సేవే జీవితం
ABN , First Publish Date - 2021-07-08T06:06:18+05:30 IST
ఢిల్లీ నగరం... 2015 మార్చి... ఆరు మాసాల నా పసిబిడ్డను పక్కన పెట్టుకుని అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నా. రెడ్ సిగ్నల్.

మంచి ఉద్యోగం... జీతం... పిల్లలకు బంగరు భవితవ్యం... ఇదే కదా సగటు మనిషి జీవిత లక్ష్యం! మరి ట్వింకిల్ కలియా... దీనికి భిన్నం. ఆమెదీ అతి సామాన్య మధ్యతరగతి కుటుంబం. కానీ ఆశయం... ఆకాశమంత ఉన్నతం. అత్యవసరంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు అంబులెన్స్ డ్రైవర్‌గా మారారు. భర్తతో కలిసి వేల మందిని రక్షించారు. శరీరాన్ని కేన్సర్ తొలిచేస్తున్నా... సేవ నుంచి పక్కకు జరగని అంకితభావం ఆమెది.
‘‘ఢిల్లీ నగరం... 2015 మార్చి... ఆరు మాసాల నా పసిబిడ్డను పక్కన పెట్టుకుని అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నా. రెడ్ సిగ్నల్. బండి ఆగింది. ఇంతలో ఓ గుంపు... హడావుడిగా నా వైపు దూసుకువస్తోంది. వారి చేతిలో స్పృహతప్పిన పిల్లవాడు... కాలు విరిగింది. రక్తం ధార కడుతోంది. యాక్సిడెంట్ కేసు. అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నన్ను అభ్యర్థించారు. క్షణం ఆలస్యం చేయలేదు. నిమిషాల్లో ఆసుపత్రి ముందు ఉంది అంబులెన్స్. అతడి కాలైతే పోయింది. అయితే ఆ రోజు డాక్టర్ చెప్పింది... ‘ఇంకాస్త ఆలస్యమై ఉంటే పిల్లాడి ప్రాణాలే పోయేవి అని’. నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో! మా ఉచిత అంబులెన్స్ సేవల ద్వారా నా భర్త హిమాన్షుతో కలిసి కొనఊపిరిలో ఉన్న అనేక మందిని రక్షించాం. నేటికీ అదే మా నిత్యకృత్యం.
స్వానుభవం నుంచి...
అసలు ఈ అంబులెన్స్ సేవలు ప్రారంభించడానికి కారణం మావారి జీవితంలో ఎదురైన ఓ ఘటన. ఆయనకు పధ్నాలుగేళ్లప్పుడు వాళ్ల నాన్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే అంబులెన్స్ లేదా ఆటో పిలవాలి. అది ఖర్చుతో కూడుకున్నది. అంత డబ్బు వాళ్ల వద్ద లేదు. అడిగినా చుట్టుపక్కవారు ఎవరూ సాయం చేయలేదు. గంటలపాటు ప్రయత్నించగా ఎలాగో కొంత డబ్బు సమకూరింది. ఆటోరిక్షా మాట్లాడుకొని ఆయన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళితే... పరిస్థితి విషమించి కోమాలో పెట్టారు. అప్పటికి ప్రమాదం జరిగి ఏడు గంటలు దాటిపోయింది. ఆ ఆలస్యం ఫలితం ఆయన కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. అది వాళ్ల కుటుంబంపైనే కాదు, చిన్న వయసులో హిమాన్షుపైనా పెను ప్రభావం చూపింది. ఆ తరువాత అదే ఆయన జీవితాన్ని మార్చేసింది.
పెళ్లి కానుకగా అంబులెన్స్...
కష్టపడి తండ్రిని బతికించుకున్న తరువాత హిమాన్షు ఒక దృఢ నిర్ణయానికి వచ్చారు. మరే తల్లికి గానీ, బిడ్డకు గానీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూడాలనుకున్నారు. 2002లో హిమాన్షుతో నా పెళ్లయింది. ఆయన తల్లితండ్రులు కానుకగా అంబులెన్స్ బహూకరించారు. చూసినవారికి వింతగా అనిపించింది. కానీ అది ఆయన జీవిత ఆశయం కదా! ఆ తరువాత నా ఆశయం కూడా అదే అయిపోయింది. ఇద్దరం ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేస్తున్నాం. ఇప్పటికీ అదే మా జీవనాధారం. వచ్చే డబ్బు ఏ మూలకూ సరిపోదు.
కరోనా సమయంలోనూ...
పెళ్లయిన నాటి నుంచి మా ఇద్దరి జీవితాలు సేవకే అంకితమయ్యాయి. పేదలకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ అందిస్తున్నాం. ‘షాహిద్ భగత్‌సింగ్ ట్రస్ట్’ కొంత సహకరిస్తోంది. మొదట్లో స్థోమత లేని పేషెంట్లు ఎవరో తెలుసుకోవడానికి చాలా అవస్థలు పడ్డాం. తరువాత అవగాహన కల్పించడానికి మా వివరాలు, ఫోన్ నెంబర్లతో పోస్టర్లు అంటించాం. నిదానంగా సాయం కోసం కాల్స్ రావడం మొదలయ్యాయి. కుటుంబాలు పట్టించుకోకుండా వదిలేసిన అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో ఇలాంటి మృతదేహాలు అధికమయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇన్‌ఫెక్షన్ సోకుతుందని దూరంగా ఉంటున్నారు. ఇది చాలా బాధాకరం.

రాత్రిళ్లు మేమే డ్రైవింగ్...
ఇరవయ్యేళ్లుగా మాది విరామం లేని ఉద్యోగం. అంబులెన్స్ సంఖ్య ఒకటి నుంచి 14కు చేరింది. పది మంది డ్రైవర్లను పెట్టాం. వారు పగలు పని చేస్తారు. రాత్రి నేను, మా వారు అంబులెన్స్‌లు నడిపిస్తాం. 24 గంటలూ సేవలు అందుబాటులో ఉండాలంటే రాత్రిళ్లు మేం బండి ఎక్కక తప్పదు. ఇప్పటికి 80 వేల మంది పేషెంట్లు మా సర్వీస్ ఉపయోగించుకున్నారు. ఇది కాకుండా కరోనా రెండో దశ ఉధృతంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కోసం కూడా కాల్స్ వచ్చాయి. మేము ఊహించలేదు. మా పరిధిలో లేకపోయినా, ఎక్కడ దొరుకుతాయో విచారించి, అత్యవసరంలో కొందరికి సిలిండర్లు సరఫరా చేయగలిగాం.
తీరిక లేని ప్రయాణం...
మాకు ఇద్దరు కూతుళ్లు. ఇరవై నాలుగు గంటలూ పేషెంట్ల నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి. దీంతో పడుకొనేసరికి రోజూ తెల్లవారుజాము 4 గంటలు అవుతుంది. మళ్లీ ఉదయం తొమ్మిదికల్లా మా పనులు ముగించుకోవాలి. ఆ తరువాత ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాలి. మధ్యాహ్న, రాత్రి భోజనానికి, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించడానికి ఫలానా సమయమంటూ లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు తినడమే. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వదిలేసి పరుగెత్తాలి. దీనివల్ల ఒక్కోసారి క్లయింట్స్‌తో అపాయింట్‌మెంట్లు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా మా ఆదాయం దెబ్బతింటోంది.
రాష్ట్రపతి అవార్డు దక్కినా...
కొన్ని సందర్భాల్లో అంబులెన్స్‌లకు ఆయిల్ కొట్టించడానికి కూడా డబ్బులు ఉండవు. ఇదికాక డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలి. ఫీజులు కట్టలేదని మా పిల్లల్ని స్కూల్ నుంచి పంపించేశారు. మా సంసారం, సేవా కార్యక్రమం... అంతా అప్పులపైనే నడుస్తోంది. ఇప్పటికీ లక్షల్లో బాకీలు ఉన్నాయి. అప్పుడప్పుడూ కొందరు దాతలు నిధులు సమకూరుస్తున్నారు. 2019లో రాష్ట్రపతి నుంచి ‘నారీ పురస్కార్’ అందుకున్నాను. ఈ ఏడాది మహిళా దినోత్సవానికీ ‘ఢిల్లీ గౌరవ్ అవార్డ్’ దక్కింది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదు. అవార్డులు అన్నం పెట్టవు కదా! మేము ఆశించే సాయం మా కోసం కాదు... నలుగురి కోసం మేం చేస్తున్న ఓ మంచి పని కోసం. ఏదిఏమైనా మేం వెనక్కి తగ్గేది లేదు. మరికొన్ని అంబులెన్స్‌లు సమకూర్చాలనే ప్రయత్నాల్లో ఉన్నాం. ఒకరి ప్రాణం నిలబెట్టిన దానికి కంటే మించిన సంతృప్తి మరెందులోనూ ఉండదు కదా!’’
కేన్సర్ కబళిస్తున్నా...
నాకు అనేక ఆరోగ్య సమస్యలు. 2007లో హెపటైటిస్ బీ ఉందని తేలింది. 2020లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. రెండుసార్లు సర్జరీ చేయించుకున్నా. చాలాసార్లు కీమోథెరపీ సెషన్స్‌కు వెళ్లా. అయినా అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో నా దృక్పథం మారదు. హిమాన్షుకు కూడా హృదయ నాళాల్లో బ్లాకేజీలు ఉన్నాయి. అయితే డబ్బు లేక ఎప్పటికప్పుడు చికిత్స వాయిదా వేస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది... మా జీవితాన్ని మేం జీవించలేకపోతున్నామని. కానీ మాకు దక్కిన మంచి పేరు, అందే ఆశీర్వాదాలు, అభినందనలు, ఆప్యాయతల ముందు ఆ బాధ చిన్నదిగా కనిపిస్తుంది.
