లీనా నాయర్‌ చెప్పిన జీవిత పాఠాలు!

ABN , First Publish Date - 2021-12-16T05:06:15+05:30 IST

మన దేశానికి చెందిన మరొక మహిళ ఒక అంతర్జాతీయ కంపెనీకి నేతృత్వం వహించబోతోంది. హిందుస్థాన్‌ యూనీలివర్‌లో మానవ వనరుల

లీనా నాయర్‌ చెప్పిన జీవిత పాఠాలు!

మన దేశానికి చెందిన మరొక మహిళ ఒక అంతర్జాతీయ కంపెనీకి నేతృత్వం వహించబోతోంది. హిందుస్థాన్‌ యూనీలివర్‌లో మానవ వనరుల విభాగాధిపతి లీనా నాయర్‌- ఫ్రాన్స్‌కు చెందిన చానల్‌ అనే లగ్జరీ గ్రూపునకు సీఈఓగా బాధ్యతలు స్వీకరించనుంది. సుందర్‌ పిచాయ్‌, సత్యా నాదేళ్ల, పరాగ్‌ అగర్వాల్‌ల తర్వాత ఒక అంతర్జాతీయ సంస్థకు నేతృత్వం వహించనున్న లీనా నాయర్‌ ట్విట్టర్‌లో తన నేర్చుకున్న పాఠాలను పంచుకుంటూ ఉంటారు. వీటికి ట్విట్టర్‌లో విశేషమైన ఆదరణ కూడా లభించింది. ఈ మధ్య కాలంలో ఆమె పంచుకున్న జీవిత పాఠాలివే..


సమయాన్ని, శక్తిని తెలివిగా వాడుకోండి..

మీకు ఆనందాన్ని ఇచ్చే అంశాలు లేదా మీరు నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు చేర్చే విషయాలపైనే మీ శక్తిని.. సమయాన్ని వెచ్చించండి. నాకో స్నేహితురాలు ఉండేది. ఆమెకు సినిమా కథా రచయిత కావాలనేది గాఢమైన కోరిక. కానీ ఆమె రోజూ తన సమయాన్ని బ్లాగ్‌లపైన.. ట్వీట్‌లపైన వెచ్చించేది. రకరకాల ప్రాజెక్టులు చేస్తూ ఉండేది. దీని వల్ల ఆమెకు కొన్ని డబ్బులు వచ్చేవి. కానీ సమయం వృధాగా గడిచిపోయేది. ఇలా కొద్ది కాలం పోయిన తర్వాత ఆమెకు తాను చేస్తున్న పనుల వల్ల ప్రయోజనం లేదని అర్థమయింది. కేవలం సినిమా ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు స్ర్కిప్టు రైటర్‌గా పనిచేస్తోంది.


లక్ష్యాన్ని నిర్దేశించుకోండి..

నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో మా ప్రొఫెసర్‌ ఒకరు- ‘‘నువ్వు చెడ్డ ఇంజినీర్‌వి.. కానీ మంచి మేనేజర్‌ అవుతావు’’ అన్నారు. ఆ మాటలు నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. నేను ఎంబీఏ హెచ్‌ఆర్‌ చేసి హిందుస్థాన్‌ యూనీలివర్‌లో మేనేజిమెంట్‌ ట్రైనీగా చేరా. గత 20 ఏళ్లలో అనేక సార్లు మా ప్రొఫెసర్‌ మాటలు గుర్తుకు వచ్చేవి. నేను ఒక మంచి మేనేజర్‌ అవుతాననే విశ్వాసాన్ని ఇచ్చేవి. ఆ మాటలు వల్ల నాకు ఒక లక్ష్యం ఏర్పడింది. ఇదే విధంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలి.


ప్రతి అనుభవం కీలకమే!

భారత్‌లోని హిందుస్థాన్‌ లివర్‌కి చెందిన ఫ్యాక్టరీలలో తక్కువ మంది మహిళలు పనిచేస్తూ ఉంటారు. నేను నైట్‌ షిప్ట్‌లు కూడా చేసేదాన్ని. నాతో పాటు పనిచేసే అనేక మంది - నైట్‌షిప్ట్‌లలో పనిచేయటానికి అంగీకరించేవారు కాదు. ఫ్యాక్టరీలో పనిచేయటమేంటే చిన్నతనంగా భావించేవారు. కానీ నేను ఫ్యాక్టరీలో పనిచేయటం వల్ల అనేక కొత్త విషయాలు తెలిసాయి. నైట్‌షిప్ట్‌ అనేక పాఠాలు నేర్పింది. ఇవన్నీ నా ఎదుగుదలకు ఎంతో పనిచేశాయి. 


ఎవరు చెప్పినా వినండి..

మన చుట్టూ ఉన్నవారందరికీ ఒక అనుభవం ఉంటుంది. దానిని వినటం వల్ల అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. అందువల్ల చిన్నా.. పెద్ద అని లేకుండా ఎవరు చెప్పినా వినాలి. అప్పుడు మనలో అనేక కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. ఆలోచనలు వస్తాయి. మన జీవితంలో ఇవన్నీ పనికొస్తాయి.


ఫీడ్‌బ్యాక్‌ చాలా చెబుతుంది..

ఎవరైనా ఫీడ్‌బ్యాక్‌ ఇస్తే దానిని తప్పనిసరిగా స్వీకరించాలి. సాధారణంగా ఇలాంటి ఫీడ్‌బ్యాక్‌లలో మనం చూడని కొత్త కోణాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే- అప్పటి దాకా మనం చూడని కొత్త విషయాలు తెలుస్తాయి. మనమంటే శ్రద్ధ ఉన్నవారే మనకు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తారనే విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది.

Updated Date - 2021-12-16T05:06:15+05:30 IST