ఆ మహిళల పాలిట ఆశాదీపం!

ABN , First Publish Date - 2021-03-22T05:30:00+05:30 IST

అమెరికాలో గృహహింసను ఎదుర్కొనే తెలుగు మహిళలకు ఆసరా అందిస్తున్నారామె!వ్యక్తిగతంగా, ఆర్థికంగా, న్యాయ

ఆ మహిళల పాలిట ఆశాదీపం!

అమెరికాలో గృహహింసను ఎదుర్కొనే తెలుగు మహిళలకు ఆసరా అందిస్తున్నారామె!వ్యక్తిగతంగా, ఆర్థికంగా, న్యాయపరంగా... ఆ మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు! వందల కొద్దీ గృహహింస కేసుల్లో న్యాయం జరగడానికి పాటుపడిన షికాగోకు చెందిన చాందిని దువ్వూరిని నవ్య పలకరించింది! ఆ విశేషాలు...


‘‘పెళ్లంటే నూరేళ్ల పంట! కానీ అర్థం లేని వాదనలు, అహాలు, అనుమానాలతో దంపతుల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. చివరకు అవి గృహహింసకూ దారి తీస్తూ ఉంటాయి. ఇలాంటి బాధితుల్లో ఇంటి గుట్టు గడప దాటకూడదు అన్న చందంగా బయటకు చెప్పుకోకుండా లోలోపల మధన పడే వాళ్లే ఎక్కువ. అయితే గృహహింస ప్రభావం ఆ దంపతులకే పరిమితం అయితే పరవాలేదు. ఆ గొడవలను చూస్తూ పెరిగే పిల్లల మనసులపై వాటి ప్రభావం చెరగని ముద్ర వేస్తుంది. అలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు ఎంతలా కుంగిపోతారో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ క్షణమే గృహహింసకు గురయ్యే మహిళలకు నా శాయశక్తులా పాటు పడాలని నిశ్చయించుకున్నాను. ఈ నిర్ణయానికి ముందు అందుకు దారితీసిన ఓ సంఘటన గరించి, నా నేపఽథ్యం గురించి చెప్పాలి. మహిళల సమస్యలే ప్రధానంగా...

నాకు అమెరికాలో ఐటి కన్సల్టెన్సీ కంపెనీ ఉంది. ఓవర్‌సీస్‌ వాలంటీర్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా అనే సంస్థలో ఉమెన్‌ వింగ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. అలాగే 14 ఏళ్లుగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ టీచర్‌గా కూడా పని చేస్తున్నాను. దీన్లో భాగంగా పిల్లలతో పాటు పెద్దలకు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ తరగతులు నిర్వహిస్తూ ఉంటాను. ఆ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆరేళ్ల అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అంత పసి వయసులో ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణం, నిత్యం ఇంట్లో ఆ పాప తల్లితండ్రులు గొడవలు పడుతూ ఉండడమే అని తెలుసుకున్నాను. హింసతో కూడిన వాతావరణంలో పెరిగే పిల్లల మానసిక స్థితి ఎంతగా దిగజారుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అలా గృహహింసకు గురయ్యే మహిళల గురించి నా వంతు కృషి చేయాలనే ఆలోచన అప్పట్లో మొదలైంది.


తానాలో కూడా నేషనల్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేస్తున్న నేను తానా దృష్టికి వచ్చే గృహహింస కేసులను కూడా పరిష్కరించడం మొదలుపెట్టాను. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో దక్షిణ భారతీయ మహిళలకు సహాయం అందించే సంస్థలు ఉన్నాయి. గృహహింసకు గురయ్యే మహిళలకు ఈ సంస్థలు ఆశ్రయం కల్పించడంతో పాటు, ఉచిత కన్సల్టేషన్‌ సౌకర్యాలు కల్పిస్తాయి. నేను, ఈ సంస్థలతో కలిసి పని చేస్తూ అవసరం మేరకు మహిళలకు సహాయసహకారాలు అందిస్తూ ఉంటాను.


అన్ని రకాలుగా ఆసరా...

సహాయం కోసం ఆశ్రయించే మహిళ పరిస్థితిని అంచనా వేయడం నా మొదటి పని. వారు చెబుతున్న విషయాలను రూఢీ చేసుకుని, వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు, న్యాయపరమైన సహాయం అందేలా తోడ్పడతాను. చదువుకున్న మహిళలైతే, వారికి ఉద్యోగం వెతికి, స్వతంత్రంగా జీవించేలా చేయడంతోపాటు, వారి భర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, తప్పు తెలుసుకునేలా చేస్తాను. గొడవలతో విడిపోయి, నా చొరవతో తిరిగి కలిసిన జంటలు చాలా ఉన్నాయి. ఇలా ఇప్పటివరకూ సుమారు 200 గృహహింస కేసులను పరిష్కరించాను.


తమిళనాడుకు చెందిన ఓ జంట చాలా ఏళ్లుగా అమెరికాలో స్థిరపడిపోయింది. వాళ్లకు 10 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఆమె భర్త, భార్యను వదిలించుకోవాలనే ఆలోచనతో తిరుమల వెళ్లొద్దాం అని చెప్పి, ఆమెను, కొడుకును ఇండియాకు తీసుకువచ్చి, ఇద్దర్నీ వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఇండియాలో చిక్కుకుపోయిన ఆవిడకు ఇక్కడ యుఎస్‌ ఎంబసీతో మాట్లాడి, ఇమిగ్రేషన్‌ అటార్నీని నియమించుకుని, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ డాక్యుమెంట్స్‌ ఇప్పించి తల్లీకొడుకులను అమెరికాకు రప్పించాను. ఇలా ఇబ్బందుల్లో ఉన్న ఎన్నారైలకే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకుని, పురుషుల చేతుల్లో మోసపోయే మహిళల కేసులు కూడా పరిష్కరించాను. షి టీమ్స్‌తో కలిసి...

ఎన్నారై గృహహింస, వేధింపుల కేసులకు సంబంఽధించి, తెలంగాణా అడిషనల్‌ డిజీపీ ఫర్‌ ఉమెన్స్‌ సేఫ్టీ స్వాతి లక్రాతో కలిసి పని చేస్తున్నాను. పెళ్లయ్యాక భార్య ఇండియాలో, భర్త అమెరికాలో ఉండిపోయిన సందర్భాల్లో, పరిష్కారం కాని కేసుల విషయంలో నా సహాయం కోరుతూ ఉంటారు. పెళ్లైన నాలుగు నెలలకే మనస్పర్థలతో విడిపోయిన జంటకు సంబంధించిన ఒక కేసు నాలుగేళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదు. ఈ విషయంలో నా జోక్యాన్ని కోరడంతో ఇరు పార్టీలనూ సంప్రతించి, కాన్ఫరెన్స్‌ కాల్‌ మాట్లాడడానికి ఒప్పించాను. ఇరు వర్గాల అంగీకారం మేరకు విడాకులతో సమస్యను ఓ కొలిక్కి తీసుకురాగలిగాను. కలిసి జీవించడానికి ఇష్టపడని జంట, సామరస్యంగా విడిపోయి జీవితాల్లో ముందుకు సాగిపోవచ్చు. ఇందుకోసం విలువైన సమయాన్ని వృఽథా చేసుకోకుండా సహాయపడ్డానని చెప్పవచ్చు. 


గృహహింస సమస్యల పరిష్కారంలో నేను స్వయంగా ఇబ్బంది పడిన సందర్భాలూ ఉన్నాయి. గృహహింసతో బాధపడే కొందరు మహిళలు ఎంత కౌన్సెలింగ్‌ ఇచ్చినా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతటి భరోసా కల్పించినా దృఢమైన నిర్ణయానికి కట్టుబడి ఉండరు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి మహిళలు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటానే తప్ప, వారి మీద కోపం తెచ్చుకోను. అయితే మహిళలు తమ విలువ తెలుసుకుని, గృహహింసకు తావులేని హుందా జీవితం గడపాలనేది నా కోరిక.

 


నేను హైదరాబాదీనే!


నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే! కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, 1997లో ఎమ్మెస్‌ కోసం స్టూడెంట్‌ వీసాతో అమెరికా వెళ్లాను. ప్రారంభంలో ప్రోగ్రామింగ్‌ అనలిస్ట్‌గా పనిచేశాను. తర్వాత కొంత కాలానికి మా వారు ప్రభాకర్‌ వీరవల్లితో కలిసి సొంత ఐటి కన్సల్టింగ్‌ కంపెనీ ఏర్పాటుచేశాను. మాకు ఇద్దరు మగపిల్లలు.


Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST