రంగక్క అంటే పెత్తందారులకు హడల్‌

ABN , First Publish Date - 2021-09-30T05:30:00+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి పెత్తందారీలను హడలెత్తించిన

రంగక్క అంటే  పెత్తందారులకు హడల్‌

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి పెత్తందారీలను హడలెత్తించిన ధీర రంగక్క. ఆమె ఆనాడు నల్లమలలోని ఒక దళానికి అధినాయకురాలు. కొన్ని ఊర్లకు ఊర్లనే వెట్టిచాకిరీ నుంచి విడిపించారు. ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో పేదలకు భూములు పంచడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. అందుకే ఆమె అసలు పేరు సత్యవతి అయినా, రంగక్కగానే పోరుభూమికి సుపరిచితం. 95ఏళ్ల కొంజేటి సత్యవతి అలియాస్‌ రంగక్క తన ఉద్యమ జీవిత జ్ఞాపకాలను నవ్యతో పంచుకున్నారు. 


వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట క్షేత్రంలో నా పేరు రంగక్క. నేనొక దళానికి కమాండర్ని. గుండు రామయ్య, కోడి సరువులుతో పాటు మరొక ముగ్గురు నా దళంలో ఉండేవాళ్లు. నల్లమల అడవుల్లో కొండలు, గుట్టల మాటున నాలుగేళ్లు రహస్య జీవితం గడిపినా. అచ్చంపేట, అమ్రాబాద్‌ చుట్టుపక్క ఊర్లను పెత్తందారుల దోపిడీ, దౌర్జన్యాల నుంచి విడిపించినం. పద్మానపల్లి గ్రామంలో పేదోళ్లు పండించిన ధాన్యమంతా భూస్వామి ఎరుకల నాగమ్మ ఇంట్లో పెట్టుకుందని తెలిసింది.


అంతే.! మేమంతా అక్కడికి పోయి, ఆమెను తుఫాకీతోని అదిలించి ఆ ధాన్యాన్ని అక్కడికక్కడే పేదలకు పంచినం. అదే ఊరికి ఇటు ఎనకసిరి పోతే, నాగమ్మ కొడుకు, కూతురు నాకు శాలువ కప్పి సన్మానం కూడా చేసినరు. కాలం మారినది కదా.! ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో చానా పల్లెల్లో దొరలు, దేశ్‌ముఖ్‌ల భూములను పేదలకు పంచినం. అందుకే ‘రంగక్క’ పేరు వింటే అమ్రాబాద్‌ చుట్టుపక్క గ్రామాల్లోని పెత్తందారులు, జాగీర్దారులు హడలెత్తిపోయేటోళ్లు.!




నా పేరెలా మారిందంటే...

మా తల్లిగారిది ఉమ్మడి నల్గొండ జిల్లా చివ్వెముల. మా నాయన అప్పిరెడ్డి సన్నకారు రైతు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, రాఘవేంద్రరావు వంటి కమ్యూనిస్టు నాయకులు అప్పుడప్పుడు మా బావికాడ తలదాచుకునేటిది. మేము వాళ్లకు రహస్యంగా అన్నం పెడుతుండే. ఆ సంగతి తెలిసిన రజాకార్లు మా ఇంటిమీద దాడిచేయనీకి వస్తున్నరని మా నాయనకు సమాచారం అందినది. దాంతో ఇంట్లో వాళ్లంతా తలాదిక్కు పోయి తలదాచుకున్నరు. నేనేమో నడుచుకుంటూ జగ్గయ్యపేట పోయి రైలెక్కి విజయవాడ కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుకు చేరుకున్నా. అక్కడే నెలరోజులు ఉన్న తర్వాత, నాకూ పార్టీలో పనిచేయాలనుందని నాయకులకు చెప్పినా. అప్పుడు వాళ్లు నా పేరు రంగమ్మగా మార్చి, నల్లమలకు పంపినరు.


ఢిల్లీ నుంచి వచ్చిన ఒక కామ్రేడ్‌ మాకు తుపాకీ వాడకం మీద ట్రైనింగ్‌ ఇచ్చినడు. ఆ తర్వాత నన్ను దళ కమాండర్‌గా నియమించినరు. ఆయాల్టి సంది నన్ను ఎరిగినవారంతా రంగక్క అనే పిలుస్తరు. అప్పుడు నా వయసు పదిహేనేళ్లు. అంగీ, నిక్కరుతో భుజానికి ఒకవైపు రైఫిల్‌, మరోవైపు బుల్లెట్ల సంచీ తగిలించుకొని కొండలు, గుట్టలు ఎక్కిదిగుతూ, అడవిలనే మృగాలతో పాటు మేమూ తిరిగేటోళ్లం. అయినా, నేనెన్నడూ భయపడలె. ఒక్కోసారి ఎలుగొడ్లు ఎదురొస్తే, అగ్గిపుల్ల గీసి వేసేటోళ్లం. దాంతో అవి మా జోలికి రాకపోతుండె. 


అడవిలోనే నా పెళ్లి...

ఆనాటి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు కొంజేటి నారాయణ నాగర్‌కర్నూలు ప్రాంతంలోని మరొక దళానికి కమాండర్‌. ఆయన సొంతూరు పెంచికల్‌ దిన్నె. నిజానికి ఆయనకన్నా మొదలే నేను అడవిలోకి వచ్చినా. అక్కడే ఒకరికొకరం పరిచయం అయినం. ఆ తర్వాత కొన్నాళ్లకు మేమిద్దం పెళ్లి చేసుకుంటే మంచిగుంటదని నేను తండ్రిలా భావించే చల్లా సీతారాంరెడ్డితో పాటు పుచ్చలపల్లి సుందరయ్య, ఎల్వీ గంగాధరరావు వంటి పార్టీ పెద్దలంతా ప్రతిపాదించినరు. మేమూ ఒకరికొకరం ఇష్టపడినం. కమ్యూనిస్టు పార్టీ నాయకుల మధ్య కార్యకర్తల సమక్షంలో అమ్రాబాద్‌ అడవుల్లోని ఒక కొండమీద మా పెళ్లి జరిగింది. మాది కులాంతర వివాహం. ఆయన చానా మంచి మనిషి. డెభ్భై ఐదేళ్ల మా కాపురంలో నాకెన్నడూ ఇసుమంతైనా కష్టం కలిగించలేదు.! అంత మంచిగ చూసుకున్నడు.


ఒక్కరూపాయి పంచకుండా రెండు సార్లు గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి గెలిచిండు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినా, ఊరోళ్ల యాదిలో మంచి మనిషిగా మిగిలిండు. నారాయణ చనిపోయి ఏడాది అవుతున్నా, ఆ బాధ మాత్రం నన్నింకా ఎంటాడుతునే ఉంది(చెమ్మగిల్లిన కళ్లను చీర కొంగుతో తుడుచుకుంటూ..). 




ఆంధ్రాలో పురుడుపోసుకున్నా...

పెళ్లైయ్యాక కొన్నాళ్లకు గర్భవతిని కావడంతో నన్ను గుంటూరులోని ఒక పార్టీ నాయకుడి బంధువుల ఇంట్లో ఉంచిర్రు. కొంతకాలం నర్సరావుపేటలోనూ ఉన్నను. నెలలు నిండే సమయానికి ఒంగోలుకి మకాం మార్చినం. అక్కడే ఒక ఆస్పత్రిలో కాన్పు అయింది. ఆ సమయంలో నా పరిస్థితి... బాబు పుట్టాడని సంతోషం ఒకవైపు, నారాయణ దగ్గరలేడనే బాధ మరోవైపు. అమ్మగారింట తొలికాన్పు జరగాలంటరు కదా.!


కానీ నేను ఆంధ్రాలో పురుడుపోసుకున్నా. అప్పటి సంది అదే నా పుట్టిల్లు. ఆ తొమ్మిది నెలలు ఆంధ్రోళ్లు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నరు. సొంత బిడ్డలా ఆదరించినరు. బాబుకి మూడోనెల వచ్చే వరకు ఒంగోలులోని ఒక పార్టీ కామ్రేడ్‌ ఇంట్లో ఉన్నా. తర్వాత పిల్లాడిని భుజానేసుకొని తిరిగి నల్లమలకు చేరుకున్నా. 


సాయుధ పోరాట విరమణ తర్వాత ఒకరోజు ఆత్మకూరులో రైతు సభకువెళ్లిన నన్ను పోలీసులు అరెస్టు చేసినరు. కేసుల వల్ల అండర్‌ గ్రౌండ్‌లోనే ఉన్న కొందరు నాయకుల ఆచూకీ చెప్పమని పోలీసులు నన్ను విపరీతంగా హింసించినరు. పైగా నామీద తొమ్మిది కేసులు బనాయించినరు. అవేవీ కోర్టులో నిలవలేదు. అయినా, ఏడాదిన్నర జైల్లో నిర్బంధించనరు. 


జైల్లోనూ పోరాటం...

పసిబిడ్డ తల్లిననికూడా కనికరం చూపకుండ నన్ను మహబూబ్‌నగర్‌ జైల్లో ఏడాది నిర్బంధించినరు. నాతో పాటు మరో  ముఫ్ఫైమంది ఆడవాళ్లు రాజకీయ ఖైదులో ఉన్నరు. మా అందరికీ వారానికి ఒకటే సబ్బు ఇచ్చేటిది. మాకు సరిపడా సబ్బులు, వేడినీళ్లు ఇవ్వాలని తోటి ఖైదీలను సమాయత్తం చేసి జైల్లోనూ ఉద్యమించినా. అప్పుడు జైలరు దిగొచ్చినడు. ఒక్కొక్కరికీ నెలకొక సబ్బు, రోజుకొక బకెట్‌ వేడినీళ్లు ఇవ్వడం షురూ చేసినరు. తర్వాత నన్ను చంచల్‌గూడ జైలుకి పంపినరు. అక్కడా ఆరునెలలు శిక్ష అనుభవించిన. అప్పుడు నా పెద్దకొడుకు జ్యోతిబాబుకు రెండేళ్లు. వాడు కూడా నాతో పాటే జైల్లో ఉన్నడు. 


నేను చచ్చిపోయాననుకున్నరంతా...

ఒకరోజు నల్లమలలోని ఒక గయిలో గుట్టకానుకొని అలా తలవాల్చానోలేదో తుపాకీ తూటాల చప్పుళ్లు వినిపించినయి. కళ్లు తెరిచిచూస్తే, గుట్ట చుట్టూ పోలీసు బలగం. అందులోని ఒక పోలీసు బయోనెట్‌తో నన్ను పొడవనీకి దగ్గరకొచ్చిండు. ఆ సమయంలో నాకు కాళ్లు, చేతులు ఆడలేదు. నా సరంజామానంతా అక్కడే వదిలేసి రైఫిల్‌తో అక్కడి నుంచి ఉరికినా. ఎక్కడికి పోతున్ననో కూడా తెల్వటంలేదు. అప్పటికే దళసభ్యులమంతా చీలినం. ఆ రోజంతా అడవులనే ఒంటరిగా దాంకొని, తెల్లారాక ఒక చెంచుగూడేనికి చేరిన. అక్కడి వాళ్లు నా కాళ్లకు కాపుకాసి, గాయాలకు లేపనం పూసి నన్ను తిరిగి మనిషిని చేసినరు. నా జాడ తెలియకరాక ‘రంగక్క చనిపోయింద’ని సుందరయ్య కరపత్రం కూడా విడుదలచేసినడు. తర్వాత గూడెపోళ్ల ద్వారా నేను బతికున్ననని లోకానికి తెలిసింది. 





మా ఊరికి మాస్కోగా పేరు...

పెంచికల్‌ దిన్నెకు తెలంగాణ ‘మాస్కో’గా పేరు. 

మా ఊరి నుంచి చాలామంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నరు. నిజాం నిరంకుశత్వాన్ని, భూస్వాముల ఆగడాలను వ్యతిరేకించిన ఏడుగురు పోరాట యోధులను 1948 జనవరిలో రజాకార్లు చెట్టుకు కట్టేసి కాల్చి చంపిండ్రు. వాళ్ల స్మారక స్తూపాలకు ప్రతియేటా ఊరంతా నివాళులు అర్పిస్తుంది. 


ఎర్రజెండా సాక్షిగా...

కమ్యూనిస్టు పార్టీలో చేరేనాడే శపథం చేసినా, ఎర్రజెండాను విడిసిపెట్టేదిలేదని. కమ్యూనిస్టు పార్టీ చీలినప్పుడు నా అసువంటోళ్లు చానా మంది బాధపడ్డరు. మరి, పార్టీ చీలికలు పీలికలవడంతో శత్రువుకి మరింత అలుసిచ్చినట్టు అయింది కదా! జనం కోసం పోరాడేవాళ్లంతా ఒక్కటి కావాలె. మళ్లీ ఎర్రజెండాకి పూర్వ వైభవం రావాలె. ఆ మంచిరోజుల కోసమే ఎదురుచూస్తున్నా. 


పింఛను కోసం తిరిగినా...

ఇప్పుడు నాకు 95ఏళ్లు. మోకాళ్ల నొప్పులున్నాయి. అంతకుమించి ఆరోగ్య సమస్యలేమీ పెద్దగా లేవు. ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటా. తెలంగాణకు కేసీఆర్‌ ఒక్కడే కాదు, మేమంతా ఈ చరిత్రకు వారసులమే.! కమ్యూనిస్టులు పోరాడకుంటే నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమవుతుండెనా.! కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తరేమోననే భయంతోనే అప్పటి కాంగ్రెస్‌ పోలీసు యాక్షన్‌ చేయించింది. తెలంగాణ సాయుధపోరాటంలో ఆయుధం పట్టిమరీ పోరాడిన నాకు ఇప్పటికీ పింఛను రావడంలేదు. మూడు సార్లు ఢిల్లీకి పోయినా లాభంలేకపాయె. 




మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, అచ్చంపేట చుట్టుపక్క గూడేల్లోని కొన్నివందలమంది చెంచులు తెలంగాణ సాయుధపోరాటంలో కార్యకర్తలుగా, కొరియర్లుగా, సహాయకులుగా పనిచేసినరు. వాళ్లల్లో చాలామంది తుపాకీ చేతబట్టి ప్రాణాలకు తెగించి మరీ పోరాడిండ్రు. వెట్టిచాకిరీ విముక్తి పోరాటంలో చెంచుల త్యాగం వెలకట్టలేనిది. 

 కె. వెంకటేశ్‌ 

ఫొటోలు: గుండు మహేశ్‌

Updated Date - 2021-09-30T05:30:00+05:30 IST