చేతుల్లో నొప్పి ఎందుకు?

ABN , First Publish Date - 2021-08-10T05:40:45+05:30 IST

ఇటీవలి కాలంలో ఎక్కువ మందిలో చేతుల్లో నొప్పి సమస్య కనిపిస్తోంది. కొందర్లో నొప్పితో పాటు వాపు కూడా ఉంటుంది.

చేతుల్లో నొప్పి ఎందుకు?

టీవలి కాలంలో ఎక్కువ మందిలో చేతుల్లో నొప్పి సమస్య కనిపిస్తోంది. కొందర్లో నొప్పితో పాటు వాపు కూడా ఉంటుంది. ఇంకొంతమందిలో రాత్రుళ్లు నిద్ర పట్టనంత తీవ్రంగా చేతి నొప్పి ఉంటుంది. ఈ సమస్యకు మూల కారణాలను కనిపెట్టి, చికిత్సతో సరిదిద్దుకున్నప్పుడే చేతి నొప్పి తగ్గుతుంది.


ఉరుకులు పరుగుల జీవితంలో శారీరక వ్యాయామానికీ, నడకకూ సమయం చిక్కడం లేదు. ఆఫీసుల్లో పని ఒత్తిడి, శ్రమతో కూడిన ప్రయాణాలు శారీరక, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఫలితంగా భుజాల్లోని కండరాలు వదులై, వాటిలో స్థిరత్వం లోపిస్తోంది. దాంతో భుజాలు దిగుడుగా తయారై, మెదడు నుంచి చేతుల్లోకి వెళ్లే నరాల మీద ఒత్తిడి పడుతోంది. ఈ రకమైన ఒత్తిడి కారణంగా చేతుల్లో నొప్పి, తిమ్మిర్లు తలెత్తుతాయి. దీన్నే వైద్య పరిభాషలో థొరాసిక్‌ ఔట్‌లెట్‌ సిండ్రోమ్‌ అంటారు. పక్కటెముకల్లో అసహజ పెరుగుదలలు, మెడకు ఇరువైపులా వెన్నెముకలో అసహజ ఎముక పెరుగుదలలు, మెడ కండరాలు కుచించుకుపోవడం మూలంగా నరాలు ఒత్తిడికి లోనవడం, రోడ్డు ప్రమాదాల్లో ఛాతీకి తగిలిన పూర్వ గాయాలు మొదలైనవి చేతుల్లో నొప్పి, తిమ్మిర్లకు దారి తీస్తాయి.


నొప్పితో పాటు వాపు

అధిక బరువు కలిగి ఉండి, రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉండేవారిలో కూడా చేతుల్లో నొప్పి ఉంటుంది. ఇందుకు కారణం భుజాల దగ్గరకు చెడు రక్తాన్ని సరఫరా చేసే సిరల మీద ఒత్తిడి పెరగడమే. దీంతో చేతుల్లోని చెడు రక్తం గుండెకు పూర్తిగా సరఫరా జరగక, చేతుల్లోనే ఉండిపోతుంది. దీంతో నొప్పి, వాపు మొదలవుతుంది. చెడు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినా చేతుల్లో విపరీతంగా నొప్పి, వాపు తలెత్తుతాయి. 


నొప్పితో పాటు వేళ్ల రంగులో మార్పులు

పొగాకు ఉత్పత్తుల అలవాటున్నవారు, ఏళ్లతరబడి ధూమపానం చేసేవారిలో ఈ సమస్య ఎక్కువ. పొగాకులో ఉండే నికోటిన్‌ వల్ల రక్తనాళాలు కుంచించుకుపోవడం మూలంగా, ఆక్సిజన్‌ కలిసిన మంచి రక్తం చేతికి అందదు. దాంతో చేతిలో నొప్పి, వేళ్ల కొసలు రంగు మారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన చికిత్స అందించకపోతే, వేళ్లను తొలగించవలసి వస్తుంది. వ్యాస్క్యులైటిస్‌ సమస్యలో కూడా ఈ లక్షణాలు ఉంటాయి. 


నొప్పితో పాటు పుండు

అత్యధిక భావోద్వేగాలు కలిగిన మహిళలు, ఎక్కువ సమయం పాటు మానసిక కుంగుబాటుతో గడిపేవారిలో ఈ సమస్య ఉంటుంది. చల్లదనానికి తట్టుకోలేని తత్వం కారణంగా శుభ్రపడిన రక్తం వేళ్లకు చేరుకోవడంలో వేగం తగ్గి, హఠాత్తుగా రక్తప్రసారం ఆగుతుంది. దాంతో వేళ్లు నీలం రంగుకు మారిపోతాయి. ఇలా పదే పదే జరిగితే వేళ్ల మీద పుండ్లు ఏర్పడతాయి. దీన్నే రేనాడ్స్‌ ఫెనోమినన్‌ అంటారు. ఈ సమస్య ఎక్కువగా చలికాలంలో తలెత్తుతూ ఉంటుంది.


నొప్పితో పాటు తిమ్మిర్లు

సర్వికల్‌ స్పాండిలోసిస్‌లో ఈ లక్షణాలు ఉంటాయి. తలతిరుగుడు, వాంతులు కూడా కలిసి ఉండడంతో పొట్టకు సంబంధించిన లేదా మెదడుకు సంబంధించిన సమస్య అని పొరబడుతూ ఉంటారు. ప్రారంభంలో ఈ సమస్యను బరువు తగ్గడం, మెడ వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు. 


నిర్ధారణ పరీక్షలు

చెస్ట్‌ ఎక్స్‌రే, మెడ సిటి స్కాన్‌, హ్యాండ్‌ ఎన్‌సివి పరీక్షలు, కొన్ని సందర్భాల్లో మెడలోని రక్తనాళాలకు సంబంధించిన పరీక్షలు, డాప్లర్‌ స్టడీ అవసరం అవుతాయి. సిటి యాంజియోగ్రఫీ కూడా అవసరం పడవచ్చు. చికిత్సల కోసం వ్యాస్క్యులర్‌ సర్జరీ సౌలభ్యం కలిగిన ఆస్పత్రులను ఆశ్రయించాలి.


చికిత్సలు

ఉదయం వేళ ఐదు కిలోమీటర్ల నడక, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. శరీర బరువును అదుపులోకి తెచ్చుకోవాలి. రోజుకు 2 నుంచి 3 గంటల పాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. కొందరికి సర్జరీ అవసరం కావచ్చు. సర్జరీతో నూరు శాతం ఉపశమనం దక్కకపోవచ్చు. చేతి నొప్పికి కారణమైన నరం మీద ఒత్తిడిని సర్జరీతో తప్పించే వీలుంది. రక్తనాళాల్లో గడ్డలు అడ్డుపడితే వాటిని తొలగించడం ద్వారా చేతి నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చు. 


రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉండేవారిలో కూడా చేతుల్లో నొప్పి ఉంటుంది. ఇందుకు కారణం భుజాల దగ్గరకు చెడు రక్తాన్ని సరఫరా చేసే సిరల మీద ఒత్తిడి పెరగడమే. దీంతో చేతుల్లోని చెడు రక్తం గుండెకు పూర్తిగా సరఫరా జరగక, చేతుల్లోనే ఉండిపోతుంది. దీంతో నొప్పి, వాపు మొదలవుతుంది.  


  • డాక్టర్‌. కె.కె.పాండే,
  • సీనియర్‌ వాస్క్యులర్‌ అండ్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌,
  • ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌, న్యూ ఢిల్లీ.

Updated Date - 2021-08-10T05:40:45+05:30 IST