శక్తి ప్రదాత

ABN , First Publish Date - 2021-08-13T05:30:00+05:30 IST

మన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురవుతాయి. కొన్ని పనులు చాలా కష్టంతో కూడుకొన్నవి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి మనకున్న బలం సరిపోదు. ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు ఏం చెయ్యాలి?...

శక్తి ప్రదాత

మన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురవుతాయి. కొన్ని పనులు చాలా కష్టంతో కూడుకొన్నవి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి మనకున్న బలం సరిపోదు. ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు ఏం చెయ్యాలి? ‘‘ఈ భూమండలం అంచులను సృష్టించిన యెహోవా ఎన్నటికీ భగవంతుడే! దేవుడు ఎన్నడూ సొమ్మసిల్లిపోడు, ఆయనకు అలసట అనేది రానే రాదు. ఆయన అవగాహనను పరీక్షించడం ఎవరివల్లా కాదు. అలసట పొందినవారికి ఆయన శక్తిని అందిస్తాడు. బలం లోపించిన వారికి సంపూర్ణమైన బలాన్ని కటాక్షిస్తాడు. పిల్లలు అలసిపోవచ్చు. యువకులు సొమ్మసిల్లిపోవచ్చు. కానీ, యెహోవాను నమ్మి జీవించేవారు సరికొత్త శక్తిని పొందుతారు. వాళ్ళు పక్షుల్లా రెక్కలు విప్పుకొని, ఆకాశంలోకి ఎగురుతారు. వారు పరిగెత్తినా అలసట రాదు. ప్రయాణంలో సొమ్మసిల్లిపోరు’’ అంటాడు యెషయా ప్రవక్త.  దేవుడు మహా శక్తిమంతుడే కాదు, శక్తి ప్రదాత కూడా! తన అనంతమైన శక్తి నుంచి మానవులకు అవసరమైన బలాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. లౌకికమైన మార్గంలోనే కాదు, దైవాన్ని అన్వేషించే జ్ఞానమార్గంలోనూ కొన్నిసార్లు బలహీనులమైపోతాం. దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు దైవం పట్ల ఉన్న విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కార్యసాఫల్యతకు అవసరమైన శక్తి మనకు అందేలా చేస్తుంది. అందుకే, కర్తవ్యాలను సక్రమంగా నెరవేర్చే శక్తిని అనుక్షణం మనలో నింపుతూ ఉండాలని దైవాన్ని కోరుకోవాలి.

Updated Date - 2021-08-13T05:30:00+05:30 IST