ఊడితే ఊరుకోకూడదు

ABN , First Publish Date - 2021-10-14T05:36:24+05:30 IST

దువ్విన ప్రతిసారీ దువ్వెనకు చుట్టుకుని వెంట్రుకలు ఊడివస్తూ ఉంటే గుండె గుభేలుమంటుంది.

ఊడితే ఊరుకోకూడదు

దువ్విన ప్రతిసారీ దువ్వెనకు చుట్టుకుని వెంట్రుకలు ఊడివస్తూ ఉంటే గుండె గుభేలుమంటుంది. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు ఊడడం సహజమే అయినా, అంతకంటే ఎక్కువ ఊడుతూ ఉంటే మాత్రం అప్రమత్తమవ్వాలి. కుదుళ్లను బలపరిచే చిట్కాలను మొదలుపెట్టాలి. అవేంటంటే...


కొబ్బరి పాలు

 పచ్చి కొబ్బరిని తురిమి పాలు తీయాలి. ఈ పాలను మునివేళ్లతో కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. కణజాలానికి పోషణనిచ్చే కొబ్బరిపాలు వెంట్రుకల కుదుళ్లను బలపరిచి, వెంట్రుకలు రాలడాన్ని ఆపుతాయి.


మెంతులు

ఒక కప్పు మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దను వెంట్రుకలకు పట్టించి, షవర్‌ క్యాప్‌ ధరించాలి. 40 నిమిషాల తర్వాత జుట్టును ఎక్కువ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పకుండా నెల రోజుల పాటు చేస్తే, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.


ఉల్లి రసం

ఉల్లిపాయల్లో రక్తప్రసరణను పెంచే సల్ఫర్‌ పుష్కలంగా ఉంటుంది. సల్ఫర్‌ వెంట్రుకల ఫాలికిల్స్‌కు జీవం పోసి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. అలాగే కుదుళ్ల ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే సూక్ష్మజీవులను చంపి, ఇన్‌ఫెక్షన్‌తో జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. కాబట్టి ఉల్లి రసానికి నిమ్మరసం జోడించి, వెంట్రుకలకు అప్లై చేసి, ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. 


కలబంద

కలబంద గుజ్జును వెంట్రుకల కుదుళ్లకు పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో జుట్టు కడిగేసుకోవాలి. అప్పుడప్పుడూ కలబంద గుజ్జులో సోడియం క్లోరైడ్‌ కలిపి జుట్టుకు పట్టిస్తూ ఉండాలి. కలబంద గుజ్జులో కలిసిన సోడియం క్లోరైడ్‌ వెంట్రుకల కుదుళ్లలోకి చొరబడి  వెంట్రుకలు రాలే సమస్యను తగ్గిస్తుంది.

Updated Date - 2021-10-14T05:36:24+05:30 IST