తెలుగువారికి ‘ప్రీతి’పాత్రం
ABN , First Publish Date - 2021-05-24T05:30:00+05:30 IST
నటన... ఆమె కలలు కన్న లోకం. దాని కోసం ఎక్కడా శిక్షణ తీసుకోలేదు కానీ... ఆ తపన కళాశాలలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే స్ఫూర్తినిచ్చింది. ఇంజనీరింగ్ చదివి ఏ ఉద్యోగానికో పరుగెత్తకుండా...

నటన... ఆమె కలలు కన్న లోకం. దాని కోసం ఎక్కడా శిక్షణ తీసుకోలేదు కానీ... ఆ తపన కళాశాలలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే స్ఫూర్తినిచ్చింది. ఇంజనీరింగ్ చదివి ఏ ఉద్యోగానికో పరుగెత్తకుండా... తన అభిరుచి వైపు అడుగులు వేయించింది. బుల్లితెరపై ‘ప్రీతి’గా పరిచయమై... తెలుగువారికి ప్రీతిపాత్రమైన నటిగా అలరిస్తున్న మాహి గౌతమితో ‘నవ్య’ ముచ్చట్లు...
నా పేరు గౌతమి. కానీ ‘మాహి గౌతమి’ అంటేనే అందరూ గుర్తుపడతారు. ‘మాహి’ నా ఆర్జే నేమ్. కొంత కాలం ‘మన రేడియోలో’ ఆర్జేగా చేశాను. కానీ మొదటి నుంచి నాకు నటనంటే పిచ్చి. ఎప్పుడో ఒకప్పుడు నటిని కావాలని కలలు కనేదాన్ని. స్కూల్లోనే దీనికి బీజం పడింది. నేను పుట్టిందీ, పెరిగిందీ, చదువుకన్నదీ హైదరాబాద్‌లోనే. ‘హోలీ మేరీ’ స్కూల్లో ఉండగా అక్కడ ప్రతి నెలా ఏదో ఒక ఈవెంట్ జరుగుతుండేది. పాటలు, ఆటలు, డ్యాన్స్, స్కిట్స్. ఏదీ వదలకుండా అన్నిట్లో ఉండేదాన్ని. దాదాపు ప్రతిదాంట్లో బహుమతులు వచ్చేవి. నెట్‌బాల్ స్కూల్‌గేమ్స్‌లో జిల్లా స్థాయిలో ఆడాను.
ఇంజనీరింగ్ అవ్వగానే...
కాలేజీకి వచ్చాను. ‘జేబీఐటీ’లో ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. ఒక పక్క చదువుకొంటూనే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. వివిధ ఈవెంట్స్‌కు యాంకరింగ్ చేసేదాన్ని. 2017లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్... చివరి సెమిస్టర్ అయిపోయింది. స్నేహితులంతా ఆకర్షణీయమైన జీతాలతో మంచి మంచి ఉద్యోగాలకు వెళుతున్నారు. కానీ నేను కోరుకున్నది ఈ రొటీన్ జీవితం కాదు. నాకంటూ ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు ఉండాలి. కొత్తగా ఏదైనా సాధించాలి. అందుకే నేను కలలు కన్న ప్రపంచాన్ని వెతుక్కొంటూ అడుగులు వేశాను. తొలుత ఓ మ్యూజిక్ చానల్‌లో ఆడిషన్స్‌కు వెళ్లాను. అయితే అక్కడ అవకాశం రాలేదు కానీ... వారిచ్చిన వారం రోజుల ట్రైనింగ్, తరువాత ఎంతో ఉపయోగపడింది.
యాంకర్‌గా మొదలు...
అదే సమయంలో ఓ టీవీ చానల్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది. అలా తొలిసారి తెరపై కనిపించాను. అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రిపోర్టింగ్, భక్తి, లైవ్ కార్యక్రమాలు కూడా చేశా. చేసింది రెండు మూడేళ్లే అయినా మంచి అనుభవం లభించింది. తరువాత ఓ సినిమా కోసం నన్ను అడిగారు. ప్రస్తుతం అది పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. అందులో చేస్తుండగానే ‘నీవల్లే నీవల్లే’ సీరియల్‌లో అవకాశం వచ్చింది. ఆడిషన్స్‌కు వెళితే, అందులో ఎంపికయ్యాను.
అందరికీ నచ్చిన పాత్ర...
నేను నటనలో శిక్షణ తీసుకోలేదు. నటిస్తూనే నేర్చుకున్నా. సినిమాలో చేసిన అనుభవం సీరియల్‌లో బాగా పనికొచ్చింది. ఇందులో నాది ఐపీఎస్ అధికారిణి ప్రీతి పాత్ర. ఆమె దృఢచిత్తంగల మహిళ. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోతుంది. వాళ్ల నాన్నకు ఓ రౌడీ దగ్గర పని. ఆయన ఎంఆర్‌ఓ శుభద్ర కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. ప్రీతి... శుభద్ర దగ్గర పెరుగుతుంది. ఎంఆర్‌ఓ కొడుకు డాన్‌గా మారతాడు. ఇటీవలే 100 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. కథాబలం ఉండడం, అందులో నాది పవర్‌ఫుల్ పాత్ర కావడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఎంతో ఆదరిస్తున్నారు.
ఒకవేళ అదే జరిగితే...
ఇది నా కెరీర్‌కు ఆరంభమే అయినా ఎంతో సంతృప్తితో ఉన్నాను. మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే కొందరు అడుగుతుంటారు... ‘ఒకవేళ ఈ రంగంలో విజయం సాధించలేకపోతే ఏంటని’! నాకా బెంగ లేదు. ఎందుకంటే నేను ఇంజనీరింగ్‌లో ఉండగానే ఇంటర్ విద్యార్థులకు హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. పాకెట్ మనీ కోసం ఇంట్లో వాళ్లపై ఆధారపడడం ఇష్టం లేక, నా ఖర్చులకు నేనే సంపాదించుకునేదాన్ని. ఒకవేళ నటిగా సక్సెస్ కాకపోయి ఉంటే ఏ ట్యూటర్‌గానో, సాఫ్ట్‌వేర్ లోనో సెటిలయ్యేదాన్ని. ఆ ధైర్యం నాకు ఎప్పుడూ ఉంటుంది.అయితే ప్రస్తుతం నటిగా నన్ను నేను మెరుగులు దిద్దుకోవడంపై తప్ప నాకు మరో ఆలోచన, తీరిక లేవు.
ఆ భావమే రానివ్వలేదు...
నటనలో ప్రస్తుతం నేను ఓనమాలు దిద్దుతున్నా. కానీ సీనియర్లతో నటిస్తున్నప్పుడు ఇబ్బంది పడింది లేదు. హరిత గారు, జాకీ గారు, చెన్నై లక్ష్మి గారు... సెట్‌లో ఉన్న సీనియర్ నటులందరూ నన్ను కొత్త అమ్మాయిలా ఏ రోజూ చూడలేదు. నాతో ఎంతో సరదాగా ఉంటారు. ప్రస్తుతం కరోనాతో షూటింగ్‌లు ఆగిపోయాయి. ఇంట్లోనే ఉంటున్నా. చుట్టుపక్కల వారు ఎవరైనా వచ్చి సాయమడిగితే చేతనైనది చేస్తున్నా. ఈ ఆపత్కాలం నుంచి బయటపడాలి. అందరూ క్షేమంగా ఉండాలి.