నిష్పాక్షికతే అర్హత
ABN , First Publish Date - 2021-10-29T08:55:02+05:30 IST
గొప్ప ఖలీఫాగా చరిత్రలో సుప్రసిద్ధుడు ఉమర్ ఫారూఖ్. ఆయన ఎవరినైనా న్యాయధికారిగా నియమించాలంటే... ముందు అతణ్ణి నిశితంగా పరీక్షించేవారు.

గొప్ప ఖలీఫాగా చరిత్రలో సుప్రసిద్ధుడు ఉమర్ ఫారూఖ్. ఆయన ఎవరినైనా న్యాయధికారిగా నియమించాలంటే... ముందు అతణ్ణి నిశితంగా పరీక్షించేవారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పక్షపాతం వహించని స్వభావం ఉన్నవారినే ఆ పదవులకు ఎంపిక చేసేవారు.
ఒకసారి గుర్రాన్ని కొనాలని ఉమర్ అనుకున్నారు. కొన్ని గుర్రాలను ఒక వ్యాపారి తీసుకువచ్చాడు. ఒక గుర్రాన్ని పరీక్షించడం కోసం దానిపైకి ఉమర్ ఎక్కి స్వారీ చేశారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ గుర్రం కాలు జారి కిందపడింది, దానికి గాయలయ్యాయి. దాన్ని తీసుకుపొమ్మని గుర్రాల వ్యాపారికి ఆయన చెప్పారు. అతను ఆ గుర్రాన్ని వాపసు తీసుకోవడానికి నిరాకరించాడు. ఇద్దరూ తీర్పు కోసం ఒక న్యాయాధికారి దగ్గరకు వెళ్ళారు.
వారు చెప్పినదంతా విని, ఉమర్‌తో ఆ న్యాయాధికారి ‘‘మీరు ఈ గుర్రాన్ని కొనాల్సిందే. లేదా మీరు తీసుకున్నప్పుడు ఈ గుర్రం ఏ విధంగా ఉందో... అదే స్థితిలో అతనికి దాన్ని వాపసు చెయ్యాలి’’ అని ఎలాంటి మొహమాటం లేకుండా తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పు విని ఉమర్ ఫారూఖ్ ఎంతో సంతోషించారు. ఆ తరువాత ఆ న్యాయాధికారిని కూఫా ప్రాంతపు ఖాజి (న్యాయమూర్తి)గా నియమించారు.
మరో సందర్భంలో ఉమర్ ఫారూక్కూ, ఉబయ్యి బిన్కాబ్కు మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ వచ్చింది. న్యాయం కోసం ఈ వ్యవహారాన్ని న్యాయాధికారి జైద్ బిన్ సాబిత్ దృష్టికి ఉబయ్యి తీసుకువెళ్ళారు. నిందితునిగా హాజరైన ఉమర్‌ను... ఖలీఫా కాబట్టి జైత్ ఎంతో గౌరవించారు. ప్రత్యేక ఆసనంలో కూర్చోమని చెప్పారు. కానీ ఉమర్ అందుకు అభ్యంతరం చెబుతూ ‘‘జైద్! ఇది నీ మొదటి అన్యాయం’’ అన్నారు. నేరుగా వెళ్ళి ఉబయ్యి పక్కన కూర్చున్నారు.
ఉమర్‌కు వ్యతిరేకంగా ఉబయ్యి దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. ఆ దావాను ఉమర్ నిరాకరించారు. దీంతో ఉమర్‌తో ప్రమాణం చేయించాలని ఉబయ్యి కోరారు. కానీ ఖలీఫా హోదాను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి జైద్ ‘‘ఆయనకు ప్రమాణం నుంచి మినహాయింపు ఇవ్వండి’’ అని ఉబయ్యిని అడిగారు.
జైద్ ప్రదర్శించిన ఈ రెండవ పక్షపాత వైఖరిని గమనించిన ఖలీఫా ఉమర్ మాట్లాడుతూ ‘‘జైద్! న్యాయం చేసేటప్పుడు ధనికుడు, నిరుపేద, సాధారణ వ్యక్తి, ఖలీఫానైన నేను నీ దృష్టిలో సమానులు కానంతవరకూ నీవు ఖాజీ పదవికి అర్హుడవని భావించలేం’’ అని చెప్పారు. తీర్పు చెప్పు స్థానంలో ఉండడానికి అర్హత నిష్పాక్షికతేనని స్పష్టం చేశారు.
మహమ్మద్ వహీదుద్దీన్