అమ్మలా పాలిచ్చి ప్రాణం పోస్తోంది!

ABN , First Publish Date - 2021-10-20T07:17:24+05:30 IST

నిధి పరామర్‌ హీరానందానీ... తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్‌ నటించిన ‘సాండ్‌ కి ఆంఖ్‌’ సినీ నిర్మాత. 41 ఏళ్ల నిధి, గత ఏడాది ఫిబ్రవరిలో పండంటి బాబుకు తల్లయింది.

అమ్మలా పాలిచ్చి ప్రాణం పోస్తోంది!

చనుబాల దానానికి సంబంధించి మన దేశంలో ఎన్నో అపోహలున్నాయి. వాటన్నిటినీ పక్కకు తోసి, వృథా అయిపోతున్న తన చనుబాలతో, వందల మంది పసికందుల ప్రాణాలు నిలబెట్టింది నిధి పరామర్‌ హీరానందానీ. ఈ సాండ్‌ కీ ఆంఖ్‌ సినీ నిర్మాత, తన చనుబాల దానంతో లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన పాల కొరతను తీర్చి, కొత్తగా తల్లయిన మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది. తన అనుభవాన్ని నిధి ఇలా పంచుకుంటోంది. 


నిధి పరామర్‌ హీరానందానీ... తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్‌ నటించిన ‘సాండ్‌ కి ఆంఖ్‌’ సినీ నిర్మాత. 41 ఏళ్ల నిధి, గత ఏడాది ఫిబ్రవరిలో పండంటి బాబుకు తల్లయింది. అయితే బిడ్డకు పాలిచ్చినా, చనుబాలు మిగిలిపోతూ ఉండడంతో, తర్వాత వాడుకోవడం కోసం, వాటిని ఫ్రీజర్‌లో నిల్వ చేయడం మొదలుపెట్టింది. అయితే తర్వాత వాడే అవసరం ఎప్పటికీ రాకపోతూ ఉండడంతో, ఫ్రీజర్‌లో చనుబాల నిల్వలు పెరిగిపోవడం మొదలుపెట్టాయి. దాంతో ఎంతో విలువైన పోషకాలున్న చనుబాలు అలా వృథా కావడం నచ్చని నిధికి ఓ ఆలోచన తట్టింది. ఆ సమయంలో తానేం చేసిందో... ఇలా చెప్పుకొచ్చింది నిధి. ‘‘బిడ్డకు పాలిచ్చినా ఇంకా పాలు మిగిలిపోతూ ఉండేవి. దాంతో వాటిని ఏం చేయవచ్చో తెలుసుకోవడం కోసం ఇంటర్నెట్‌లో వెతకడం మొదలుపెట్టాను. జాగ్రత్తగా దాచిపెడితే చనుబాలు ఫ్రీజర్‌లో మూడు నుంచి నాలుగు నెలల వరకూ పాడవకుండా ఉంటాయని తెలిసింది. ఆ పాలను ఫేస్‌ మాస్క్‌గా వాడుకోవచ్చనీ, ఆ పాలతో బిడ్డకు స్నానం చేయించవచ్చనీ.. ఇలాంటి బోలెడన్ని అర్థం లేని సలహాలు, సూచనలూ కొన్ని ఇంటర్నెట్‌ నుంచీ, ఇంకొన్ని స్నేహితుల నుంచీ కూడా తెలుసుకున్నాను. బాబు పుట్టిన నెలన్నర రోజలకే నా దగ్గర పాల నిల్వలు పెరిగిపోయాయి. బిడ్డకు అమృతతుల్యమైన చనుబాలను ఇలా వృథా చేయడం సరైన పనేనా? వీటిని సద్వినియోగపరిచే మార్గమే లేదా? అని ఆలోచించి చనుబాల దానం గురించి ఆరా తీశాను. 

 

42 లీటర్లకు పైగా... 

ముంబయిలోని సూర్యా హాస్పిటల్‌ లాక్‌డౌన్‌ కారణంగా చనుబాల కొరతను ఎదుర్కొంటోంది. ఈ విషయం నాకు అక్కడి గైనకాలజిస్ట్‌ చెప్పారు. చనుబాల దానం గురించి ఆరా తీయడం కోసం నేను ఆవిడను సంప్రతిస్తే, నాకు ఆవిడ చెప్పిన విషయమది. ఆ సమాధానంతో నాకెంతో ఊరట దక్కింది. వృథా అయిపోతున్న చనుబాలను సద్వినియోగం చేయగలిగే మార్గం కనిపించినందుకు ఎంతో ఆనందం కలిగింది. అయితే అది కరోనా లాక్‌డౌన్‌ సమయం. బాలింతనైన నేను రిస్క్‌ తీసుకుని ఆస్పత్రికి వెళ్లి, చనుబాలను అందించలేను. అదే విషయాన్ని ఆ వైద్యురాలితో చెప్పాను. అప్పుడావిడ పాలను మా ఇంటి నుంచి జీరో కాంటాక్ట్‌ ద్వారా సేకరించే ఏర్పాట్లు చేశారు. అలా మొదటిసారి, ఫ్రీజర్‌లో ఉన్న 150 మిల్లీలీటర్ల పాలతో కూడిన 20 ప్యాకెట్లను దానం చేశాను. అలా గతేడాది మార్చి నుంచి మే నెలల మధ్య దాదాపు 42 లీటర్ల చనుబాలను దానం చేశాను. భిన్నమైన కారణాలతో తల్లిపాలను తాగలేని పరిస్థితిలో ఉండే పసికందులుంటారు. ఇలాంటి పిల్లలకు దానంగా అందే చనుబాలే ఆధారం. అలా అత్యవసర పరిస్థితుల్లో ఆ పిల్లల ప్రాణాలు నిలబెట్టగలిగినందుకు నాకెంతో గర్వంగా ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చింది నిధి. 

Updated Date - 2021-10-20T07:17:24+05:30 IST