అదే అసలైన యజ్ఞం!

ABN , First Publish Date - 2021-02-05T05:32:38+05:30 IST

‘‘నా ప్రబోధాలు ఆకలిని మరపించేలా చేసే గారడీలు కాదు. మనసును మైమరపించేలా చేసే వినోద క్రీడలు కావు. ‘ఆకలి’ అనేది మనిషి మందు వాడినా తగ్గని బాధ... మహా రోగం. ఈ రోగానికి తియ్యని కబుర్లు ఔషధాలు

అదే అసలైన యజ్ఞం!

‘‘నా ప్రబోధాలు ఆకలిని మరపించేలా చేసే గారడీలు కాదు. మనసును మైమరపించేలా చేసే వినోద క్రీడలు కావు. ‘ఆకలి’ అనేది మనిషి మందు వాడినా తగ్గని బాధ... మహా రోగం. ఈ రోగానికి తియ్యని కబుర్లు ఔషధాలు కావు. అన్నమే దానికి ఏకైక ఔషధం’’ అన్నాడు బుద్ధుడు. ‘శాస్త్రీయం, ధార్మికం, నైతికం, సామాజికం’ అనే నాలుగు కాళ్ళమీద స్థిరంగా నిలబడిన ధర్మం... బౌద్ధం. బుద్ధుని ప్రబోధాల్లో ఈ నాలుగు అంశాలూ సమపాళ్ళలో ఉంటాయి. సామాజిక రుగ్మతలకు బౌద్ధం ధార్మిక పూతలు పూసి మాయ చెయ్యదు.


ఒక రోజున... ఒక పెద్ద గ్రామంలో బుద్ధుడు ప్రబోధం చేస్తున్నాడు. ఆ గ్రామంలోని ధనవంతులు, ప్రజలు, రాజ కుటుంబీకులు, రాజోద్యోగులు... అందరూ హాజరయ్యారు. కానీ, బుద్ధుడి ప్రబోధాలంటే ఎంతో ఇష్టపడే సునందుడు అనే ఒక రైతు మాత్రం రాలేదు. 


బుద్ధ ప్రబోధం ఉందని అతనికి తెలుసు. అతను వేకువజామునే పొలానికి వెళ్ళాడు. నాగలి కట్టాడు. పది కొండ్రలు వేశాడు. అప్పటికే సగం పొలం దున్నాడు. పొద్దెక్కింది. ‘బుద్ధుడు ధర్మప్రబోధం ప్రారంభించే ఉంటాడు’ అనుకున్నాడు. నాగలి విప్పాడు. చేను మధ్యలో ఉన్న నీటి చెలమలోకి దిగి, ముఖం కడుక్కున్నాడు. కడుపారా మంచి నీరు తాగి, పైకి వచ్చాడు. అతని రెండు ఎద్దులలో ఒకటి కనిపించలేదు. అది పక్క తోటలోకి వెళ్ళింది. దాన్ని వెతికి, తోలుకొని ఇంటికి వచ్చేసరికి సమయం గడిచింది. ఎడ్లను కట్టేసి మేత వేశాడు. కాస్త ఎంగిలి పడి వెళ్ళు అని అతని భార్య ఎంత చెప్పినా వినకుండా... బుద్ధుడు ప్రబోధించే చోటుకు పరుగు పరుగున వచ్చాడు. 


అప్పటికే బుద్ధుడు ప్రసంగిస్తున్నాడు. ఆయనకు సునందుడు నమస్కరించి, ఒక మూల కూర్చున్నాడు. బుద్ధుడు ప్రబోధం చేస్తూనే... సునందుడి ముఖ వాలకాన్ని బట్టి అతని పరిస్థితి తెలుసుకున్నాడు. తన ప్రసంగాన్ని ఆపేశాడు. సాధారణంగా బుద్ధుడు ప్రసంగాన్ని మధ్యలో ఆపడు. కానీ, అలా ఆపేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.


ఆ గ్రామ పెద్దను బుద్ధుడు పిలిచి ‘‘ముందు ఆ రైతు ఆకలి తీర్చండి’’ అని చెప్పాడు బుద్ధుడు.

సునందుడు వెళ్ళి, అన్నం తిని వచ్చాకే తన ప్రబోధం తిరిగి మొదలు పెట్టాడు. ‘ఆకలికి ఔషధం అన్నం’ అనే వాక్యాలు ఆ సందర్భంగా చెప్పినవే! ‘పగలనకా, రేయనకా ఆరుగాలం శ్రమించి, పండించి, అందరికీ అన్నం పెట్టే రైతులు ఆకలితో అల్లాడుతూ ఉంటే... వారి ఆకలి తీర్చాలి, ఆకలి తీరే మార్గాలు చేపట్టాలి తప్ప... శుష్క ఆధ్యాత్మిక ప్రబోధాలు అనవసరం, అప్రస్తుతం’’ అని ఈ ప్రబోధ సందేశం.


వ్యవసాయానికీ, వ్యవసాయదారులకూ, వారి శ్రమకూ బుద్ధుడు ఎనలేని గౌరవం ఇచ్చాడు. యజ్ఞం చేసి, జంతువులను బలి ఇస్తే దేశానికి క్షేమం కలుగుతుందనీ, క్షామం తొలగుతుందనీ భావించి.. యజ్ఞాలు చేసే కోసల రాజు ప్రసేనజిత్తుకూ, జేతవనం సమీపంలో ఉన్న ఉద్గాత శరీరుడికీ, ఖాణుమంతం గ్రామానికి చెందిన కూటదంతునికీ క్షామం తొలగాలంటే చేయాల్సిన అసలైన యజ్ఞం ఏమిటో బుద్ధుడు వివరించాడు. అదే ‘రైతు సంక్షేమం’ అనే యజ్ఞం. నీటి వసతులు, ఉచిత వ్యవసాయక పరికరాలు, ఉచిత విత్తనాల సరఫరా, ఋణ మాఫీలు, వడ్డీల రద్దు, పంచల ప్రోత్సాహకాలు... ఇలాంటివి ప్రభుత్వం చేయాల్సిన పనులని గట్టిగా ప్రబోధించాడు. బుద్ధుడు చెప్పిన ఈ అంశాలన్నిటినీ అశోకుడు అమలు పరచి, అజరామర కీర్తిని పొందాడు. రైతుల సంక్షేమం ద్వారా ప్రపంచంలో మరెవరూ సాధించని ఆర్థిక వృద్ధిని సాధించిన చక్రవర్తిగా నిలిచాడు.


బుద్ధుడు తన ధర్మమార్గాన్ని కూడా వ్యవసాయంతోనే పోల్చాడు. తానూ ఒక రైతునే అని చెప్పకనే చెప్పాడు. కసిభరద్వాజుడు అనే పండితుడితో- ‘‘భరద్వాజా! నాది ధర్మక్షేత్రం. ఈ క్షేత్రంలో దున్నే నాగలి ప్రజ్ఞ. తప్పు చేస్తామనే భీతి- కాడినీ, మేడినీ కలిపి కట్టే త్రాడు. శ్రద్ధ... నేను చల్లే విత్తనం. మనసు... ఎద్దులకు కట్టిన పగ్గం. స్మృతి... నేను పట్టే ముల్లుగర్ర, మితాహారం... నా క్షేత్రానికి చుట్టూ రక్షణగా ఉండే కంచె. సత్యం... కలుపును తీసే గొర్రు. నా శారీరక, మానసిక శక్తులే నాగలిని లాగే ఎద్దులు. అరహంతఫలం... విప్పేసిన నాగలి’’ అంటాడు.


ఇలా తన ధర్మ మార్గాన్ని వ్యవసాయంతో, తనను వ్యవసాయదారునితో (రైతుతో) పోల్చుకున్న ధార్మికుడు, తాత్త్వికుడు గౌతమ బుద్ధుడు. రైతుల సంక్షేమాన్ని ఆశించిన రైతు బాంధవుడు. 

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-02-05T05:32:38+05:30 IST