ఎసిడిటీని తగ్గించే ‘పొట్లకాయ’

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

తెల్లని పొడలు (చారలు) ఉంటాయి కాబట్టి, పొడలకాయ, పొట్లకాయగా ప్రసిద్ధి పొందింది. ఈ పొట్లనే సంస్కృతంలో పటోలా అంటారు...

ఎసిడిటీని తగ్గించే ‘పొట్లకాయ’

తెల్లని పొడలు (చారలు) ఉంటాయి కాబట్టి, పొడలకాయ, పొట్లకాయగా ప్రసిద్ధి పొందింది. ఈ పొట్లనే సంస్కృతంలో పటోలా అంటారు. పొట్లలో తీపిపొట్ల, చేదుపొట్ల, అడవిపొట్ల, గుజ్జుపొట్ల ఇలా అనేక రకాలు ఉన్నాయి. 


భారతదేశంలో పొట్లకాయ, చైనాలో బీరకాయ ప్రపంచంలోని అత్యంత పొడవైన కాయలుగా చెప్తారు. వంకర తిరక్కుండా దీని కొసకు చిన్నరాయిని కడతారు. బీర సొర కాయల్లాగా ఇది కూడా చలవనిచ్చేదే కానీ దీనికి గల వెగటు వాసన పామువాసనే అనిపిస్తుంది. దీనిలోని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఎ, బి, సి విటమిన్లు, ఇతర పోషక గుణాలే పొట్లకు గల వాసనకు కారణం. చక్కగా వండితే ఈ వాసన పోతుంది. 


పొట్లకాయ కూరని సుగంధ భరితంగా వండుకునే విధానాన్ని నలుడు ఇలా వివరించాడు 

‘‘పైన నూగు పోయేలా పొట్లకాయని బాగా కడిగి ముక్కలుగా తరగండి. పదునైన సన్నని చాకుతో ఈ పొట్లకాయ లోపల ఉండే గుజ్జుని, గింజల్ని తోడి బయటకు తీస్తే, పొట్లకాయ ముక్కలు గొట్టాల మాదిరిగా ఉంటాయి. ఈ పొట్లకాయ ముక్కల్ని నీళ్లలో వేసి కొంచెం మిరియాలపొడి, ఉప్పు చేర్చి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఓ భాండీలో వెన్న లేదా నెయ్యి, ఇంగువ వేసి, ఈ పొట్లకాయ ముక్కల్ని అందులో దోరగా వేయించండి. వేరే పాత్రలో జాజికాయ, జాపత్రి, మిరియాలపొడి, ధనియాలపొడి, మెంతిపొడి, జీలకర్ర, ఉప్పు వీటిని తగు పాళ్లలో తీసుకుని, ఇందాక పొట్ల ముక్కల్లోంచి తీసిన గుజ్జుని, గింజల్ని కూడా వీటితో కలిపి, బియ్యపు కడుగు నీళ్లతో నూరి ముద్దలా చేసి కొద్దిగా నెయ్యి వేసి వేగించండి. కమ్మగా వేగిన ఈ ముద్దలో చిటికెడంత పచ్చకర్పూరం చేరిస్తే ఇంకా కమ్మగా ఉంటుంది. ఈ ముద్దని  పొట్లకాయ ముక్కల లోపల  కూరి పైపైన వేయించి వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినాలన్నాడు’’ నలుడు.


ఆరోగ్యానికి... 

 కడుపులో ఎసిడిటీ బాగా పెరిగినవారూ, అమీబియాసిస్‌ లాంటి జబ్బులున్నవారూ, పేగుపూత, పేగుల్లోని ఇతర జబ్బుల్లో పొట్లకాయ పెరుగుపచ్చడి తరచూ తింటూ ఉంటే బాధలు త్వరగా ఉపశమిస్తాయి. లివరు వ్యాధులున్నవారు, ముఖ్యంగా కామెర్లు, సిర్రోసిస్‌ లాంటి వ్యాధుల్లో పొట్లకు ఔషధ ప్రయోజనాలున్నాయి. దగ్గు, జలుబు ఆయాసం ఉన్నవారు తరచూ పొట్లకాయ కూర తింటూ ఉంటే కఫం తగ్గుతుంది. దగ్గు ఉపశమిస్తుంది. ఆయాసం మందులు వేసుకునే అవసరం తగ్గుతుంది. ఆహార పీచు ఎక్కువగా ఉన్న ద్రవ్యాలలో పొట్ల ఒకటి. గుండెకు సంబంధించిన రక్తనాళాలలో కొవ్వు అవరోధాలు ఏర్పడకుండా చేస్తుంది. పొట్లకాయ గుజ్జుని పట్టిస్తే ముఖం కాంతివంతం అవుతుంది. జుట్టు మృదువుగా పెరుగుతుంది. శరీరానికి సమశీతోష్ణ స్థితినిస్తుంది. వాతపిత్త కఫాలు మూడింటినీ అదుపులో పెడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. విరేచనం ఫ్రీగాలా అయ్యేలా చేస్తుంది. తేలికగా అరుగుతుంది. నులిపురుగులను పోగొడుతుంది. కఫ జ్వరాన్ని, పిత్త జ్వరాన్నీ తగ్గిస్తుంది. శరీరానికి కాంతినిస్తుంది. చలవనిస్తుంది. వాత దోషాలను పోగొడుతుంది. కీళ్లవాతం ఉన్నవారికి మంచిది కూడా.


పొట్లకాయ త్రిదోషాలను అదుపు చేసి చలవ నిస్తుంది. పొట్ల ఉష్ణవీర్యం కలిగింది కాబట్టి, దీన్ని అతిగా మసాలాలతోనూ, చింతపండు తోనూ కలిపి వండకూడదు. చలవనిచ్చే ద్రవ్యాలతో వండుకుంటే దీని ప్రయోజనాలు దక్కుతాయి.


                                                                                                   - గంగరాజు అరుణాదేవి

Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST