నిఘాలకే కింగ్ ‘పెగాసెస్’ హ్యాకింగ్
ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST
ఫోన్ టాపింగ్ మనకు తెలియని విషయం కాదు. అయితే పెగాసెస్ మరోసారి ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.

ఫోన్ టాపింగ్ మనకు తెలియని విషయం కాదు. అయితే పెగాసెస్ మరోసారి ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. దాంతో సహజంగానే ఈ వ్యవహారం ఆసక్తి కలిగిస్తోంది. అసలు దీని పూర్వపరాలు ఏమిటంటే..
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ రూపొందించిన స్పైవేర్ టూల్ ‘పెగాసెస్’. వ్యక్తులపై నిఘా ఉంచడమే దీని ఏకైక పని. ఈ సాఫ్ట్‌వేర్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఎన్ఎస్ఓ చెబుతోంది. ఈ సంస్థ అధికారికంగా తన క్లయింట్ల లిస్టును ఏమీ విడుదల చేయలేదు. అయినప్పటికీ 40 దేశాలకు చెందిన 60 మంది క్లయింట్లు దీనికి ఉన్నట్టు సమాచారం. మిలిటరీ, నిఘా సంస్థలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు సాధారణంగా ఈ తరహా సేవలను ఉపయోగించుకుంటూ ఉంటాయి. అలాగే దీని ఇన్స్టలేషన్ కూడా వ్యయభరితమే. ఆషామాషీగా ఏమీ ఈ వ్యవహారం లేదు. దీని లైసెన్స్ ఖర్చు 2016లో అంటే అయిదేళ్ళ క్రితం 6.50 లక్షల డాలర్లు. తదుపరి ఇక తన కేటలాగ్‌ను ఎన్ఎస్ఓ ప్రచురించలేదు. అలాగే ఒక లైసెన్స్‌తో పలు ఇన్స్టలేషన్స్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అది మళ్ళీ మరో ఖర్చు. ఎన్ఎస్ఓ ఆ విషయంలోనూ సహకరిస్తోందని సమాచారం. ఇన్స్టలేషన్స్కు తోడు దీంతో నిఘా పనులు చక్కబెట్టే వ్యక్తులకు శిక్షణ కూడా ఇస్తుంది. అందుకు మరో మూడున్నర లక్షల డాలర్ల వ్యయమవుతుంది. అయితే తానేమీ మానిటరింగ్ చర్యలు చేపట్టడం లేదని ఎన్ఎస్ఓ చెబుతోంది.
నిఘాలో భాగంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఒక లింకు పంపిస్తుంది. దాని మీద యూజర్ క్లిక్ చేస్తే చాలు, అటాకర్ ఆధీనంలోకి ఆ వ్యక్తి మొబైల్ వెళుతుంది. ఇక అక్కడి నుంచి నిఘా నిరాటంకంగా కొనసాగుతుంది. మొబైల్‌తో సకల వ్యవహారాలను నడుపుతున్న ఈ రోజుల్లో దాన్ని వివిధ పద్ధతుల్లో హ్యాక్ చేయడం, తమ పని కానిచ్చేసుకోవడం మోసగాళ్ళ వంతవుతోంది. తాజా విశేషం ఏమిటంటే. అధికారంలో ఉన్న వ్యక్తులు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటివి ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్‌కు తెలియ కుండా ఈ టూల్ తన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. ఒకసారి అది జరిగిన వెంటనే యూజర్‌కు సంబంధించిన డేటా అంతా అటాకర్కు చేరుతూ ఉంటుంది. వ్యక్తిగత డేటా పాస్వర్డ్, కాంటాక్ట్ లిస్ట్, ఈవెంట్స్ సహా సమస్తాన్ని ఇది ట్రాక్ చేయగలుగుతుంది. చివరకు వినియోగదారుడికి తెలియకుండానే ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్‌ను కూడా అటాక్ చేయవచ్చు. ఒక మిస్డ్‌కాల్‌తోనూ ఫోన్‌ను హ్యాక్ చేయవచ్చని కూడా అంటున్నారు.
పెగాసెస్ సహకారంతో ‘జీరో డే’ దోపిడికి పాల్పడవచ్చని చెబుతున్నారు. అంటే యూజర్‌కు తెలియకుండానే తన ఫోన్‌ని పెగాసెస్ తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఏ మాత్రం అనుమానం రాకుండా పనులు చక్కబెడుతూ ఉంటుంది. ఇబ్బందులు ఎదురైతే తనంతట తాను విధ్వంసానికి గురయ్యే సాంకేతికత ఈ టూల్‌కు ఉండటం మరో విశేషం. వాట్సాప్‌లో ప్రతి సందేశం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. అయినప్పటికీ అందులోకి పెగాసెస్ ఎంటర్ కాగలిగిందంటే దీని శక్తియుక్తులు ఏపాటివో ఇప్పటికే అర్థమై ఉండాలి.
నిజానికి ఈ పద్ధతిలో తమ ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం కూడా వినియోగదారుడికి తెలియదు. ఎందుకంటే ఫోన్ పని తీరు మారదు, వేగంలో మార్పు ఉండదు, హ్యాంగింగ్కూ గురి కాదు. అయితే ఐఫోన్లలో దీనిని ఒకమేర కనిపెట్టవచ్చు. అందులో పలు లోగోల కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చు. అనుమానిత వెబ్సైట్ల నుంచి బదిలీ అయ్యే డేటాను తెలుసుకోవచ్చు. పరిమితికి మించి డేటా లేదంటే బ్యాటరీ వినియోగం సైతం హ్యాక్ అయిందనడానికి ఒక సూచిక మాత్రమే. అంతకుమించి తెలుసుకునే అవకాశం ఉండదు.
యూజర్లు ఎప్పటికప్పుడు తమ అప్లికేషన్లను, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం అని నిపుణులు హితవు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదని కూడా అంటున్నారు.