రుగ్మతలపై హుకుం!

ABN , First Publish Date - 2021-08-10T05:46:16+05:30 IST

ప్రాచీన గ్రీసుకు చెందిన యునాని వైద్యం ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో భాగంగా మన దేశంలో వాడుకలో ఉంది.

రుగ్మతలపై  హుకుం!

ప్రాచీన గ్రీసుకు చెందిన యునాని వైద్యం ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో భాగంగా మన దేశంలో వాడుకలో ఉంది.చీన గ్రీసుకు చెందిన యునాని వైద్యం ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో భాగంగా మన దేశంలో వాడుకలో ఉంది. మూలికా చిట్కాలు, ఆహార నియమాలు, ప్రత్యామ్నాయ చికిత్సలతో సాగే యునాని వైద్యం వ్యాధి మూలం, దాని విరుగుడు లక్ష్యంగా పని చేస్తుంది. 


శరీర ద్రవాలైన రక్తం, కఫం, పసుపురంగు పైత్యరసం, నలుపు రంగు పైత్యరసం... ఈ నాలుగు ద్రవాలు ఆరోగ్యానికి కీలకం అనే సూత్రాన్ని యునాని నమ్ముతుంది. గాలి, నీరు, భూమి, అగ్ని అనే నాలుగు ఎలిమెంట్లతోనే మానవ శరీరంతో సహా సమస్త జీవకోటి తయారైంది. అలాగే పర్యావరణంలో భాగాలైన నీరు,గాలిల్లో తేడాల ప్రభావం కూడా ఆరోగ్యం మీద ఉంటుందనే సూత్రాన్ని యునాని విశ్వసిస్తుంది. యునాని వైద్యాన్ని అనుసరించే వైద్యులు ‘ఉల్‌ ఉమర్‌ అల్‌ తబియత’ అనే ఏడు శారీరక సూత్రాల ఆధారంగా చికిత్స చేస్తారు.

అవేంటంటే..


అర్కన్‌(మూలకాలు)

మిజాజ్‌(తత్వం)

అఖ్లత(శరీర ద్రవాలు)

అజా(అంతర్గత అవయవాలు, శరీర వ్యవస్థ)

అర్వా(ఆత్మ)

క్వా(శక్తి)

అఫాల్‌(సామర్థ్యం)


ఇవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై పనిచేస్తున్నంత కాలం ఎలాంటి రుగ్మతా దరిచేరదు. వీటిలో ఏ ఒక్కటి హెచ్చు తగ్గులకు లోనైనా సమస్యలు తలెత్తుతాయి. ఒక్కో వ్యక్తిలో వీటన్నిటినీ సక్రమంగా నడిపించే శక్తి ఉంటుంది. అదే ‘తబియత’. నాలుగు మూలకాలైన ఆర్ట్‌(భూమి), మా(నీరు), నార్‌(అగ్ని), హవా(గాలి) మానవ శరీరాలతో పాటు సమస్త జీవకోటి ఉనికికి మూలాలు. ఈ నాలుగు మూలకాల మధ్య చర్య, ప్రతి చర్య(ఇమ్తిజాజ్‌) ఫలితం పరిణామాలు ఉంటాయి. ఇవి ఒక దానితో మరొకటి విభేదిస్తూ, ఏకీభవిస్తూ ఉండే క్రమంలో దశలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఔషధాన్ని శరీరం స్వీకరించడం(ఉల్ఫత ఇ కామియా), విభేదించడం(నఫ్రత ఇ కామియా) జరుగుతుంది. కేవలం అనుభవజ్ఞులైన యునాని వైద్యులైన హకీంలు మాత్రమే యునాని ఔషధంతో వేర్వేరు దశల్లోకి వేళ్లే రోగుల శరీర స్థితులను గ్రహించగలుగుతారు.


యునాని చికిత్సలు

ప్రకృతి సిద్ధ పదార్థాలతో యునాని చికిత్స సాగుతుంది. కుంకుమపువ్వు, యాలకులు, బిరియాని ఆకులతో కూడిన ఖమిర అబ్రేషం హకీం అర్షద్‌వాలా అనే ఔషధంలో ఉన్నవన్నీ సహజసిద్ధ పదార్థాలే. ఈ మందుతో గుండె సమస్యలు, ముఖ్యంగా రక్తపోటు, యాంజీనా లాంటి ఇబ్బందులు తొలగుతాయి. యునాని వైద్యంలో జలగలతో చికిత్సలు, ఆహారంలో మార్పులు, శస్త్ర చికిత్సలు కూడా ఉంటాయి.


నాలుగు తత్వాలు

మిజాజ్‌(తత్వం) శీతం, ఉష్ణం, తేమ, పొడి అనే నాలుగు రకాలు ఉంటుంది. ఈ నాలుగు విడివిడిగానే కాకుండా కలిసీ ఉండవచ్చు. ఉష్ణం, పొడి కలిసి ఉండవచ్చు. వేడి, తేమ కలిసి ఉండవచ్చు. తడి, తేమ కలిసి ఉండవచ్చు. ఇలా వేర్వేరు పాళ్లలో ఉండే తత్వాల ఆధారంగా పర్యావరణంలో భాగాలైన మొక్కలు, జంతువులు, ఖనిజ లవణాలతో చికిత్స చేయవలసి ఉంటుంది. 


విభిన్న చికిత్సలు

హిపోక్రటీస్‌ సూచించిన సిద్ధాంతాల ఆధారంగానే యునాని చికిత్స రూపొందింది. అరేబియా, పర్షియా విజ్ఞానులు, అరేబియా తత్వవేత్త, భౌతిక శాస్త్రవేత్త అవిసెన్నా యునాని వైద్యానికి ఆద్యులు. అరబిక్‌ భాషలో యునాని పదానికి గ్రీకు అని అర్థం. యునాని వైద్యం 10వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చింది. ఈ వైద్యంతో కొన్ని రుగ్మతలకు సత్ఫలితాలు లభిస్తున్నాయి. హకీం ఎన్నో రకాల చికిత్సలను సూచిస్తారు.


ఇలాజ్‌ బి ఘిజా: ఇది ఆహార చికిత్స. ఈ చికిత్సలో రోగికి తగిన ఆహారాన్ని అందివ్వడం ద్వారా రోగం నయం అవుతుంది. ఉదాహరణకు రోగికి జ్వరం ఉంటే, పోషకభరిత, పీచు ఎక్కువగా ఉండే డాలియా, పాయసం తినిపిస్తారు. అయితే ఈ పదార్థాల పరిమాణం వైద్యులు నిర్ణయిస్తారు.


‘ఇలాజ్‌ బి మిస్లా’(ఆర్గానోథెరపీ): రోగగ్రస్థమైన అవయవాన్ని ఆరోగ్యంగా

ఉన్న అదే జంతు అవయవం కణజాల సారంతో చికిత్స చేస్తారు. 

ఇలాజ్‌ బి దావా(ఫార్మకోథెరపీ): ఇది ఔషధ చికిత్స. ఇతర చికిత్సా విధానాలన్నిటికంటే ప్రభావవంతమైన చికిత్స. ఈ చికిత్సలో మూలికలు, ఖనిజ లవణాలు, జంతు అవశేషాల నుంచి దాదాపు 2వేల రకాల ఔషధాలు తయారుచేయవచ్చు.


సాధారణ రుగ్మతల కోసం...

యునాని వైద్యంలో సాధారణ రుగ్మతల చికిత్స గురించిన ప్రయోగాత్మక చికిత్సలున్నాయి. అవేంటంటే..

కీళ్లనొప్పులు: మజూన్‌ సురంజన్‌ అనే యునాని ఔషధం రుమటాయిడ్‌ ఆర్ధ్రరైటిస్‌ అనే కీళ్లవాతం సమస్యను పరిష్కరిస్తుంది. అల్లం, కలబంద, మరికొన్ని మూలికలతో తయారయ్యే ఈ ఔషధం ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో మెరుగైన ఫలితాన్ని కనబరిచింది. కీళ్లవాపును తగ్గించడం ద్వారా వాతాన్ని తగ్గిస్తున్నట్లు తేలింది.


శుక్లం: కోల్‌ చిక్ని దావా అనే యునాని ఔషధం శుక్లాలను నివారిస్తుంది. ఈ ఔషధం కలిగిన కంటి చుక్కలను మధుమేహంతో ఉన్న ఎలుకల కళ్లలో వేసినపుడు శుక్లాల పెరుగుదల ఆగడం ప్రయోగాల్లో కనిపించింది. మధుమేహంలో గ్లాకోమాతో పాటు శుక్లాలు కలగడం సహజం.

మెదడు ఆరోగ్యం: ఖమేర అబ్రేషమ్‌ హకీం అర్షద్‌వాలా అనే ఔషఽధాన్ని యునాని వైద్యంలో విరివిగా వాడతారు. దీన్లో డజన్లకొద్దీ సహజసిద్ధ ఉత్పత్తులు (కుంకుమపువ్వు, యాలకులు) ఉంటాయి. వయసుతో పాటు మెదడులో వచ్చే మార్పులు, మెదడు పనితీరులో చోటు చేసుకునే మార్పులకు ఇది అద్భుతమైన ఔషధం. ఈ ఔషధంలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును దెబ్బతీసే ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి.


దుష్ప్రభావాలు

యునాని వైద్యంలో అనుసరించే కొన్ని చికిత్సలు కొంతమందికి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. కొన్ని మూలికల నుంచి తయారు చేసిన మందులు తగిన స్థాయి కంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కొన్ని ఔషధాలు లోహాలతో కలిసి విరుదఽ్ధమైన ఫలితాన్ని అందిస్తాయి. వేర్వేరు మూలికలు, వేర్వేరు పరిమాణాల్లో కలిపి తయారైన ఔషధాలకు ఇలాంటి స్వభావం ఉండడం సహజం. అలాగే గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, పిల్లలకు యునాని వైద్యం క్లిష్టమైనది కాబట్టి వైద్యులను కలిసి, వారి సూచన మేరకే అనుసరించాలి.

Updated Date - 2021-08-10T05:46:16+05:30 IST