పసినవ్వులను జ్ఞాపకంగా అందిస్తోంది!
ABN , First Publish Date - 2021-03-29T06:33:29+05:30 IST
‘‘చిన్న పిల్లలను ఫొటోలు తీయాలంటే ఫొటోగ్రఫీ తెలిస్తే చాలదు వారిని అర్థం చేసుకోవడం కూడా తెలియాలి. పిల్లల ఫొటోలు చక్కగా రావాలంటే ముందుగా వారిని గౌరవించాలి. నా స్టూడియోలోకి పిల్లలు రాగానే వారిని ఫొటోకోసం...

ముద్దులొలికే చిన్నారులను ఫొటోలో చూసుకుంటూ మురిసిపోతారు కన్నవాళ్లు. పసినవ్వుల్ని అందమైన ఫొటోలుగా మలుస్తూపేరెంట్స్కు కొత్త అనుభూతిని అందిస్తున్నారు సెలబ్రిటీ మెటర్నిటీ ఫొటోగ్రాఫర్ అమృతా సమంత్. మెటర్నిటీ, చిన్నపిల్లల ఫొటోషూట్‌కు ఆదరణ పెరుగుతున్న ఈ సమయంలో మాతృత్వపు మధుర క్షణాలు, పసికందుల ఫొటోలను జీవితకాల జ్ఞాపకంగా మలచుకునేందుకు ఆమె చెబుతున్న సూచనలివి...
‘‘చిన్న పిల్లలను ఫొటోలు తీయాలంటే ఫొటోగ్రఫీ తెలిస్తే చాలదు వారిని అర్థం చేసుకోవడం కూడా తెలియాలి. పిల్లల ఫొటోలు చక్కగా రావాలంటే ముందుగా వారిని గౌరవించాలి. నా స్టూడియోలోకి పిల్లలు రాగానే వారిని ఫొటోకోసం హడావిడి చేయను. వారిని చూసి నవ్వుతాను. వారు కొత్తవాతావరణానికి అలవాటు పడేలా చేస్తాను. వారి తల్లిదండ్రులతో ఫొటోషూట్ గురించి కాసేపు మాట్లాడిన తరువాతే ఫొటోలు తీస్తాను. కొందరు తమ పిల్లలతో మిల్క్బాత్ షూట్, కేక్ స్మాష్ వంటి ఫొటోషూట్స్ చే యండని అడుగుతుంటారు. అయితే పిల్లలకు అలవాటు లేని తెలియని వాటితో ఫొటోషూట్ చేస్తే వారు భయపడి, బిగుసుకుపోయే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో పిల్లలను ఒత్తిడి చేయొద్దని తల్లిదండ్రులకు చెబుతాను. ఫొటోలు తీసేటప్పుడు పిల్లలు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటా. అప్పుడే వారిని అందంగా తీయగలం. పసికందులను ఫొటోలు తీసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి 20 రోజుల వయసున్న బేబీని ఫొటో తీయాల్సి ఉంటుంది. పిల్లల హావభావాలు చక్కగా వచ్చేందుకు వారితో కొన్నిసార్లు (పీక్ ఎ బూ) గేమ్ ఆడుతాం. ముఖానికి అడ్డంగా చేతులు పెట్టి వారి వంక చూస్తూ నవ్విస్తాం. అప్పుడు ఆ పసినవ్వులను కెమెరాలో బంధిస్తాం’’.
సృజనాత్మకత నడిపిస్తోంది
నేను ఒక గేమింగ్ కంపెనీలో హెచ్ఆర్గా ఏడేళ్లు పనిచేశాను. నాకు ఆ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. అయితే సృజనాత్మకత ఉన్న రంగంలో పనిచేయాలనే ఉద్దేశంతో కొన్ని మ్యాగజైన్లు, కొరియోగ్రఫీ, థియేటర్లో తాత్కాలిక ఉద్యోగిగా చేరాను. ఆ సమయంలోనే మా స్నేహితురాలికి ఫెళ్లి ఫొటోలు తీయడంలో సహకరించాను. అప్పుడే ఫొటోగ్రఫీ మీదకు మనసు మళ్లింది. పెళ్లి, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఇలా ఏదో ఒకటి ఎంచుకోవాలని అనుకోలేదు. నాకు పిల్లలన్నా, ఫొటోలు తీయడమన్నా చాలా ఇష్టం. అంతేకాదు నాకంటూ ప్రత్యేకత ఉండాలనే ఆలోచనతో మెటర్నిటీ, న్యూబోర్న్ ఫొటోగ్రఫీని ఎంచుకున్నాను. అలా ‘మమ్మీ షాట్స్’ను ప్రారంభించాను. మా ఆలోచన కొత్తగా, ప్రతి తల్లితండ్రికి చేరువ అయ్యేలా ఉండడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు పది దేశాల్లో 1400లకు పైగా ఫొటోషూట్స్ చేశాం.
ఆడవాళ్లు కుటుంబాన్ని చూసుకుంటూనే ఉద్యోగం కూడా చేయగలరని చాటడమే నా ఉద్దేశం. మగవాళ్లు ఎక్కువగా ఉండే ఈ రంగంలో నేను రాణించడమే కాదు ఎక్కువగా మహిళలకే అవకాశాలు ఇస్తుంటాను. కొత్తగా ఫొటోగ్రఫీని ఎంచుకునేవాళ్లకు నేను చెప్పేదేమంటే.... నిరంతరం శ్రమ, ఓపిక ఫొటోగ్రఫార్లకు రెండు కళ్ల లాంటివి. ఒక ఫొటో అద్భుతంగా వచ్చేందుకు ఈ రెండూ అవసరం. ట్రెండ్‌ను అనుసరించడం మంచిదే. అలాగని మీ ప్రత్యేకతను కోల్పోవద్దు.
