ప్రజ్ఞకు చిహ్నం

ABN , First Publish Date - 2021-06-25T05:30:00+05:30 IST

ప్రపంచంలోని చాలా దేశాల్లో చెట్లకు ఉన్న ప్రాధాన్యం కేవలం ఆహార అవసరాలకూ, గృహ నిర్మాణాలకే కాదు... ధార్మిక

ప్రజ్ఞకు చిహ్నం

ప్రపంచంలోని చాలా దేశాల్లో చెట్లకు ఉన్న ప్రాధాన్యం కేవలం ఆహార అవసరాలకూ, గృహ నిర్మాణాలకే కాదు... ధార్మిక మార్గంలో, ఆధ్యాత్మిక రంగంలో కూడా వాటికి విశేష గౌరవం ఉంది. పూజలు అందుకొనే చెట్లు అనేకం ఉన్నాయి.

బౌద్ధంలో బుద్ధుని ధార్మిక జీవనానికి సంబంధించి 22 చెట్లు కనిపిస్తాయి. వాటిలో విశేషమైనవి బోధి వృక్షం (రావి చెట్టు), సాల వృక్షం. బుద్ధుడు పుట్టింది సాల వృక్షం కింద. అలాగే మహాపరినిర్వాణం పొందినది కూడా రెండు సాల వృక్షాల కిందే! బౌద్ధంలో సాల పుష్పాలను అనిత్యతకూ, ప్రజ్ఞకూ (బుద్ధి కుశలతకూ) చిహ్నాలుగా చెబుతారు. ఇంటిని ‘శీల’ అంటారు. ఇంటి నిర్మాణానికి సాల కలపను ఉపయోగిస్తారు. కాబట్టే దాన్ని ‘శాల’ లేదా ‘సాల’ అని పిలుస్తారు. బౌద్ధుల ఆరాధనా వృక్షాల్లో సాల వృక్షం ఒకటి. బౌద్ధ మహాయాన సంప్రదాయం ప్రకారం వెస్సభు, కొండణ్ణ అనే బుద్ధులు సాల వృక్షం కింద జ్ఞానోదయం పొందారు. కాబట్టి సాల వృక్షం బోధి వృక్షం కూడా. ఆ వృక్షం ప్రజ్ఞను తెలియజేసే గొప్ప కథ ఇది.



పూర్వం వారణాసిని బ్రహ్మదత్త మహారాజు పాలించేవాడు. ఆయన పరమ ధార్మికుడు. ఆ రోజుల్లో... జంబూద్వీపంలో రాజులందరికీ అనేక స్తంభాలతో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలు ఉండేవి. వాటికి భిన్నంగా, ఒకే ఒక స్తంభంతో విశిష్టమైన భవనాన్ని నిర్మించుకోవాలని బ్రహ్మదత్తుడు అనుకున్నాడు. వడ్రంగులను పిలిచి చెప్పాడు. వారు రాజ్యమంతా వెతికారు. ఎక్కడా వంకలు లేకుండా, చాలా ఎత్తుగా, లావుగా ఉన్న చెట్టు కనిపించలేదు. చివరకు వారు రాజుగారి ఉద్యానవనంలో వెతికారు. అక్కడ వారికి కావలసిన అన్ని లక్షణాలూ ఉన్న సాల వృక్షం కనిపించింది. దాని చుట్టూ వందల సాల వృక్షాలు ఉన్నాయి. కానీ ఇది అతి పురాతనమైనది కావడంతో... ఆ ప్రాంత ప్రజలు దానికి పూజలు జరుపుతున్నారు, నివేదనలు చేస్తున్నారు. 


వడ్రంగులు ఈ చెట్టు విషయం రాజుకు చెప్పారు. ‘‘మహారాజా! అది ప్రజలందరితో పూజలు అందుకుంటోంది. దాన్ని కొట్టలేం’’ అన్నారు.


‘‘అది నా వనంలో ఉంది. దానిపై నాకు మాత్రమే హక్కు ఉంది. మీరు నిరభ్యంతరంగా వెళ్ళి, ఆ చెట్టును కొట్టి తీసుకురండి. అందమైన ఒంటి స్తంభం మేడ నిర్మించండి’’ అని ఆజ్ఞాపించాడు రాజు.


వడ్రంగులు ఆ వృక్షం వద్దకు వెళ్ళి, దానికి పూజలు చేసి, నివేదనలు సమర్పించి- ‘‘వృక్ష దేవతా! ఇది రాజాజ్ఞ. ఈనాటికి ఏడో రోజున వచ్చి నిన్ను కొట్టేస్తాం. ఆ పాపం మాకూ, మా బిడ్డలకూ చెందకుండుగాక!’’ అని మన్ననలు వేడుకొని వెళ్ళిపోయారు.


ఆ వృక్షం వారి మాటలు వింది. మొదట బాధపడింది. తరువాత స్థిమితంగా ఆలోచించింది. ఆ రాత్రి మిరుమిట్లు గొలిపే దేవతారూపంలో రాజుగారి గదిలోకి వెళ్ళింది.


రాజు లేచాడు. విషయం తెలుసుకున్నాడు. ‘‘వృక్షమా! నా భవన నిర్మాణం కోసం నిన్ను కొట్టక తప్పదు’’ అన్నాడు. 


‘‘అలాగే మహారాజా! అయితే నాదొక మనవి. నన్ను కొట్టేటప్పుడు ముందుగా చిటారు కొమ్మల్ని నరకండి. ఆ తరువాత మధ్య భాగంలో కొమ్మల్ని ఒక్కొక్కటీ నరికి, కాండాన్ని కూడా మధ్యకు నరకండి. ఆ తరువాత వేర్లనూ, మొదలు భాగాన్నీ నరకండి’’ అంది.


‘‘ఒక్కసారిగా మొదలంటా నరికితే నీకు బాధ తక్కువ. ఇలా ముక్కలు ముక్కలుగా నరికితే మరింత బాధ కదా! ఇదేం కోరిక?’’ అని అడిగాడు రాజు.


‘‘ఇతరుల సుఖం కోసం నేను ఎంత బాధనైనా భరిస్తాను రాజా! నా చుట్టూ ఎన్నో చెట్లు ఉన్నాయి. మీరు నన్ను మొదలంటా ఒకేసారి నరికితే నా మహా దేహం ఎన్నో చెట్ల మీద పడి, వాటన్నిటినీ నాశనం చేస్తుంది. ఆ చెట్లన్నీ నా బంధువులు, మిత్రులు. నా వల్ల వాటికి నష్టం కలిగితే... నేను పొందే దుఃఖం ఎక్కువ. అందుకే వాటికి నష్టం వాటిల్లకుండా నన్నే ముక్కలు ముక్కలుగా నరికి తెచ్చుకోండి’’ అని అర్థించింది.


‘‘సరే! అలాగే!’’ అని రాజు మాట ఇచ్చాడు. కానీ ఆ మాట వల్ల తాను ఒంటిస్తంభం మేడ కట్టుకోలేనని తెలుసుకున్నాడు. ముక్కలుగా నరికిన చెట్టు ఒంటిస్తంభం భవనానికి పనికిరాదు కదా!


‘అయినా ఒక చెట్టే తన తోటి చెట్ల పట్ల ఇంత కరుణతో ఉంటే... నేనెందుకు ఉండకూడదు?’ అని ఆలోచించాడు. తన ఒంటిస్తంభం భవన నిర్మాణ ఆలోచనను రాజు విరమించుకున్నాడు.

 బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2021-06-25T05:30:00+05:30 IST