అహంకారం తగదు...

ABN , First Publish Date - 2021-02-05T05:39:23+05:30 IST

నాయకుడు గొప్పవాడే కావచ్చు. అంతా నేనే అనుకోకూడదు. ఈ విషయాన్ని ‘భాస్కర శతక’ కర్త మారద వెంకయ్య ఒక పద్యంలో చెప్పారు.

అహంకారం తగదు...

నాయకుడు గొప్పవాడే కావచ్చు. అంతా నేనే అనుకోకూడదు. ఈ విషయాన్ని ‘భాస్కర శతక’ కర్త మారద వెంకయ్య ఒక పద్యంలో చెప్పారు.


ఆరయ నెంత నెంత నేరుపరియైు చరియించిన వాని దాపునన్‌

గౌరవ మొప్పగూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే

కూర దదెట్లు; హత్తుగడ గూడునె, చూడ బదాఱువన్నె బం

గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!


నాయకుడు ఎంత నేర్పు కలిగినవాడైనా ఒక్కొక్కసారి అతనికి సహనాయకుడిగా సమర్థుడైన వ్యక్తి ఉండాలి. లేకపోతే మేలు జరగదు. ఎంత గొప్ప నాయకుడైనా ‘నేను అసహాయశూరుడిని’ అని గర్వపడడం మంచిదికాదు. నాయకుడికి ఒక మంచివాడు తోడు ఉండాలి. ఏ విధంగా అంటే, బంగారం అతుకు పెట్టడానికి వెలిగారం అని ఒక పదార్థాన్ని ఉపయోగిస్తారు. బంగారంలో ఈ వెలిగారాన్ని కాస్త కలపకపోతే, అతుకుపెట్టడం కుదరదు. అతుకు పెట్టకుండా నగలు ఎలా చేస్తారు? బంగారంలో రత్నాలు తాపడం చెయ్యడం, కొక్కెలు అతకడం లాంటి పనులు ఎలా జరుగుతాయి? ‘నేను బంగారాన్ని! నాకు ఎవరి సహాయం అవసరం లేదు’ అంటే బంగారం బంగారంలాగానే ఉంటుంది.  అలాగే నువ్వు ఎంత గొప్పవాడివైనా ఒక్కొక్కసారి నీకు పక్కవాడి సాయం కావాలి. ఆ వ్యక్తి చాలా చిన్నవాడు కావచ్చు, మామూలు వాడు కావచ్చు, అతని సాయం నీకు అవసరం అవుతుంది. ‘ఎంత బంగారం పళ్ళెమైనా గోడ చేర్పు’ అవసరం అన్నారు పెద్దలు. జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా... నాకు ఎవరి సాయం అవసరం లేదనే అహంకారం తగదు. కాస్త మంచివాళ్ళు ఒకరిద్దరి నుంచి సాయం తీసుకోవడంలో తప్పులేదు.గరికపాటి నరసింహారావు

Updated Date - 2021-02-05T05:39:23+05:30 IST