స్నేక్‌హితులు!

ABN , First Publish Date - 2021-10-07T05:30:00+05:30 IST

అదిగో పాము అంటే చాలు.. భయస్తులెవరైనా అరవై మీటర్లు దూరం పరిగెత్తి వెనక్కి చూస్తారు. సాధారణంగా పాము కనపడితే......

స్నేక్‌హితులు!

అదిగో పాము అంటే చాలు.. భయస్తులెవరైనా అరవై మీటర్లు దూరం పరిగెత్తి వెనక్కి చూస్తారు. సాధారణంగా పాము కనపడితే.. పురుషులు కంటే మహిళలు ఎక్కువ భయపడతారు. అయితే వీళ్లు అలా కాదు.  ఫలానా చోట ‘పాము ఉంద’ని కాల్‌ చేస్తూనే లొకేషన్‌కి వెళ్లిపోయి.. పట్టేసుకుంటారు. పామును పట్టేశామనే హీరోయిజం, గర్వం వీరిలో మచ్చుకైనా కనిపించదు. ఓ ప్రాణిని కాపాడామనే ఆనందం వీరిలో ఉంటుంది. హైదరాబాద్‌లోని బాచుపల్లి దగ్గర ఉండే బౌరంపేటలోని ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ సభ్యులు వీళ్లంతా. పాములను కాపాడి ప్రకృతిని రక్షిస్తోన్న ఈ రియల్‌ హీరోయిన్ల ప్రవృత్తి  ఆసక్తికరం.. స్ఫూర్తిదాయకం!


డీగ్రీ చదివేప్పుడు పాములపై ఆసక్తి కలిగింది. ఏడేళ్ల కిందట సైనిక్‌పురిలోని ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ’ దగ్గరికెళ్లా. అక్కడి ఇంచార్జి అవినాశ్‌తో మాట్లాడాక వీటిపై ప్రేమ కలిగింది. సొసైటీలో సభ్యురాలినవుతానంటే ఇంట్లో ముందు వొప్పుకోలేదు. ‘సరే’నన్నాకనే శిక్షణ తీసుకున్నా. రాజేంద్రనగర్‌లోని హాస్టల్‌లో చదువుకుంటుంటే.. కాల్‌ సెంటర్‌ ద్వారా ఓ రెస్క్యూ వచ్చింది. లొకేషన్‌కు వెళ్లి జెర్రిపోతు పట్టుకున్నా. అదే నా మొదటి రెస్క్యూ. ఎంతో గర్వంగా ఫీలయ్యా. నిద్ర పట్టలేదు ఆ రోజు రాత్రి. కాలేజీ బంక్‌ కొట్టి మరీ రెస్క్యూకి వెళ్లేదాన్ని. 


రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, మెహదీపట్నం, గండిపేట్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మణికొండ ప్రాంతాల్లో పాములు పడతాను. రెస్క్యూకి రాత్రిపూట వెళ్లినా అమ్మానాన్న ఏమనేవారు కాదు. ఓ రోజు నార్సింగి దగ్గర పాము ఉందని కాల్‌ వచ్చింది. అది కూడా రాత్రి పదకొండున్నర సమయంలో. అక్కడికెళ్తే గోడ సందులో ఉందన్నారు. బయటకు రాలేదు. నీళ్లు వేసి చూశా. రెండు గంటలు అక్కడే ఉన్నా. చివరికి బయటికొచ్చింది. అది ఆరడుగుల పైథాన్‌. దాన్ని నా తోటి సొసైటీ మెంబర్‌ అయిన నిఖిల్‌తో కలిసి పట్టుకున్నా. ఆ సంఘటన మర్చిపోలేను.

మా వీధిలోని వారే కాకుండా.. తెల్సినవాళ్లు పామును చూస్తే.. నాకే ఫోన్‌ చేస్తారు. మా అన్నయ్య ప్రదీపక్‌ ‘ఇంత ధైర్యం ఎక్కడిద’ని ఆశ్చర్యపోతాడు. జెర్రిపోతు, పచ్చారుపాములు చేతులకి చాలాసార్లు కుట్టాయి. చీమ కుట్టినట్లు ఉంటుందంతే. రంగు, చారలు బట్టి విషం లేదని నిర్ధారించుకున్నాకే చేత్తో పట్టుకుంటా. విషముంటే హ్యాండ్లింగ్‌ స్టిక్‌ ఉపయోగిస్తా. వాటిని ప్లాస్టిక్‌ డబ్బాలు, బాటిల్స్‌లో పంపిస్తా. ఇప్పటి వరకూ ఎనిమిది వందలకి పైగా పాములు పట్టుకున్నా. ‘బ్రేవ్‌గర్ల్‌’ అంటుంటారంతా. త్వరలో పీహెడీ చేయడానికి బెంగుళూరు వెళ్తాను. ఎక్కడికెళ్లినా నా ప్రవృత్తి ధర్మాన్ని వదలను. 

- నిఖిల వాగ్దేవి


మాది సంగారెడ్డి. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు.. పాములపై అవగాహన కార్యక్రమాన్ని చూశా. శని, ఆదివారాల్లో శిక్షణ పొందా. పాముల ఐడెంటిఫికేషన్‌ త్వరగా అర్థమైంది. పామును ఏ భాగంలో పట్టుకుంటే సేఫ్‌ అనే టెక్నిక్‌ ముఖ్యం. గురువు అవినాశ్‌  ఇచ్చే శిక్షణ అద్భుతం. గదిలో ఏ పామును ఎక్కడ ఉంచుతారో చెప్పరు. మనమే వెతికి పట్టుకోవాలి. శిక్షణ కఠినం కాబట్టే రెస్క్యూలో ఇబ్బంది ఉండదు. సోషల్‌మీడియాలో పేరు కోసం వస్తే సొసైటీలోకి రానివ్వరు. 


తొలి రెస్క్యూకి నార్సింగిలోని ఓ స్లమ్‌ ఏరియాకెళ్లా. క్యాట్‌ స్నేక్‌ కావటంతో చేత్తోనే పట్టేసుకున్నా. చూసినవారంతా ఆశ్చర్యపోయారు. మెచ్చుకున్నారు. రాజేంద్రనగర్‌, మర్రిచెట్టు, గచ్చిబౌలి ప్రాంతాల్లో రెస్క్యూలు చేస్తుంటా. కష్టమైన సందర్భాలు ఎదురైనా పాముల్ని రక్షించడం కోసమే పని చేస్తాం. ఓసారి సంప్‌లో విషం లేని పామును చూశా. పట్టుకుంటూనే కాటేసింది. చేతికి రక్తం వచ్చింది. ఇలాంటి సందర్భాలెన్నో!


సున్నితమైన వ్యక్తిగా కనిపిస్తా. రెస్క్యూలో చురుగ్గా, వేగంగా ఉండటం నా లక్షణం. దీంతో జనాల దృష్టికోణం చాలా మారింది.  ఆడపిల్లలూ క్లిష్టమైన పనులు చేయగలరనే నమ్మకం పెరిగింది. ఇప్పటి వరకూ 200 పాములకి పైగా పట్టుకున్నా. హెచ్‌.ఆర్‌ ఉద్యోగంలో చేరాక ఆదివారమే సొసైటీకి కేటాయిస్తున్నా. చిన్నపిల్లలకు పాముల గురించి అవగాహన కల్పిస్తుంటా. హైదరాబాద్‌లోని 30 శాతం మందికి కూడా ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ’తెలీదు. అందులో అమ్మాయిలూ పని చేస్తున్నారని అసలే తెలీదు. తెలుగునాట పల్లె పల్లెకూ సొసైటీ గురించి తెలియాలనేదే మా కల. 

- భావన రెడ్డి


నాలుగో తరగతిలో శ్రీశైలం వెళ్లే రహదారిలో చనిపోయిన పామును ముట్టుకుంటే అమ్మ తిట్టింది. దినపత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలను భద్రపరిచేదాన్ని. అనిమల్‌ ప్లానెట్‌, నేషనల్‌ జియోగ్రఫీ చానెల్స్‌లో పాముల ఎసిసోడ్స్‌ చూసేదాన్ని. పాముల కథల్ని ఆసక్తిగా వినేదాన్ని. పాము కోసమే ‘చంద్రముఖి’ సినిమాను వందలసార్లు చూశా. ‘పాములు ఇష్టం’ అంటే.. చుట్టుపక్కనోళ్లంతా అదోరకంగా చూసేవారు. 


నాలుగేళ్ల కిందట ఓ తెలుగు దినపత్రికలో పాములు పట్టే అమ్మాయిల కథనాన్ని చదివా. ఇంట్లో చెప్పకుండా సొసైటీకి వెళ్లా. పాములు పట్టడం నేర్చుకుంటానంటే.. ‘ఇదేం బుద్దే’ అంటూ అమ్మ తిట్టింది. చాలా సార్లు కొట్టింది. బతిమాలా. ఎన్నో గొడవలు, సర్దుబాట్లు. నా మొండితనం భరించలేక ‘నీ ఇష్టం. జాగ్రత్త’ అంటూ బాధపడింది. శిక్షణ అయ్యాక ఎనిమిది నెలలకి రెస్క్యూ అవకాశం వచ్చింది. ఆ రోజు శనివారం.. ‘నాగోల్‌లో పాముంద’ని ఫోనొచ్చింది. బైక్‌లో పెట్రోలు ఉందా? పర్సుందా? అని చూసుకోకుండా స్పాట్‌కి వెళ్లా. ఓ భవన నిర్మాణ ప్రాంతమది. ‘రాళ్లలో పాముంద’న్నారు. కూలీలతో రాళ్లను తీయించి చూస్తే అక్కడ రెండు తలల నాగుపాము కనిపించింది. హ్యాండ్లింగ్‌ స్టిక్‌తో పట్టుకున్నా.


అంబర్‌పేట్‌లో మురికిని శుద్ధి చేసే ప్లాంట్‌ దగ్గరకి రెస్క్యూకి వెళ్లానోసారి. ఐదున్నరడుగుల పాము గోడపై ఉంది. జనాలు ఒకటే అరుపులు. పడతానా? లేదా అనే డైలామాలో పడ్డాన్నేను. అరగంట తర్వాత మురికి నీటిలో నావైపే వచ్చిందది. చేతికి గ్లౌజులు వేసుకుని హ్యాండ్లింగ్‌ స్కిక్‌తో పట్టుకున్నా. ఆ నాగుపాము అగ్రెసివ్‌గా ఉంది. పాము తోకను ఎడమచేత్తో పట్టుకుని కుడిచేతిలోని హ్యాండ్లింగ్‌ స్టిక్‌తో తల దగ్గక పట్టేసి.. రెండు అంతస్తుల ఎత్తు ఎక్కేశా. ఆ గలీజు వాసన భరించలేకపోయా. రెస్క్యూలకి వెళ్తే.. ‘పట్టగలవా?’ అంటూ కొందరు ఎగతాళి చేస్తారు. 160 పాములు పట్టుకున్నా. అమ్మ, చుట్టాలు ‘పాములు పట్టేదాన్ని పెళ్లి కూడా చేసుకోర’ంటారు. ఇటీవలే ఎమ్మెస్సీ మెరైన్‌ బయాలజీలో సీటొచ్చింది. సముద్రజీవుల కోర్సు అది. 

- సాత్విక


నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్‌వాయి మండలం.. తిరుమన్‌ పల్లి గ్రామం మాది. మా పిల్లలు.. చంద్రశేఖర్‌, ఆదిత్య, గాయత్రి ఈ స్నేక్స్‌ సొసైటీలో సభ్యులే. పెద్దబ్బాయి హైదరాబాద్‌లో చదివేప్పుడు ఈ సొసైటీలో చేరి ఇద్దరి తోబుట్టువుల్నీ సొసైటీకి తీసుకెళ్లాడు. అందరూ రెస్క్యూలకు వెళ్లేవారు. ఊరిలో పాములు ఎక్కువ ఉండటంతో మా పెద్దబ్బాయి నాక్కూడా శిక్షణ ఇప్పించాడు. కేవలం మూడు క్లాసులకెళ్లానంతే. తర్వాత పిల్లలే శిక్షణ ఇచ్చారు. 


మొదటిసారి కట్లపాము పట్టుకున్నా కానీ బ్యాగులో ఎలా వేయాలో అర్థం కాకపోతే.. సతీష్‌ అనే వాలెంటీరు సాయం చేశాడు. త్రాచుపాములు, కట్ల పాములు, రక్తపింజరిలు, జెర్రిపోతులు పొలాల్లో కనిపిస్తుంటాయి. అన్నింటి కంటే మా ప్రాంతంలో నాగుపాములే ఎక్కువ. 


నా వయసు అరవై ఏళ్లు... ఏ పామైనా పట్టేస్తా. ఇదేమీ బ్రహ్మవిద్య కాదు. మరీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే సొసైటీ సభ్యులైన సతీష్‌, మహిపాల్‌ను హెల్ప్‌ అడుగుతా. ఎవరైనా పాము కనపడుతూనే ఫోన్‌ చేస్తారు. బైక్‌మీద వచ్చి నన్ను ఎక్కించుకుని లొకేషన్‌కి తీసుకెళ్తారు. మళ్లీ ఇంటి దగ్గర వదలిపెడతారు. చుట్టుపక్కనోళ్లు ‘మీరున్నన్నాళ్లూ మాకేమీ భయం లేదమ్మా!’ అంటారు. మా ఆయన, పిల్లల సహకారంతోనే ఈ పని చేయగలుగుతున్నా. ఓ రోజు అర్ధరాత్రి దాటాక రెస్క్యూకెళ్లి.. నాగుపామును పట్టుకొచ్చా. గుడ్లు పెట్టిందది. ఇసుకలో పెడితే పిల్లలయ్యాయి. పట్టిన పాములన్నీ ఇంటికే తెస్తాను. ఒక్క ఎలుకను తింటే పాముకి పదిరోజులు ఆహారం అక్కర్లేదు. పిల్లలు ఇంటికి వచ్చినపుడు. అధికారుల సహకారంతో అడవిలో వదిలేస్తుంటారు. నా కూతురు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ సంస్థలో హెచ్‌.ఆర్‌. ఒక బిడ్డ తల్లి అయినా.. పాముల రెస్క్యూకి వెళ్తుంది. మా వారు తప్ప ఇంటిల్లిపాది పాములను పట్టేవాళ్లమే.

- సిహెచ్‌ రాధ


చిన్నప్పటి నుంచీ వైల్డ్‌లైఫ్‌ చానల్స్‌ చూసేదాన్ని. ఆరేళ్ల వయసులో చిలుకూరి బాలాజీ టెంపుల్‌ దగ్గర పాముల గురించి అవగాహన కార్యక్రమం చూశా. ‘ఎవరైనా పాము దగ్గరకు రండి పిల్లల్లారా!’ అంటూనే వెళ్లా. పామును మెడలో వేయించుకున్నా. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజే పాములపై ఆసక్తి కలిగింది.  


మూడేళ్ల క్రితం స్నేక్స్‌ సొసైటీలో చేరా. అక్కడ పాముల గురించి ఎన్నో చర్చలు జరిగితే.. అందరూ నాలాంటి వారే కదా! అని హ్యాపీగా ఫీలయ్యా. బేంగపేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ఏరియాలను నాకు కేటాయించారు. మొదటి రెస్క్యూ కుత్బుల్లాపూర్‌లో చేశా. అలవెరా చెట్టును చుట్టుకుని ఉందా పాము. భయం, నెర్వస్‌నెస్‌తో పట్టుకున్నా.


పాము పడుతూనే.. లోకల్‌ వాళ్లు ప్రశ్నలతో ముంచెత్తుతారు. వారికీ అవగాహన కల్పిస్తా. రెస్క్యూలో వీడియోలు తీస్తున్నా పట్టించుకోను. మా దృష్టి అంతా పామును రక్షించడమే. ఇప్పటివరకూ వందకి పైగా పాముల్ని పట్టా. రెండు వందల అవగాహన కార్యక్రమాలు చేశా. ఎన్ని పనులున్నా.. సొసైటీకి సమయమిస్తా. వైల్డ్‌లైఫ్‌కు సంబంధించి టైగర్‌జోన్‌ ప్రాంతంలో పని చేశా. ఎన్జీవోలు మా సాయం తీసుకుంటుంటాయి.

- నిఖిత 


1995లో రాజ్‌కుమార్‌ కానూరి స్థాపించారు. 2010లో జనరల్‌ సెక్రటరీనయ్యా. పద్దెనిమిది ఏళ్లు నిండితేనే ఎన్జీవోలో చేర్చుకుంటాం. ఏడాదికి వందమంది వస్తే చివరికి ఇక్కడ పదిమందే మిగులుతారు. కఠినమైన శిక్షణతో పాటు క్రమశిక్షణ తప్పితే సభ్యత్వం రద్దు చేస్తా. ఎందుకంటే తప్పు జరిగితే.. జీవితం ఉండదు. అటవీ శాఖతో కలిసి పని చేస్తుంది మా సంస్థ. ప్రతి పాముకూ డాక్యుమెంటేషన్‌ ఉంటుంది. పట్టుకున్న పాములకి గాయాలపాలైతే నెహ్రూ జులాజికల్‌ పార్కుకు పంపుతాం. వైద్యులు సర్జరీ చేస్తారు. మా దగ్గరకొచ్చిన ప్రతి పామునూ రెండు వారాల్లోపు దట్టమైన అడవుల్లో వదిలేస్తాం. 


హైదరాబాద్‌లోని బాచుపల్లి దగ్గరలోని బౌరంపేటలో మా సంస్థ ఉంది. హైదరాబాద్‌పైనే మా ఫోకస్‌ ఎక్కువ. నిజామాబాద్‌, అదిలాబాద్‌ ప్రాంతాల్లో 150 మంది వాలెంటీర్లున్నారు. వీరిలో విద్యార్థులు, గృహిణులు, మెడికల్‌ ఆఫీసర్లు, వైద్యులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్నారు. పాము కాటేసిన వెంటనే ఏం చేయాలో అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది 8895 పాముల్ని కాపాడాం. దేశంలో సంవత్సరానికి 52 వేలమంది పాము కాటుకు మరణిస్తున్నారు. పాము కాటుకు ఒక్క మనిషి కూడా చనిపోకూడదనేదే మా కల. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పాము కనపడితే.. 8374233366 నంబర్‌కు కాల్‌ చేయండి. 


- అవినాశ్‌, జనరల్‌ సెక్రటరీ, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ


రాళ్లపల్లి రాజావలి

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST