలు, వెనిగర్‌ వేసి ఉడికించాలి. తరువాత చల్లటి నీటిలో ఉల్లిపాయలు మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. 

 స్టవ్‌పై మరొక పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో పంచదార వేసి మరికాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. యాలకులను పొడి చేసి వేసుకోవాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.

 పిస్తాపలుకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.




  • కొడాలి వెంకటేశ్వరరావు
  • ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌
  • గోల్కొండ హోటల్‌

Updated Date - 2021-08-21T08:08:57+05:30 IST