లీలా మానుషరూపుడు

ABN , First Publish Date - 2021-08-27T06:19:49+05:30 IST

నిర్వేదానికి గురై, ధర్మసంకటంలో పడిన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడానికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించి, భగవద్గీతను ఉపదేశించాడు.

లీలా మానుషరూపుడు

‘కృష్ణ’ అనే శబ్దానికి కష్టాలు తీర్చేవాడు, కలిమిని ఇచ్చేవాడు, తన రూప, గుణాతిశయంతో ఆకర్షించి విశ్వాసాన్ని పొందేవాడు అనే అర్థాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి పుట్టుక నుంచి నిర్యాణం వరకూ... ఆయన జీవితమంతా ఒక మహా ప్రబోధం.  కంస వధ మొదలు దుర్యోధనాదులను వధింపజేయడం వరకూ దుష్ట శిక్షణ సాధించి ధర్మాన్ని ఉద్ధరించాడు. మానవుల తలరాత మార్చి, వారి జీవితాలకు చుక్కానిగా నిలిచే ‘భగవద్గీత’ ఉపదేశించాడు. 


నిర్వేదానికి గురై, ధర్మసంకటంలో పడిన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడానికి  శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించి, భగవద్గీతను ఉపదేశించాడు. అది ఈ లోకం అంతటికీ వర్తించే చుక్కాని అయింది. కర్తవ్యాన్ని నూరిపోసే ధీర వచనమయింది.


దుష్టుల కారణంగా ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు, శిష్టులు అంటే సన్మార్గంలో నడిచేవారు బాధలు అనుభవిస్తున్నప్పుడు.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని రక్షించడానికి అన్ని యుగాల్లో భూమిపై అవతరిస్తానని గీతోపదేశంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. భూలోకంలో రాక్షసుల అరాచకాలతో, హింసతో తల్లడిల్లుతున్న శిష్ట సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు దాల్చినట్టు శ్రీమద్భాగవతం చెబుతోంది. ఆ అవతారాల్లో ప్రధానమైనవి పది. వాటిలో ఎనిమిదవదైన శ్రీకృష్ణావతారాన్ని పరిపూర్ణమైన, దివ్యమైన, ప్రత్యేకమైన అవతారంగా పౌరాణికులు ప్రస్తుతించారు. ‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అని ప్రకటించిన శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో... దేవకీ వసుదేవుల పుత్రునిగా జన్మించాడు. పుట్టగానే శంఖ, చక్ర, గదాధారిగా తల్లితండ్రులకు దర్శనమిచ్చి, తన అవతార రహస్యాన్ని వివరించాడు. కొన్ని సందర్భాల్లో మానవుడిగా, మరి కొన్నిసార్లు దైవంగా... తన అవతార వైభవాన్ని ప్రదర్శించిన లీలామానుష రూపుడు శ్రీకృష్ణుడు. శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య, మధుర భావాలను భగవంతుణ్ణి భక్తులు చేరుకొనే సులభ మార్గాలుగా ఆయన చూపించాడు. వాటిని స్వయంగా తన జీవితంలో ఆయన ఆచరించాడు కూడా. 


శాంతమూర్తి: శ్రీ కృష్ణుడు ఎంతటి ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా శాంతంగానే వ్యవహరించాడు. శిశుపాలుడు నిండు సభలో అనరాని మాటలు అంటున్నా ఉద్రేకపడలేదు. భీష్మాదులు శిశుపాలుణ్ణి హెచ్చరిస్తున్నా ఆయన మాత్రం పౌరుషానికి పోలేదు. శిశుపాలుడి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నూరు తప్పుల్ని శాంతంగా భరించాడు. ఆ తరువాత అతణ్ణి వధించాడు.


దాస్యభావం: పెద్దల దగ్గర వినయ విధేయతలతో ఉండడమే దాస్యభావం. దేవాది దేవుడైనా తనకన్నా పెద్దవారి దగ్గర శ్రీకృష్ణుడు అణకువగా మెలిగాడు. గురువు సాందీపుని దగ్గర బంటులా పని చేశాడు. రేపల్లెలో గోవుల కాపరిగా ఆ మూగ జీవాలను ప్రేమించాడు, సేవించాడు. అందుకే దాస్యంలో ఆయనను మించిన దివ్యాంశుడు లేడంటారు.


వాత్సల్యం: చిన్నవారితో ప్రేమగా, ఆదరంగా ఉండడం వాత్సల్యం. ధీరగంభీరుడైన దేవకీ పుత్రుడు వాత్సల్యానికి మారుపేరు. తనను ఆశ్రయించినవారిని ఆదుకోవడంలో ఆయనను మించిన కరుణామూర్తి మరొకరు లేరు. ‘‘అన్నా! నీవే నాకు దిక్కు!’’ అని ద్రౌపది అన్నందుకు... కౌరవ సభలో ఆమె గౌరవాన్ని సంరక్షించాడు. రాయబార సమయంలో సుయోధనుడు రాజభోగాలనూ, పంచభక్ష్య పరమాన్నాలనూ సిద్ధం చేసినా... పేదవాడు, భక్తుడు అయిన విదురుడి ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని మన్నించి, అతను పెట్టిన సాధారణ భోజనాన్నే సంబరంగా ఆరగించాడు.


సఖ్యం: సన్నిహితులతో, స్నేహితులతో ప్రేమగా ఉండడం సఖ్యం. శ్రీకృష్ణుడు తన సఖ్యభావంతో అందరి మనసుల్లో నిలిచిపోయాడు. చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడు నిరుపేద అయినప్పటికీ, శ్రీకృష్ణుడు సతీ సమేతంగా అతని పాదాలు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకున్నాడు. కుచేలుడు తెచ్చిన అటుకులను ఆప్యాయంగా స్వీకరించాడు. ప్రతిగా సకల సంబదలూ ఇచ్చి, కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు.


మధురభావం: తనను ఆరాధించే వారితో అంతే ఆరాధనతో ఏకమైపోవడం మధుర భావం. గోపికలను ఆ మధురభావంలో శ్రీకృష్ణుడు ముంచెత్తాడు, వారికి అలౌకికమైన ఆనందాన్ని అందిస్తూనే... అంతిమంగా మోక్షాన్ని ప్రసాదించాడు. ఇలాంటి ఉదంతం పరమాత్మలోని ఏ అవతారంలోనూ కనిపించదు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టకుండానే ధర్మపరులైన పాండవులను గెలిపించిన వాడు శ్రీకృష్ణుడు. నిర్వేదానికి గురై, ధర్మసంకటంలో పడిన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడానికి విశ్వరూపాన్ని ప్రదర్శించి, భగవద్గీతను ఉపదేశించాడు. అది ఈ లోకం అంతటికీ వర్తించే చుక్కాని అయింది. కర్తవ్యాన్ని నూరిపోసే ధీరవచనమయింది.


అనాది వేడుక

శ్రీకృష్ణుడు పుట్టిన శ్రావణ బహుళాష్టమిని జన్మాష్టమిగా, శ్రీకృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా దేశమంతటా నిర్వహించుకోవడం అనాదిగా వస్తోంది. బలరామ, శ్రీకృష్ణ వేషధారులైన యువకులు వీధుల్లో కట్టిన ఉట్లను పగల గొట్టడం, వాటిలోని పాలు, పెరుగు, వెన్న, మీగడల మిశ్రమాలను ఆరగిస్తూ... బాల శ్రీకృష్ణుడి లీలలను తలచుకోవడం చాలా ప్రాంతాల్లో చేసుకొనే వేడుక.

తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌

Updated Date - 2021-08-27T06:19:49+05:30 IST