ఆతిథ్యం నుంచి అభినయానికి

ABN , First Publish Date - 2021-07-12T06:26:07+05:30 IST

ఎయిర్‌హోస్టెస్‌... నటన. ఒకటి ఇష్టపడి చేసింది. రెండోది కష్టమైనా కోరుకున్నది. ఇది నా జీవితం. నాకు నచ్చినట్టు జీవించాలన్నదే నా అభిమతం.

ఆతిథ్యం నుంచి అభినయానికి

బెంగళూర్‌ విమానాశ్రయం... ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ‘దయచేసి సీట్‌ బెల్టులు పెట్టుకోండి’... ఎయిర్‌హోస్టెస్‌ అనౌన్స్‌మెంట్‌. చూపు తిప్పుకోనివ్వని రూపు... చిరునవ్వు చెరగని మోము... నిండైన ఆత్మవిశ్వాసం ఆమెలో. 


హైదరాబాద్‌ నగరం... చుట్టూ జనం. లైట్స్‌ ఆన్‌... స్టార్ట్‌... కెమెరా... యాక్షన్‌! లక్షణమైన అమ్మాయి... సంప్రదాయ చీర కట్టులో మెరిసిపోతోంది. చక్కని అభినయంతో ఓ బరువైన సన్నివేశాన్ని పండిస్తోంది. 


ఎయిర్‌హోస్టెస్‌గా ‘ల్యాండయ్యి’... నటిగా ‘టేకాఫ్‌’ తీసుకున్న యుక్తా మల్నాడ్‌ జర్నీ ఇది. ‘ఆకాశ మార్గాన్ని’ వీడి ‘కలల తీరం’లో విహరిస్తున్నావు ఎందుకని అడిగితే... ఓ నవ్వు రువ్వి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చింది... 


యిర్‌హోస్టెస్‌... నటన. ఒకటి ఇష్టపడి చేసింది. రెండోది కష్టమైనా కోరుకున్నది. ఇది నా జీవితం. నాకు నచ్చినట్టు జీవించాలన్నదే నా అభిమతం. అందుకే రొటీన్‌ ఉద్యోగాలను కాదని వైమానిక రంగం వైపు వెళ్లాను. నటిని కావాలన్న బలమైన ఆకాంక్షతో ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చాను. కర్ణాటకలోని చిక్‌మంగళూర్‌ మాది. చదివింది బీకాం. 2017లో పూర్తయింది. అయితే చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే తెగ ఇష్టం. ఇంట్లో పాట వినిపించిందా... చిందులే చిందులు. సినిమాలు చూస్తే... అందులోని నటులను అనుకరించడాలు. వెస్ట్రన్‌ డ్యాన్స్‌లో చాలా రకాలు అలా నేర్చుకున్నవే. బడిలో... ఆ తరువాత కళాశాలలో ఇంటర్‌ కాలేజీ, రాష్ట్ర స్థాయి డ్యాన్స్‌ పోటీల్లో  బహుమతులెన్నో వచ్చాయి. 


డిగ్రీలోనే సినిమా ఆఫర్‌... 

కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో కూడా పాల్గొనేదాన్ని. 2015లో ‘మిస్‌ మల్నాడ్‌’ టైటిల్‌ గెలచుకున్నా. దానికి గుర్తుగా నా పేరు పక్కన ‘మల్నాడ్‌’ చేర్చుకున్నా. అంతా ఇది మా ఇంటి పేరనుకొంటారు. అది చూసి కన్నడ చిత్రం ‘అనిసుతిదే’లో అవకాశం లభించింది. అప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం. సినిమా పూర్తయింది కానీ, కొన్ని కారణాలవల్ల విడుదల కాలేదు. డిగ్రీ ఫైనలియర్‌లో ప్రముఖ హీరో విజయ్‌ రాఘవేంద్రతో చేయమని అడిగారు. కానీ అది పరీక్షల సమయం కావడంతో ఇంట్లో వాళ్లు వద్దన్నారు. 


‘ఎయిర్‌హోస్టెస్‌’ వదిలేసి... 

నిజానికి నాకు బాగా ఇష్టమైనవి మూడు... డ్యాన్స్‌, ఎయిర్‌హోస్టెస్‌, నటన. మూడింటిలో నటన చాలా ఇష్టం! చదువు అయిపోగానే ముందు ఎయిర్‌హోస్టెస్‌ ట్రైనింగ్‌ తీసుకున్నా. 2018లో ‘స్పైస్‌ జెట్‌’లో ఎయిర్‌హోస్టె్‌సగా ఉద్యోగం. ఆకాశంలో విహరిస్తూ... ఆతిథ్యం అందివ్వడం మధురమైన అనుభూతి. అంతా నేను అనుకున్నట్టే సాగిపోతోంది. అయితే ఉన్నట్టుండి నా మనసు మళ్లీ నటనపైకి మళ్లింది. అంతే... రెండుమూడు నెలలు తిరక్కుండానే ఉద్యోగం వదిలేశా. నాకే కాదు... ఎంతోమంది అమ్మాయిల కలల కొలువు అది. మంచి జీతం. అందం ఒక్కటే కాదు... క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండేవారికే ఆ ఉద్యోగం ఇస్తారు. ఇంట్లో వాళ్లు కూడా వద్దన్నారు. నేను వినలేదు. కానీ సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఉండేది.


కొన్నాళ్లు కొరియోగ్రాఫర్‌గా... 

ఉద్యోగం మానేసిన తరువాత కొన్నాళ్లు ఖాళీగా ఉన్నా. సమయం వృథా చేయడం ఎందుకని మా డ్యాన్స్‌ మాస్టర్‌ హరిణి మదన్‌ దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరాను. కన్నడ, తెలుగు, తమిళ్‌ ఇండస్ర్టీల్లో ఇరవై ఏళ్లకు పైగా అనుభవం ఆయనది. ఆయనతో కలిసి కన్నడ, తుళు చిత్రాలకు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేశాను. ఇక్కడ ఆసక్తికర విషయం ఒకటి చెప్పాలి. సినిమా షూటింగ్‌ సెట్‌. నటీనటులకు డ్యాన్స్‌ మూమెంట్స్‌ చెబుతూ బిజీగా ఉన్నా. అక్కడ నన్ను చూసిన వారంతా ఆ సినిమాలో హీరోయున్‌ నేనే అనుకున్నారు. పాశ్చాత్య డ్రెస్‌ల్లోనే కాదు... సంప్రదాయ వస్త్రాల్లో కూడా బాగుంటానని చాలామంది అంటుంటారు. బహుశా అదే నా ప్లస్‌ పాయింట్‌ అయ్యుండవచ్చు. 


తమిళంలో తొలిసారి... 

ఒక మంచి అవకాశం కోసం చూస్తున్న సమయం. అనూహ్యంగా తమిళం నుంచి ఆఫర్‌ వచ్చింది. కన్నడ సీరియల్‌ కోసం ఆడిషన్స్‌ ఇచ్చాను. కథ చర్చలు జరుగుతున్నాయి. ఆ టీమ్‌లో ఒకరు తమిళ్‌లో చేస్తావా అని అడిగారు. సెకండ్‌ హీరోయిన్‌గా. సరే అన్నాను. అలా ‘శివగామి’తో తొలిసారి సీరియల్‌ (2019)లో నటించాను. సినిమా చేసి సీరియల్‌కు ఎందుకు వెళ్లావని చాలామంది అడిగారు. నాకైతే రెండూ ఒకటే. నటిగా నిరూపించుకోవడమే ముఖ్యం. అదే సమయంలో అనుభవం కూడా వస్తుంది కదా! 


అక్కడ చూసి తెలుగులో... 

అప్పుడు తమిళ సీరియల్‌తో పాటు కన్నడలో మరో సినిమా కూడా చేస్తున్నా. హీరోయిన్‌గా! పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. దాని కోసం మా ఊళ్లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. అక్కడ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ఒకాయన నన్ను చూసి తెలుగు సీరియల్‌కు ప్రతిపాదించారు. అలా వచ్చిందే ప్రస్తుతం ‘జీ తెలుగు’లో ప్రసారమవుతున్న ‘వైదేహీ పరిణయం’. ఏప్రిల్‌లో మొదలైంది. వాస్తవానికి సినిమా ద్వారా తెలుగులో అడుగు పెడదామనుకున్నా. అలాగని వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోకూడదు కదా! ‘వైదేహీ పరిణయం’లో నాది వైదేహి పాత్ర. అందంగా, అమాయకత్వం నిండిన అమ్మాయి వైదేహి. ఒకరిపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడాలనుకొనే తత్వం. కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టని మనస్తత్వం. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు. చెప్పలేనంత సంతోషంగా ఉంది. 


అదే నా కోరిక...

నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. కెరీర్‌ పరంగా మంచి సినిమా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవాలి. బాగా సంపాదించాలి. ఎందు కంటే జీవితంలో నేను సాధించాల్సింది చాలా ఉంది. భవిష్యత్తులో సాధ్యమైనంత మందికి సేవ చేయాలనుకొంటున్నా. ఇప్పటికీ అవసరమని వస్తే ఎవర్నీ తిప్పి పంపను. కానీ అది సరిపోదు. పెద్ద ఎత్తున చేయాలి. అందుకు కొంత కాలం తరువాత నా సంపాదనలో 50 శాతం ఖర్చు చేస్తాను. ప్రతి పుట్టుకకూ ఒక అర్థం ఉంటుంది. దానికి రూపం సేవే అనుకొంటున్నా. అలాగే మా చిక్‌మంగళూర్‌ ప్రకృతితో అలరారుతుంటుంది. అలాంటి పచ్చని వనాల్లో ఆహ్లాదంగా జీవించాలనేది నా కోరిక. నేను ఆరాధించే ఆ వెంకటేశ్వరుడే నా ఆశయాలు, కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతున్నా. 


‘మల్నాడ్‌’ మెరుపుల్‌...

వెస్ట్రన్‌ డ్యాన్స్‌లు దుమ్ము రేపుతుంది 

ఖాళీగా ఉంటే కవితలు రాస్తుంది. ‘ఫేస్‌బుక్‌’ కోసం కాదు... తన పుస్తకం కోసం 

వంట రాదు... కానీ రుచులన్నీ ఆస్వాదిస్తుంది 

హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఆహా! మటన్‌, ఫిష్‌ వంటకాలు అద్భుతహా! 

సినీ నటుల్లో ప్రభాస్‌, సమంత, అజిత్‌లు ఇష్టం. 

కన్నడ హీరో దర్శన్‌ అంటే ప్రాణం

Updated Date - 2021-07-12T06:26:07+05:30 IST