రావులపాలెం రుచులు పోషక నిధులు!
ABN , First Publish Date - 2021-02-06T05:47:15+05:30 IST
చిరుధాన్యాలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. క్రమంగా ఇది గ్రామాలకు కూడా పాకుతోంది.

చిరుధాన్యాలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. క్రమంగా ఇది గ్రామాలకు కూడా పాకుతోంది. కోనసీమలోని రావులపాలెం అనే గ్రామంలో అలాంటి పోషకాహారం అందించే హోటల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి విటమిన్ ఇడ్లీ, పొట్టిక్కలు, దిబ్బరొట్టి రుచులను ఆస్వాదించడానికి ప్రజలు ప్రత్యేకంగా రావులపాలెం వెళుతుంటారు. ఆ రెసిపీల తయారీ విశేషాలు ఇవి...
చిట్టి పెసరట్టు
కావలసినవి
పెసలు, అల్లం, జీలకర్ర, కారం, ఉప్పు, నూనె
తయారీ విధానం
పెసలు ముందురోజు రాత్రి నానెబెట్టుకోవాలి.
ఉదయాన్నే వాటిని మెత్తగా రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి.
స్టవ్‌పై పెనం పెట్టి అరచేతి వెడల్పులో అట్టులా పోయాలి.
ఉప్పు, అల్లం, జీలకర్ర, కారం పొడి వేసి, కొద్దిగా నూనె వేసుకుంటూ బాగా వేగించుకోవాలి.
చట్నీతో సర్వ్ చేసుకోవాలి.

పొట్టిక్కలు
కావలసినవి
మినప్పప్పు, నూక, ఉప్పు, పనస ఆకు బుట్టలు
తయారీ విధానం
బాగా నానబెట్టుకున్న మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
తరువాత నూక కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పనస ఆకులతో చేసిన బుట్టలలో కొద్దిగా వేసి ఆవిరి మీద ఉడికించాలి.
వీటిని చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. పనస ఆకులతో ఉడకడం వల్ల పొట్టిక్కలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.

విటమిన్ ఇడ్లీ
కావలసినవి
రాగులు, బీట్‌రూట్, మినప్పప్పు, ఇడ్లీనూక, ఉప్పు, నూనె.
తయారీ విధానం
ముందురోజు రాత్రి మినప్పప్పు, రాగులు విడివిడిగా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత బీట్‌రూట్ ముక్కలు వేసి రుబ్బుకుని పిండి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీనూక కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఇడ్లీ కుక్కర్‌లో ఉడికించిన తరువాత చట్నీతో కలిపి సర్వ్ చేసుకోవాలి.

పాలకొల్లు దిబ్బరొట్టి
కావలసినవి
మినప్పప్పు, ఇడ్లీనూక, ఉప్పు, నూనె.
తయారీ విధానం
ముందు రోజు రాత్రి మినప్పప్పు నానబెట్టుకోవాలి.
తరువాత మెత్తగా రుబ్బుకుని ఇడ్లీనూక కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి.
స్టవ్‌పై ఇత్తడి పాన్ పెట్టుకుని దళసరిగా రొట్టి వేసుకోవాలి. రెండు వైపులా నూనె వేసుకుంటూ బాగా కాల్చాలి.
చట్నీతో లేదా తేనెపానకంతో సర్వ్ చేసుకోవాలి.

బొంబాయి చట్నీ
కావలసినవి
సెనగపిండి, నూనె, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ, ఉల్లిపాయలు, అల్లం ముక్క, టొమాటో, చింతపండు, నిమ్మఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొత్తిమీర.
తయారీ విధానం
ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పై ఒక వెడల్పాటి పాత్ర పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి.
తరువాత ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించుకోవాలి. అల్లంముక్క వేయాలి. టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
పసుపు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగిన తరువాత సెనగపిండి మిశ్రమం పోయాలి.
మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికించాలి.
చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి.
ఈ చట్నీ దోశ, పూరీ, చపాతీ, ఇడ్లీలోకి రుచిగా ఉంటుంది.

మొలకల వడ
కావలసినవి
పెసలు, బొబ్బర్లు, సెనగలు, ఉప్పు, నూనె
తయారీ విధానం
ముందుగా పెసలు, బొబ్బర్లు, సెనగలను నానబెట్టుకోవాలి.
తరువాత మొలకలు వచ్చేందుకు గుడ్డలో కట్టి పెట్టాలి.
గింజలన్నీ మొలకలు వచ్చిన తరువాత రుబ్బి మెత్తగా పిండి తయారుచేసుకోవాలి.
స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె పోయాలి.
నూనె వేడెక్కిన తరువాత మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల్లా ఒత్తుకుంటూ నూనెలో వేసి వేగించాలి.
చట్నీతో వడ్డించాలి. పోషకాలు పుష్కలంగా లభించే మొలకల వడ ఆరోగ్యానికి చాలా మంచిది.
