నర్తనతో నవజీవం

ABN , First Publish Date - 2021-12-30T05:30:00+05:30 IST

కాకతీయుల మొదటి రాజధానిగా విరాజిల్లిన హనుమకొండ మాది. కళలకు నెలవైన ఆ గడ్డలో పుట్టినందుకేమో నాకూ నాట్యంపై మక్కువ కలిగింది....

నర్తనతో నవజీవం

అలనాడు భోగభాగ్యాలతో అలరారిన ఆలయాలెన్నో... నేడు శిథిలమై ధూపదీపాలకు దూరమయ్యాయి. అలాంటి ఆలయాల్లో నాట్యమనే దీపాన్ని వెలిగిస్తున్నారు ప్రముఖ కూచిపూడి నర్తకి కాట్రగడ్డ హిమాన్షి. జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలే వేదికగా అపురూప నృత్య ప్రదర్శనలెన్నో ఇస్తూ... వాటికి తిరిగి జీవం పోస్తున్న ఆమెతో ‘నవ్య’ మాటామంతి...  


కాకతీయుల మొదటి రాజధానిగా విరాజిల్లిన హనుమకొండ మాది. కళలకు నెలవైన ఆ గడ్డలో పుట్టినందుకేమో నాకూ నాట్యంపై మక్కువ కలిగింది. రెండో తరగతి చదువుతున్నప్పుడే నా ఈ ప్రయాణం ప్రారంభమైంది. తాడూరి రేణుక వద్ద కూచిపూడి నాట్యంలో తొలి అడుగులు వేసిన నేను... ఆ తరువాత వేదాంతం సత్యం, బొంపెల్లి సుధీర్‌రావు వంటి ప్రముఖ గురువుల శిక్షణలో దాన్ని కొనసాగించాను. ముఖ్యంగా నన్ను మంచి నర్తకిగా తీర్చిదిద్దడంలో సుధీర్‌రావు గారి పాత్ర ఎంతో ఉంది. వారందరి ఆశీర్వాదం వల్లే నేను దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇవ్వగలిగాను. జాతీయ స్థాయిలో ఎన్నో ప్రముఖ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందగలిగాను. 


గాయపడినా వదల్లేదు... 

అమ్మ కోసం నాట్యం మొదలుపెట్టినా... ఆ తరువాత అదే నా లోకం అయిపోయింది. ఏదో నేర్చుకొని వదిలేయకుండా నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలనే తపన. దాని కోసం స్నేహితులతో కాలక్షేపాలు, కొన్ని ఇష్టమైన ఆహార పదార్థాలు వదిలేయాల్సి వచ్చింది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా రాను రాను నాట్యాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను. రెండుసార్లు సాధన చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డాను. చికిత్స సమయంలో ఇక నా జీవితంలో నాట్యం ఉండదనుకున్నా. ఆ ఆలోచనే నన్ను బాగా కుంగదీసింది. అయితే పూర్తిగా కోలుకున్నాక తిరిగి డ్యాన్స్‌ ప్రారంభించా. అప్పుడు నా ఆనందానికి ఎల్లలు లేవు. ఏ రంగంలో రాణించాలన్నా నిరంతర శ్రమ, అంకితభావంతో పట్టుదలగా ప్రయత్నించాలి. 


మలుపు తిప్పిన పర్యటన... 

ఒక రోజు రామప్ప ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్నాను. జాకారం ప్రాంతంలో రహదారికి ఆనుకొని శిథిలావస్థలో ఉన్న కాకతీయుల కాలం నాటి దేవాలయం ఒకటి కనిపించింది. వెళ్లి చూస్తే... ముక్కలుగా విరిగిపడిన శిల్పాలు కుప్పలుగా పోసివున్నాయి. ఆ దృశ్యం నా గుండెల్ని పిండేసింది. నా సొంత ఇల్లే ఇలా శిథిలమైతే ఎలా ఉంటుందో అంత బాధ నాకు అప్పుడు కలిగింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను... ఇలాంటి ఆలయాలకు పునర్‌వైభవం తేవడానికి నావంతు కృషి చేయాలని! నేనేం చేయగలనా అని ఆలోచించాను. పెద్దలు, అనుభవజ్ఞులతో చర్చించాను. 


అదే వేదికగా... 

ఇలాంటి సందర్భం ఒకటి కవికి ఎదురైతే కవిత్వం రాస్తాడు. గాయకుడైతే పాడతాడు. పాత్రికేయుడైతే సమస్యను లోకానికి తెలిసేలా కథనం రాస్తాడు. మరి ఒక నర్తకిగా నేనేం చేయగలను? అలా మదిలో మెదిలిన ఆలోచన ఫలితంగా... ఇప్పుడు శిథిలమైన చారిత్రక ఆలయాలనే వేదికలుగా చేసుకొని నాట్య ప్రదర్శనలు ఇస్తున్నా. ఇందుకు ఒక ప్రత్యేక పద్ధతి ఎంచుకున్నా. ప్రజల నోట్లో నానిన సినిమా పాటలకు సరికొత్తగా నృత్యాన్ని జోడిస్తున్నా. దీని కోసం ముఖ్యంగా కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారి సినిమాల్లోని పాటలను ఉపయోగించుకొంటున్నా. దాని కోసం ఆయన అనుమతి, ఆశీర్వాదం తీసుకున్నా. ఈ పాటల షూటింగ్‌లో కెమెరా, ఎడిటింగ్‌ నేనే చేస్తున్నా. అలా రూపొందించిన పాటలు ‘ఆదిత్య మ్యూజిక్‌’ ద్వారా విడుదలయ్యాయి. 


అద్భుత ఆలయాలెన్నో... 

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన కాకతీయ సామ్రాజ్యంలో అద్భుతమైన ఆలయాలెన్నో. అలనాటి నృత్యరీతుల ఆనవాళ్లు శిల్పకళా రూపాల్లో నేటికీ వాటిపై సజీవంగా ఉన్నాయి. గురు పితామహులు నటరాజ రామకృష్ణ అలాంటి ఆలయాల్లోని నృత్య భంగిమల ఆధారంగానే పేరిణీ నృత్యానికి ప్రాణం పోశారు. ఇంకా వెలుగు చూడని నృత్యరీతులు ఎన్నో. ఇంతటి అపురూప శిల్ప సంపద ఉన్న ఆలయాలు కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడంలేదు. 


ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని రామప్ప, కోటగుళ్ల, భైరవకోన, అయినవోలు, రాయంచ, జాకారం ప్రాంతాల్లోని ఆలయాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. కొన్ని చోట్ల స్థానిక కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించాం. త్వరలోనే ఆలేరు సోమేశ్వరాలయం, మొగిలిచర్ల ఏకవీర, మిర్యాలగూడ పచ్చల సోమేశ్వరాలయాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. శిథిలావస్థలో ఉన్న మరికొన్ని చారిత్రక ఆలయాలు గుర్తించా. నా ప్రదర్శనల ద్వారా ప్రాచీన ఆలయాల ప్రాశస్త్యం తెలియజేయడంతో పాటు వాటికి పూర్వ వైభవం తేవడమే ప్రధాన లక్ష్యం. 


కదిలిన స్థానికులు... 

ఒక ఆలయంలో మా నాట్యం చూసిన కొంత మంది దాతలు ఆర్థిక సాయం అందించారు. స్థానికులు కొందరు చందాలు ఇచ్చారు. వాటితో శిథిలావస్థలోని ఆ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు మూలవిరాట్టుకు నిత్య పూజలు చేస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ప్రజలు స్పందించారు. ఇది ఎంతో సంతృప్తినిచ్చింది.  

 

ఆ ప్రశంస స్ఫూర్తినిచ్చింది...

ఓ గుడిలో నా నాట్యం చూసి ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ గారు అభినందించారు. నా నాట్యం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. విశ్వనాథ్‌ గారి ప్రతి పుట్టినరోజునాడు, ఇతర పండుగల్లో ఆయన కుటుంబ సభ్యుల మధ్య నాట్య ప్రదర్శన ఇస్తాను. ‘శిథిలమైన ఆలయాల పూర్వ వైభవం కోసం హిమాన్షి చేస్తున్న కృషి అమోఘం’ అంటూ కళాతపస్వి ప్రశంసించారు. నాటి తన పాటలకు పునరుజ్జీవం పోశావంటూ అభినందించారు. అలాగే ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, నటుడు, రచయిత తనికెళ్ల భరిణి గారు ప్రత్యేకంగా అభినందించారు. ‘నూరు అశ్వమేథయాగాలు నిర్వహిస్తే వచ్చే ఫలం ఒక్క ప్రాచీన ఆలయాన్ని పరిరక్షిస్తే వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయ’ని అహోబిల జీయర్‌స్వామి అన్న మాటలైతే నాకు మంత్రాల్లా పనిచేశాయి. 



‘ఎన్టీఆర్‌..’లో చిన్నమ్మగా... 

నాకు సినిమా అవకాశాలు కూడా బానే వస్తున్నాయి. అయితే నృత్యం ఇతివృత్తంగా ఉండే పాత్రయితేనే చేద్దామనే ఉద్దేశంతో అన్నిటినీ ఒప్పుకోవడంలేదు. ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో నటించా. ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు భాగాల్లో పురందేశ్వరి పాత్ర పోషించా. పురందేశ్వరిని చిన్నమ్మ అందులో పిలుస్తారు. నన్ను కూడా చాలామంది చిన్నమ్మ అని సంబోధించేవారు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. 


                                                                                       చిలుముల్ల సుధాకర్‌ 

                                                                                   ఫొటోలు: వీరగోని హరీశ్‌గౌడ్‌ 


తనను నాలో చూసుకొంటోంది... 

ప్రస్తుతం ‘ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ’లో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. అయితే నా తొలి ప్రాధాన్యం నాట్యానికే. నాట్యం అంటే నాకు ప్రాణం. నిజానికి మా అమ్మ శ్రీలక్ష్మికి చిన్నప్పుడు డ్యాన్స్‌ నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉండేదట. కొన్ని కారణాల వల్ల ఆ కోరిక నెరవేరలేదు. అయితే మా అమ్మమ్మ వంగ బంగారమ్మ వద్ద వీణ నేర్చుకుంది. కానీ నర్తకి కావాలన్న తన ఆకాంక్షను అమ్మ నా ద్వారా నెరవేర్చుకోవాలనుకుంది. అందుకే నన్ను చదువుతో పాటు కూచిపూడి నాట్యంలో కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు తనను నాలో చూసుకొని ఆనందిస్తోంది. 

Updated Date - 2021-12-30T05:30:00+05:30 IST