ఒంటికాలిపై త్రివిక్రముడు!
ABN , First Publish Date - 2021-04-23T05:30:00+05:30 IST
నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో విలక్షణమైనది తిరువిక్రమ పెరుమాళ్ ఆలయం. ఆళ్వారులు తమ దివ్య ప్రబంధాల్లో విశేషంగా కొనియాడిన ఈ క్షేత్రంలో మహా విష్ణువు త్రివిక్రమావతారంలో- ఒంటికాలిపై నిలబడి దర్శనం ఇస్తాడు...
నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో విలక్షణమైనది తిరువిక్రమ పెరుమాళ్ ఆలయం. ఆళ్వారులు తమ దివ్య ప్రబంధాల్లో విశేషంగా కొనియాడిన ఈ క్షేత్రంలో మహా విష్ణువు త్రివిక్రమావతారంలో- ఒంటికాలిపై నిలబడి దర్శనం ఇస్తాడు.
దుష్ట శిక్షణ కోసం మహా విష్ణువు ధరించిన దశావతారాల్లో పూర్తి మానవరూపంలోని మొదటి అవతారం వామనుడు. వటువు బ్రహ్మాండమంతై... భూమ్యాకాశాలను ఆక్రమించి, త్రివిక్రముడైన ఆ అవతార ఘట్టాన్ని కళ్ళముందు నిలబెట్టే ఆలయం తమిళనాడులోని తిరుక్కోవిళ్ళూరులో ఉంది. ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని ఆకాశం వైపు లేపి... ఒంటికాలిపై నిలిచిన ఈ భంగిమ మరెక్కడా కనిపించదు. మూడు చేతుల్తో శంఖం, చక్రం, గద ధరించిన స్వామి కుడి చేతి చూపుడు వేలుతో ఆకాశాన్ని చూపిస్తూ ఉంటాడు. అంతేకాదు, తమిళనాడులోని వైష్ణవ దివ్య క్షేత్రాలన్నిటిలోనూ ఎత్తైన మూలవిరాట్ కూడా ఈ ఆలయంలోనే ఉంది. ఈ విగ్రహం ఇరవై ఒక్క అడుగుల ఎత్తులో ఉంటుంది.
స్థలపురాణం ప్రకారం, బలి చక్రవర్తిని మూడడుగుల స్థలం అడిగిన వామనుడు... తన పరిమాణాన్ని అనంతంగా పెంచుకుంటూ... ఒక అడుగుతో నేలనూ, మరో అడుగుతో ఆకాశాన్నీ ఆక్రమించాడు. మూడో అడుగును బలి చక్రవర్తి తలపై వేసి అతణ్ణి పాతాళంలోకి తొక్కాడు. ఆ తరువాత, దేవతల కోరిక మేరకు ఈ ప్రదేశంలో త్రివిక్రముడిగా వెలుస్తానని మాట ఇచ్చాడు. కొంతకాలం తరువాత, అక్కడికి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో మృకండు మునిని కలుసుకోవడానికి ముగ్గురు ఆళ్వారులు వచ్చారు. ఆ రాత్రి వేళ బయట వర్షం పడుతూ ఉండడంతో ఆశ్రమంలోని ఒక గదిలోకి వెళ్ళి తలదాచుకున్నారు. అయితే గది ఇరుకుగా ఉన్నట్టు, అక్కడ మరెవరో ఉన్నట్టు అనిపించింది. ఆ చీకటిలో పరిశీలనగా గమనిస్తే... అక్కడ పెరుమాళ్ విగ్రహం కనిపించింది. మునికి ఈ విషయం వివరించి, ఆ ఆయన అనుమతితో స్వామికి ఆరాధనలు చేశారు. ఆనాటి నుంచి ‘తిరువిక్రమ’ లేదా ‘త్రివిక్రమ పెరుమాళ్’గా మహావిష్ణువు ఇక్కడ పూజలందుకుంటున్నట్టు స్థలపురాణం వివరిస్తోంది. ఈ స్వామినే ‘ఉలగలంత పెరుమాళ్’ అని కూడా పిలుస్తారు. ఆయన దేవేరి పూంగోవై నాచియార్. తిరువిక్రమ పెరుమాళ్ ఉత్సవ మూర్తిని ఆయనార్‌గానూ, అమ్మవారి ఉత్సవ మూర్తిని పుష్పవల్లీ తాయారుగానూ వ్యవహరిస్తారు. ఆ ఆలయం ఆవరణలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి.
తిరువికమ్ర పెరుమాళ్ ఆలయం సుమారు రెండువేల ఏళ్ళనాటిదని స్థానికుల విశ్వాసం. క్రీస్తుశకం ఆరు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్య కాలం నాటి ఆళ్వారుల దివ్య ప్రబంధాల్లో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. తిరువిక్రమ పెరుమాళ్ ఆలయంలోని నాలుగు స్తంభాల్లో తూర్పువైపు స్తంభం 192 అడుగుల ఎత్తులో ఉండడం మరో విశేషం. దక్షిణాదిన ఎత్తైన స్తంభాల్లో ఇది మూడవదని చెబుతారు.
శిల్ప సౌందర్యంతో ఆకట్టుకొనే ఈ ఆలయాన్ని మధ్యయుగ చోళ రాజుల కాలంలో నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. విజయనగర రాజులు, మధురై నాయక రాజులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారని శాసనాలు చెబుతున్నాయి. ఈ దివ్య క్షేత్రం పెన్నార్ నది ఒడ్డున ఉంది. ఆ నదీ స్నానం, స్వామి దర్శనం పాప విముక్తినీ, అభీష్టసిద్ధినీ కలిగిస్తాయని భక్తుల విశ్వాసం.
