నవ్వుల వ్యాక్సీన్ అంటుంటే ఆనందమే!
ABN , First Publish Date - 2021-03-14T05:54:58+05:30 IST
‘‘జాతిరత్నాలు’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసే దాకా ప్రేక్షకుల నవ్వులతో థియేటర్లు మార్మోగుతున్నాయి
‘‘జాతిరత్నాలు’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసే దాకా ప్రేక్షకుల నవ్వులతో థియేటర్లు మార్మోగుతున్నాయి. ‘కరోనా లాక్డౌన్ తర్వాత ఇంతలా నవ్వుకోవడం ఇదే తొలిసారి. ఈ సినిమా మాకు నవ్వుల వ్యాక్సీన్’ అనే ప్రేక్షకుల ప్రశంసలు వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని నటుడు ప్రియదర్శి అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణతో కలసి ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కె.వి. దర్శకత్వంలో నాగ్అశ్విన్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి ప్రియదర్శి విలేకర్లతో మాట్లాడారు.
- జనాలు మామూలుగా మాట్లాడుకునే మాటల నుంచి దర్శకుడు హాస్యం పుట్టించిన తీరు అద్భుతం. మామూలు కథను తెరపై కొత్తతరహాలో చూపించన తీరుతోనే ఇంత విజయం దక్కింది. ఆ గొప్పతనం దర్శకుడుకే దక్కుతుంది.
- సెట్లో పంచ్ డైలాగ్‌లు చెబుతున్నప్పుడే మాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చేది. అయినా ప్రేక్షకులను నవ్వించ గలుగుతామా? లేదా? అనే సంశయం ఉండేది. ప్రేక్షకుల ఆదరణ చూశాక పట్టరానంత ఆనందంగా ఉంది.
- గత చిత్రాలకు దేనికి చేయనంత హోమ్‌వర్క్ ఈ సినిమా కోసం చేశాం. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ విషయంలో నవీన్, రాహుల్, నాకూ మధ్య కెమిస్ట్రీ కుదరటానికి చాలా కష్టపడ్డాం. ప్రతి సన్నివేశానికి ముందు రిహార్సల్స్ చే సేవాళ్లం. సన్నివేశం మరింత మెరుగ్గా రావటానికి ఆఖరి నిమిషంలో మార్పులు చేసిన సందర్బాలున్నాయి. ఆ కష్టానికి ఫలితం తెరపై కనిపించింది.
- సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అల్లు అర్జున్‌గారు ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ఆనందాన్నిచ్చింది.
- వెకిలిగా నటించి ప్రేక్షకులను నవ్వించటం సులభం. కానీ నాకు అది నచ్చదు. చేతకాదు కూడా. అందుకే దర్శకుడు ఆశించిన హావభావాలను పలికించటం ద్వారా, సంభాషణల ఆధారంగానే హాస్యం పుట్టించే ప్రయత్నం చేస్తాను.
- ఒక రకమైన పాత్రలు మాత్రమే చేస్తాడనే ముద్ర నా మీద పడకూడదనుకుంటాను. అందుకే సినిమా, సినిమాకు నేను చేసే పాత్రల మధ్య వైవిధ్యం ఉండేలా చూసుకుంటాను. బాగా నటిస్తున్నావంటూ చిరంజీవిగారు ఇచ్చిన ప్రశంసను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేక్షకులకు నాపైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కసితో పనిచేస్తాను.
- శర్వానంద్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నాను. ఆహా కోసం వెబ్‌సిరీస్ చేస్తున్నా. అవకాశం వస్తే పొలిటికల్ డ్రామా చిత్రంలో నటించాలనుంది.