రాగద్వేషాలతో వినాశనం

ABN , First Publish Date - 2021-08-20T05:30:00+05:30 IST

సన్నిహితులైన వారు ఎన్ని తప్పులు చేసినా వారి పట్ల అమితమైన ప్రేమ, గిట్టని వారిపై పట్టరాని కోపం... ఇవి వినాశనానికి దారి తీసే లక్షణాలు.

రాగద్వేషాలతో వినాశనం

న్నిహితులైన వారు ఎన్ని తప్పులు చేసినా వారి పట్ల అమితమైన ప్రేమ, గిట్టని వారిపై పట్టరాని కోపం... ఇవి వినాశనానికి దారి తీసే లక్షణాలు. అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తారు. రాగద్వేషాలు అజ్ఞానానికి ఉదాహరణలు. భారతంలోని ధృతరాష్ట్రుడిని ఉదాహరణగా తీసుకుంటే... అహంకారంతో, అజ్ఞానాంధకారంతో వ్యవహరించాడు. తన కుమారుడైన దుర్యోధనుడు తప్పుదారిలో వెళుతున్నప్పటికీ బుద్ధి చెప్పాల్సిన స్థానంలో ఉన్న ధృతరాష్ట్రుడు మౌనం వహించాడు. అదే చివరకు దుర్యోధనుడి పతనానికి కారణం అయింది. 


పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని కాజెయ్యాలన్న దురుద్దేశంతో... జూదం అనే బలహీనత ఉన్న ధర్మరాజును దుర్యోధనుడు ఆహ్వానించాడు. మొదట వినోదంగా మొదలుపెట్టి, తరువాత పందెంలోకి దించాడు. శకుని మాయోపాయాలు పన్ని, ధర్మరాజు రాజ్యాన్నీ, ద్రౌపదిని ఓడిపోయేలా చేశాడు. ఆ తరువాత నిండు సభలో ద్రౌపదిని దుర్యోధనాదులు పరాభవించారు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఆమె మానసంరక్షణ చేశాడు. దుర్యోధనుడి దుష్టబుద్ధి కారణంగా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు... పాండవులను, ద్రౌపదిని దుర్యోధనుడు పరాభవిస్తున్నప్పుడూ ధృతరాష్ట్రుడు తన సభలోనే ఉన్నాడు. చూపు లేకపోయినా అన్నీ వింటూనే ఉన్నాడు. కానీ, తప్పు చేస్తున్నావని కొడుకును మందలించడానికి పుత్రవాత్సల్యం అడ్డం వచ్చింది. అన్యాయాన్ని ఆపే ప్రయత్నం అతను చేయలేదు. నీతి చెప్పవలసిన ధృతరాష్ట్రుడు మిన్నకుండిపోవడం చివరకు కౌరవ వంశ నాశనానికి దారితీసింది. పిల్లల మీద తల్లితండ్రులకు ప్రేమ ఉంటుంది. కానీ సంతానాన్ని మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ప్రస్తుత కాలంలో కూడా విలాసాలకు, చెడు సావాసాలకు లోనై... దారి తప్పుతున్న పిల్లలను సక్రమమార్గంలో పెట్టకపోతే... ఆ తరువాత దుష్పరిణామాలు తప్పవనేది తల్లితండ్రులందరూ ధృతరాష్ట్రుడి కథ నుంచి గ్రహించాలి. ఇదంతా ‘రాగం’ వల్ల జరిగిన అనర్థం. ‘రాగం’ అంటే అనురాగం, మాత్సర్యం అనే అర్థాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఏ అర్థాన్నయినా తీసుకోవచ్చు.


ఇక ద్వేషం గురించి చెప్పాలంటే... దీనికి కూడా ధృతరాష్ట్రుడు ఉదాహరణగా నిలుస్తాడు. కురు-పాండవ యుద్ధంలో... కౌరవ సైన్యంతో పాటు ధృతరాష్ట్రుడి కుమారులు నూరుగురు, మహాత్ములైన భీష్ముడు, ద్రోణుడు... ఇలా ఎందరో మరణించారు. అందరి మరణాలకన్నా దుర్యోధనుడి మరణం ధృతరాష్ట్రుణ్ణి కుంగదీసింది. అతణ్ణి చంపిన భీముడి మీద ద్వేషం పెంచుకున్నాడు. ప్రేమ నటిస్తూ భీముణ్ణి తన వద్దకు ఆహ్వానించాడు. ధృతరాష్ట్రుడు చూపులేనివాడైనా వెయ్యి ఏనుగుల బలం ఉన్నవాడు. భీముణ్ణి తన చేతుల మధ్య బంధించి చంపాలని పథకం వేశాడు. భీముడు రాగానే ఆప్యాయంగా పిలుస్తూ... ఆలింగనం చేసుకోవడానికి ఆహ్వానించాడు. భీముడు ముందుకు వెళ్తున్న సమయంలో.. ధృతరాష్ట్రుడి పన్నాగం గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే భీముడికి సైగ చేసి ఆపాడు. ధృతరాష్ట్రుడికీ, భీముడికీ మధ్య ఒక ఇనుప విగ్రహాన్ని ఉంచాడు. ధృతరాష్ట్రుడు ఆలింగనం చేసుకోగానే... ఆ విగ్రహం పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలైపోయింది. ఒకవేళ దాని స్థానంలో భీముడు ఉంటే... అతని శరీరం నుజ్జునుజ్జయిపోయేది. 


ధర్మబద్ధంగా వ్యవహరించాల్సిన సందర్భాల్లో రాగద్వేషాలు ధృతరాష్ట్రుణ్ణి వశం చేసుకున్నాయి. చివరకు సర్వనాశనమే మిగిలింది. కుమారులు, బంధువులు, సన్నిహితులు మరణించాక... అవమానభారంతో, విదురుడి సూచన మేరకు ధృతరాష్ట్రుడు అరణ్యవాసానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం గడిపాక ప్రాయోప్రవేశం చేశాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్‌ తౌహ్యస్య పరిపంథినౌ... అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. ఇంద్రియాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ‘రాగద్వేషాలు’ అంటే... ఇష్టానిష్టాలు ఉంటాయి. అవి మనిషికి శత్రువులు. తప్పుదారి పట్టించి నాశనం చేస్తాయి. ఎంతటివారికైనా విచక్షణను కోల్పోయేలా చేసే ఈ రాగద్వేషాలకు మానవులు దూరంగా ఉండాలి.

జమలాపురం ప్రసాదరావు

Updated Date - 2021-08-20T05:30:00+05:30 IST