అది వారిద్దరూ నేర్పారు!

ABN , First Publish Date - 2021-10-20T07:48:08+05:30 IST

ఆర్కే (అక్కిరాజు రామకృష్ణ) ఇటీవల మరణించారు. అయితే ‘‘నా భర్త, బిడ్డ మహోద్యమంలో ఊపిరి వదిలారు. వాళ్లది ప్రాణత్యాగం. కనుక ఎవరి జాలి, దయ నాకు అవసరం లేదు’’ అంటున్నారు కందుల శిరీష.

అది వారిద్దరూ నేర్పారు!

విప్లవోద్యమంలోకి వెళ్ళిన కుమారుడు 

అక్కిరాజు పృధ్వీ (మున్నా) అమరుడయ్యాడు.. 

జీవిత చరమాంకంలో కలిసి ఉండాలని ఆమె ఆశపడిన   సహచరుడు, 

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు 


ర్కే (అక్కిరాజు రామకృష్ణ) ఇటీవల మరణించారు. అయితే ‘‘నా భర్త, బిడ్డ మహోద్యమంలో ఊపిరి వదిలారు. వాళ్లది ప్రాణత్యాగం. కనుక ఎవరి జాలి, దయ నాకు అవసరం లేదు’’ అంటున్నారు కందుల శిరీష. ఆర్కే జీవిత సహచరిగా ఆయనతో తన జ్ఞాపకాలను నవ్యతో పంచుకున్నారు.  


‘‘ఆర్కేకి ఆరోగ్యం సరిలేదని తెలుసు. కానీ, మరీ ఇంత సీరియస్‌ అనుకోలేదు. కష్ట సమయంలో నేను ఆయన దగ్గర లేకపోయాననే బాధ నా మనసును మెలిపెడుతోంది. ఆర్కే నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనకు విప్లవోద్యమ ప్రయోజనమే ప్రథమం. నేను మరింత రాజకీయ అవగాహనతో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. బాధ్యతల కారణంగా నాకు ఎక్కువ సమయం కేటాయించలేక పోయేవారు. ‘మీ గుర్తుగా నాకేదైనా ఒక చీర కొనివ్వండి’ అని మొదట్లో రామకృష్ణను కాస్త సతాయించేదాన్ని. అయినా, తాను మాత్రం ‘‘మీకు ఇష్టమైంది కొనుక్కోండి కామ్రేడ్‌!’’ అంటుండేవారు. ఆ సమయంలో మా మధ్య చిన్న చిన్న పోట్లాటలూ సాగేవి. ‘‘బాబు పుట్టినరోజు నాడు తప్పకుండా ఉండాల్సిందే’’ అనేదాన్ని. ఆయనేమో ‘‘వెళ్లాలి’’ అనేవారు. ‘‘ఎప్పుడూ రాసుకుంటూనో, చదువుకుంటూనో కూర్చుంటారు. నాకూ కాస్త సమయం ఇవ్వండి’’ అనేదాన్ని. అప్పుడు ఆయన ‘‘ఓహ్‌! సారీ కామ్రేడ్‌! పనిలో పడి మర్చిపోయాను’’ అంటుండేవారు. 


ఆయన క్రమశిక్షణ, నిబద్ధత నన్ను ఆశ్చర్యానికి గురిచేసేవి. నా ప్రేమకు గుర్తుగా ఆయనకు శాలువాలు, స్వెట్టర్లు, చొక్కాలు పంపేదాన్ని. ఆయన వాటిని దాచుకోకుండా, అవసరమైన వాళ్లకు ఇచ్చేసేవారు. ఆ సంగతి తెలిసి, ‘‘నా ఖర్మ కామ్రేడ్‌’’ అనేదాన్ని. అప్పుడు ఆయన నవ్వుతూ, ‘‘మీ జ్ఞాపకాలు ఆ వస్తువుల్లో కాదు, నా హృదయంలో ఉంటాయి కామ్రేడ్‌’’ అనేవారు. ఇలా చాలా సందర్భాల్లో నేను వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ఆయనతో వ్యవహరించాను. అప్పుడు ఆయన నాతో ప్రవర్తించిన తీరు, మాటలు... నాకు విప్లవోద్యమ బాధ్యతను గుర్తుచేసేవి. ఇవన్నీ నాకు మిగిలిన మధుర జ్ఞాపకాలు. విప్లవకారులంటే కఠినంగా ఉంటారని చాలామంది అభిప్రాయం. నిజానికి వారంత సున్నిత స్వభావులు, స్నేహశీలురు సాధారణ సమాజంలో మనకు అరుదుగా కనిపిస్తారు. అందుకు ఆర్కే వ్యక్తిత్వమే నిదర్శనం. అంత పెద్దనాయకుడైనా, నా విమర్శను సైతం స్వీకరించగలిగిన గొప్ప హృదయం ఆర్కే సొంతం. 


నా ఉద్యమ జీవితం...

మాది ప్రకాశం జిల్లాలోని ఆలకూరపాడు గ్రామం. మా అమ్మ,నాన్నలు వ్యవసాయ కూలీలు. మేము ఐదుగురం అక్కచెల్లెళ్లం. నేను అందరిలోకి చిన్నదాన్ని. స్కూల్లో మమ్మల్ని వెనుక బెంచీకి పరిమితం చేయడం, ఊర్లో రైతులు వచ్చినప్పుడు మా అమ్మ, నాన్న లేచి నిల్చోవడం లాంటి సంఘటనలు నన్ను తీవ్రంగా బాధించేవి. అదే సమయంలో మా బావ కళ్యాణరావు ఇంటికి వచ్చే ‘సృజన’, ‘క్రాంతి’ పత్రికలతో పాటు కొన్ని సాహిత్య పుస్తకాలు చదువుతుండేదాన్ని. అవి నా ఆలోచనలను కాస్త విస్తృతం చేశాయని చెప్పచ్చు. మా బావ ద్వారానే ‘జననాట్యమండలి’ కళాకారులు పరిచయం అయ్యారు. వాళ్లతో పాటు నేనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. కుటుంబాల్లో మహిళలను అణచివేసే పితృస్వామ్య భావజాలం, సమాజంలోని కుల వివక్ష నాకు విప్లవోద్యమ పార్టీలో కనిపించలేదు. పైగా అక్కడ అందరూ ప్రేమాభిమానాలతో మెలగడం చూశాను. దోపిడీ, పీడనలు పోవాలంటే వర్గ గపోరాటమే అంతిమ పరిష్కారమని తెలుసుకున్నాను. నేనూ ఉద్యమంలో భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నాను. అలాగే పార్టీ కార్యకర్తనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అదే విషయాన్ని ‘జననాట్యమండలి’ నాయకులతోనూ చెప్పాను. 


మా తొలి పరిచయం...

ఒంగోలులోని కళ్యాణరావు బావ ఇంటికి ఒక రోజు కామ్రేడ్‌ సూర్యంతో పాటు ఆర్కే వచ్చారు. అప్పుడు ఆయన అజ్ఞాతవాసం పేరు శ్రీనివాస్‌. అదే ఇంట్లో ఉంటూ ఇంటర్‌ చదువుతున్న నేను అప్పుడే పెద్ద బిందెతో నీళ్లు తేవడం చూసి, ‘‘ఈ అమ్మాయి గట్టిదే!’’ అనుకున్నారట ఆర్కే. అదే మా తొలిపరిచయం. తర్వాత ఏడాదికి ‘‘ఆర్కేని పెళ్లి చేసుకుంటే బావుంటుంది. ఆలోచించు!’’ అని సూర్యం నాతో అన్నారు. నేను పార్టీ వ్యక్తిని పెళ్లిచేసుకోవడం మా అమ్మకూ, నాన్నకూ మొదట్లో పెద్దగా ఇష్టం లేకున్నా, పార్టీ నాయకులకు నా అంగీకారాన్ని తెలిపాను. అలా 1988, అక్టోబరు 11న త్రోవగుంటలోని కళ్యాణరావు గారింట్లో... ఇరవైమంది సమక్షంలో మా పెళ్లి జరిగింది. మూడేళ్లు ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం. మున్నా పుట్టిన ఆరు నెలలకు ఆయన పూర్తిగా విప్లవోద్యమంలోకి వెళ్లారు. పిల్లాడిని ఎవరివద్ద అయినా వదిలి, నన్నూ ఉద్యమంలోకి రమ్మన్నారు. ‘‘బిడ్డను వదిలి నేనుండలేను’’ అన్నాను. ‘‘నీ ఇష్టం’’ అన్నారు. పిల్లాడిని తీసుకొని మా అమ్మవాళ్ల ఇంటికి వచ్చాను. అక్కడే ఉంటూ కుట్టుమిషన్‌ మీద పని చేస్తూ పిల్లాడిని పోషించుకున్నాను. అయితే, అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్లి వస్తుండేదాన్ని. అలా ఒకసారి వస్తూండగా పోలీసులు నన్ను అరెస్టు చేశారు. కొంతకాలం జైల్లోనూ ఉన్నాను. ఆ తర్వాత ఆయన్ను కలవలేకపోయాను. 


మున్నా తల్లిగా గర్విస్తున్నా...

ఒకరోజు టీవీలో రామకృష్ణ ఇంటర్వ్యూ చూస్తూ, ‘ఆయనే మా నాన్న కదా.!’ అనడిగాడు మున్నా. ‘‘నీకెవరు చెప్పార్రా’’ అంటే, ‘‘నాకు తెలుసు అమ్మా’’ అన్నాడు. అదే విషయం ఆయనకు చెబితే, ‘‘మున్నా చదివింది చాలు. వాడు విప్లవోద్యమంలో ఉండగలుగుతాడా?’’ అని అడిగారు. ‘‘మున్నా అక్కడ ఉండలేడు. అయినా, నీవు చేసేది కాకుండా వాడిని కూడా లాగుతున్నావు’’ అన్నాను కోపంగా. ‘‘అదేంటి కామ్రేడ్‌! మరి ఇతరులకు మనం చెబుతున్నదేమిటి?’’ అన్నారు ఆయన. ‘‘అయితే అది నిర్ణయించుకోవాల్సింది మున్నానే’’ అన్నాను. తండ్రీ కొడుకులిద్దరి స్వభావం ఒక్కటే. ఇద్దరికీ సమాజమంటే విపరీతమైన మమకారం. నాకు తెలియకుండానే మున్నా విప్లవోద్యమంలోకి వెళ్లాడు. నన్ను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేని మున్నా... ఎంతగా ఎదిగాడనేది వాళ్లు వీళ్లు చెప్పగా విని ఆశ్చర్యపోయాను. ‘‘మున్నా నుంచి నేను చాలా నేర్చుకోవాలి’’ అని ఒక సందర్భంలో ఆయన కూడా అన్నారు. చిన్న వయసులోనే సమాజాన్ని అంతగా ప్రేమించి, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్నే త్యాగం చేసిన మున్నాకి తల్లిగా గర్విస్తున్నా.


చేతిలో చేయి...

బహుశా పాతికేళ్ల కిందట అనుకుంటా. దినపత్రికల్లో నిత్యం ఎన్‌కౌంటర్‌ వార్తలు వస్తుండటం చూసి ఆయనకు ఏమైనా అవుతుందేమోనని భయమేసింది. అదే సంగతి ఆర్కేని కలిసినప్పుడు చెప్పి, కన్నీళ్లు పెట్టుకున్నాను. అప్పుడు తాను నా చేతిని తన చేతుల్లోకి తీసుకొని ‘‘నాకు అరవై ఏళ్లు వచ్చేవరకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆపై చెప్పలేను. అయినా, నీవింత అధైర్యపడితే ఎలా? భయపడడం విప్లవకారుల లక్షణం కాదు’’ అని నాలో ధైర్యం నూరిపోశారు. 


పెళ్లిరోజున పాయసం...

సరిగ్గా మా పెళ్లైన పదేళ్లకు అనుకుంటా! అక్టోబరు 11న నేనూ ఆయనతోనే ఉన్నాను. అదే రోజున అజ్ఞాతంలోనే ఏదో ఒక సమావేశం జరుగుతోంది. ఆవేళ మా పెళ్లిరోజు అని తెలిసి, కొందరు మహిళా కామ్రేడ్స్‌ సేమియా పాయసం వండి, పంచారు. ఆ సంగతి తెలిసిన ఆర్కే ‘‘ఇది బూర్జువా సంస్కృతి కదా, కామ్రేడ్స్‌’’ అని మెల్లగా వారించారు. అప్పుడు అవతలివారు ‘‘విప్లవకారులు మనుషులు కారా! వాళ్లకు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఉండకూడదా?’’ అన్నారు. ఆర్కే నాతో వ్యవహరించే తీరును మిగతావారంతా కొనియాడేవారు. ఆయన అంత హుందాగా నడుచుకునేవారు. చాలా మృదుస్వభావి. అంతకుమించి ప్రేమమూర్తి. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత సహచరిని అయినందుకు ఆనందంగా ఉంది. 


కడవరకూ కలిసుండాలని...

చివరివరకూ విప్లవోద్యమంలో ఆర్కేతో కలిసి నడవలేకపోయాననే వెలితి మిగిలింది. ఒక సందర్భంలో అడిగాను ‘‘చివరి రోజుల్లో అయినా మనం కలిసుంటామా?’’ అని. అందుకు ఆయన ‘‘చూద్దాం లే! అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో!’’ అన్నారు. జీవితం చివరి దశలోనైనా ఆయనతో కలిసి ఉండాలనీ, ఇద్దరం మున్నా స్మృతులు నెమరువేసుకోవాలనీ, వాడి జ్ఞాపకాలను ఆయన నోటివెంట వినాలనీ ఆశపడ్డాను. కానీ, అలా జరగలేదు. వాస్తవాన్ని ఆహ్వానించాలనే విషయాన్ని వారిద్దరూ నాకు నేర్పారు. ప్రస్తుతం ఆలకూరపాడులోనే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాను. అదే నా జీవనాధారం. కొడుకును పోగొట్టుకుందని కొందరు నామీద జాలి చూపిస్తుంటారు. అలాంటి వాళ్లకు నేను చెప్పేదొక్కటే, ‘నా భర్త, బిడ్డ మహోద్యమంలో అశువులు బాశారు. వాళ్లది ప్రాణత్యాగం. కనుక మీ జాలి, దయ నాకు అక్కర్లేదు’ అని.’’

కె.వెంకటేశ్‌ఫొటోలు: ఇ.సర్వేశ్వరరావు


‘కలకానిది... విలువైనది’

ఆర్కేకి చార్లీచాప్లిన్‌ సినిమాలంటే అమితమైన అభిమానం. పాటల్లో... తెలుగు, హిందీ సినిమాల్లోని ఓల్డ్‌ క్లాసిక్స్‌ను తరచుగా వింటుండేవారు. అందులోనూ ‘వెలుగు నీడలు’ సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘కల కానిది విలువైనది బ్రతుకు... కన్నీటి ధారలలోనే బలిచేయకు’ పాటను ఎక్కువగా వినేవారు. మా పెళ్లైన కొత్తల్లో ఇద్దరం కలిసి కొన్ని సినిమాలకు వెళుతుండేవాళ్లం. మున్నాకి ఐదేళ్లప్పుడు అనుకుంటా... ముగ్గురం  ‘బొంబాయి’ సినిమాను థియేటర్లో చూశాం. ఆర్కేకి ఆహారం విషయంలో పెద్ద పట్టింపులేవీ లేవు. పైగా ఏదైనా మితంగానే తినేవారు. ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి కలిపిన అన్నమంటే ఆయనకు చాలా ఇష్టం. 

Updated Date - 2021-10-20T07:48:08+05:30 IST