పిల్లలతో స్నేహం మంచిదే

ABN , First Publish Date - 2021-06-23T08:57:28+05:30 IST

ఉదయం లేచిన దగ్గరనుంచి పిల్లలు గట్టిగా అరవడం, ప్రతిదీ ఇతరుల మీద కంప్లయింట్‌ చేయడం చేస్తుంటారు.

పిల్లలతో స్నేహం మంచిదే

పేరెంటింగ్‌  

ఉదయం లేచిన దగ్గరనుంచి పిల్లలు గట్టిగా అరవడం, ప్రతిదీ ఇతరుల మీద కంప్లయింట్‌ చేయడం చేస్తుంటారు. ఇది చాలా మామూలు విషయమే అని కొట్టిపారేయద్దు. పిల్లల గురించి కాస్త ఆలోచిస్తే వాటికి పరిష్కారం దొరుకుతుంది. పిల్లలంటేనే అల్లరి. వారికి ప్రతి చిన్న విషయం పెద్దగానే అనిపిస్తుంది. వారిది చాలా చిన్న ప్రపంచం. మనకు ఒక విషయం చాలా చిన్నదిగా అనిపించొచ్చు కానీ అది పిల్లలకు మహాద్భుతంగా ఉంటుంది. పిల్లల మానసిక స్థితులను ఆలోచించటంతో పాటు వారికి సమయం ఇవ్వటం పేరెంట్స్‌ చేయాల్సిన పని. అసలు పిల్లలు గట్టిగా అరవడం, కంప్లయింట్‌ ఇవ్వటం లాంటివి అమ్మానాన్న దగ్గరనుంచే నేర్చుకుంటారు. ఇంట్లో ప్రతిదీ పిల్లలు గమనిస్తుంటారనే విషయం పెద్దలు మర్చిపోకూడదు. 


పిల్లలు గట్టిగా అరుస్తుంటే...

అసలు సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలి. వారికి ధైర్యం చెప్పాలి. ఇలా కాదు... ఇలా ఉండాలని కరెక్ట్‌ చేయాలి. గట్టిగా అరవడం వల్ల ఇతరులు చెప్పేది అర్థం కాదని చెప్పాలి. అరిచేప్పుడు వీడియో తీసి చూపించి.. ఇలా అరిస్తే ఉపయోగం లేదని చెప్పాలి. పిల్లల వాయిస్‌ బావుందని మెచ్చుకుంటూనే.. గట్టిగా అరవడం మంచిదికాదని చెప్పాలి. దాని అర్థం పిల్లల మానసికబలాన్ని పెంచడమే. బిగ్గరగా అరుస్తూ. ఏడ్చే పిల్లలను అలా వదిలెయ్యకుండా వారికి ఏవైనా పజిల్స్‌ ఇవ్వాలి. కొన్ని యాక్టివిటీలు, టాస్క్‌లు ఇవ్వాలి. గేమ్స్‌ ఆడించాలి. ఛాలెంజింగ్‌గా, స్పోర్టివ్‌గా ఉండేతత్వాన్ని వారికి మాటల్లో తెలియజేయాలి. గంటలపాటు టీవీ, వీడియోగేమ్స్‌తో కాలక్షేపం చేస్తుంటే వారికి మంచి, చెడు చెప్పాలి. క్రమశిక్షణ వారిలో అలవాటు చేయాలి. చెప్పినట్లు పిల్లలు చేస్తుంటే.. వారికి బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపడేట్లు చేయాలి. పిల్లల్లో ఉండే మంచితనం, ప్రతిభకు కాంప్లిమెంట్స్‌ ఇవ్వాలి. వాళ్లతో మాట్లాడటం, వారితో స్నేహం చేయడం అంటే వాళ్ల ఎమోషన్స్‌ పంచుకోవటమే అని గుర్తుంచుకోవాలి.

Updated Date - 2021-06-23T08:57:28+05:30 IST