‘సక్సెస్‌హాలిజం’తో విజయం సాధ్యమేనా?

ABN , First Publish Date - 2021-09-02T07:31:44+05:30 IST

‘వర్క్‌హాలిజం’...ఈ లక్షణం మంచిదే! పైగా దీన్ని ఫ్రెండ్స్‌, కొలీగ్స్‌, ఎంప్లాయిస్‌ అందరూ అభినందిస్తారు.

‘సక్సెస్‌హాలిజం’తో విజయం సాధ్యమేనా?

ర్క్‌హాలిజం’...ఈ లక్షణం మంచిదే! పైగా దీన్ని ఫ్రెండ్స్‌, కొలీగ్స్‌, ఎంప్లాయిస్‌ అందరూ అభినందిస్తారు. అయితే ఈమధ్య కాలంలో వర్క్‌హాలిజం అనే ‘పని వ్యసనం’ కాస్తా ‘సక్సెస్‌హాలిజం’గా మారిపోయింది. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి సాధించటమే పనిగా పెట్టుకోవడమన్నమాట. ఆనందంగా ఉంటేనే పని సమర్ధవంతంగా చేయగలం, ఫలితంగా వృత్తిపరమైన సక్సెస్‌ సాధించగలం. కానీ ఇప్పుడు ఈ సూత్రం కాస్తా తిరగబడింది. సక్సెస్‌ సాధిస్తేనే ఆనందంగా ఉండగలం అనుకుంటున్నారు నేటి యువ ఉద్యోగులు. ఈ తర్కం ఫలితంగా విజయం వల్ల చేకూరిన ఫలాల్ని అనుభవించకుండానే మరో విజయం కోసం, దాని తర్వాత మరొక దానికోసం... పరుగెత్తుతున్నారు. ఈ పరుగు ఎప్పటికీ ఆగట్లేదు. ఆగదు కూడా! ఎందుకంటే అంతిమంగా ఆనందాన్నిస్తుందని వీళ్లు అనుకునే ఆ నెక్ట్స్‌ సక్సెస్‌ వీళ్లెప్పటికీ అందుకోలేరు. ఇలా నడిచే సమస్యాత్మక చట్రం చివరికి వ్యక్తుల సారాన్ని హరించి పేలవమైన వృత్తి సామర్ధ్యానికి దారి తీస్తుంది. 


అదొక వ్యసనం!

ఆల్కహాల్‌లాంటి ఫలం లేని వ్యసనంలా కాకుండా సక్సెస్‌హాలిజానికి ప్రమోషన్లు, బోనస్‌లు, బిరుదులు, అవార్డులు, రివార్డులులాంటివి అందుతూనే ఉంటాయి. దాంతో లాంగ్‌ టర్మ్‌లో ఆరోగ్యంమీద ప్రతికూల ప్రభావం పడినా సరే ఈ సూత్రం మంచిదేననే భావన స్థిరపడిపోయింది. సాధించిన విజయం నుంచి థ్రిల్‌ పొందటం మన శరీర తత్వం! ఈ థ్రిల్‌... ఆనందం పొందటం వల్ల మన మెదడులో విడుదలయ్యే న్యూరోట్రాన్స్‌మీటర్‌ డోపమైన్‌ ఫలితమే! కష్టించి పని చేసేవాళ్ల మెదళ్లలో ఈ హార్మోన్‌ ఎక్కువగా స్రవిస్తున్నట్టు పరిశోధనల్లో రుజువైంది. ఇలాంటి ఓవర్‌ అచీవర్స్‌ వచ్చిన ఒక ఎక్స్‌ట్రా ఈమెయిల్‌, అందిన మరో అదనపు ప్రాజెక్ట్‌, చేయాల్సిన పనుల్లో మిగిలిన చివరి టాస్క్‌లను చూసినప్పుడు ఎలాంటి ఎక్సయిట్‌మెంట్‌ ఫీలవరు. 


బయట నుంచి అందే ఉత్ర్పేరకాల నుంచి తప్పించుకోవాల్సిన మానవ చరిత్రలోని అత్యంత క్లిష్టమైన సమయంలో మనం ఇప్పుడున్నాం. బాస్‌ నుంచి అందిన ఈమెయిల్‌తో, సహాయం కోసం అర్ధించే కోవర్కర్ల మెసేజెస్‌తో మన ఫోన్లు శబ్దం చేస్తుంటాయి. ఆ శబ్దాల్ని వింటూ కూడా ఫోన్‌ చెక్‌ చేయకుండా ఉండటానికి ఎంతో మానసిక దారుఢ్యం అవసరం. అయితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి పనిలోనే నిమగ్నమై మరో విజయం కోసం వెంపర్లాడే తత్వం... ఎమోషనల్‌ ఎగ్జాషన్‌ను, ద్వేషాలను పురిగొల్పి బంధాల నాణ్యతను దెబ్బతీయటంతోపాటు ఎన్నో మానసిక, శారీరక రుగ్మతలకు కూడా దారి తీస్తుంది. పనిలో పెరిగే ఒత్తిడి వల్ల మన ప్రొడక్టివిటీతోపాటు ఏకాగ్రతను కూడా తగ్గుతుంది. ఈ తత్వాన్ని వదిలించుకోవడం కోసం...

మల్టిటాస్కింగ్‌ బదులు, ఒక పని మీదే ఏకాగ్రత కేంద్రీకరించాలి. ఉత్తమమైన ప్రొడక్టివిటీకి దీర్ఘకాలంలో సంతోషాన్నిచ్చే సూత్రం ఇదే!

చేస్తున్న పని మీద మనసు లగ్నమవటం కోసం టైమర్‌ పెట్టుకుని అప్పటివరకూ సెల్‌ఫోన్‌ సైలెంట్‌లో పెట్టేయాలి. సోషల్‌ మీడియాను బ్లాక్‌ చేసే డిజిటల్‌ టూల్స్‌ వాడాలి.

ఒక సక్సెస్‌తో బ్రేక్‌ తీసుకుని రిలాక్స్‌ అయ్యాకే మరో గోల్‌ ఎంచుకోవాలి.

విజయానందాన్ని సన్నిహితులతో సెలెబ్రేట్‌ చేసుకోవాలి.

వృత్తిపర, వ్యక్తిగత జీవితాలను సమంగా విభజించుకోవాలి.

Updated Date - 2021-09-02T07:31:44+05:30 IST