నా ప్రతి సినిమా నా చివరి సినిమానే!

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

మిగిలిన దర్శకులు వేరు.. సుకుమార్‌ వేరు.ఆయన లెక్కలు వేరు.ఆయన కెమిస్ర్టీ వేరు. ఆ లాజిక్కులు ఇంకెవ్వరికీ తెలీవు.....

నా ప్రతి సినిమా నా చివరి సినిమానే!

మిగిలిన దర్శకులు వేరు.. సుకుమార్‌ వేరు.ఆయన లెక్కలు వేరు.ఆయన కెమిస్ర్టీ వేరు. ఆ లాజిక్కులు ఇంకెవ్వరికీ తెలీవు.అయితే... ‘రంగస్థలం’ తరవాత ఈ లెక్కల మాస్టారు సోషల్‌ పాఠాలు చెప్పడం మొదలెట్టారు. లాజిక్కుల్ని వదిలేసి, ప్రేక్షకుల్ని ఎమోషన్‌తో లాక్‌ చేయడం నేర్చుకున్నారు. ‘పుష్ప’ లో కూడా అంతే. సినిమాని కొత్తగా చూస్తూ... సినిమాని కొత్తగా చూపించాలనుకునే సుకుమార్‌ మనసులో ఏముంది? అసలు సినిమాలపై ఆయనకున్న అభిప్రాయాలేంటి? అనే విషయాల్ని ‘నవ్య’ ఆరా తీసింది.


 సినిమా అంటే లెక్కలతో నడిచే ప్రపంచం. ఇక్కడ కమర్షియాలిటీ తప్ప, క్రియేటివిటీకి చోటుంటుందా?

ఓ పని చేయడానికి డబ్బులు అవసరం అయ్యాయంటే అది కచ్చితంగా అది వ్యాపారమే. సినిమాని కూడా అలానే చూడాలి. ‘ఈ సినిమాతో నేను సేవ చేయబోతున్నా’ అని ఎవరూ అనుకోరు. అయితే అంకెలకు హృదయం లేదు.. అని ఎందుకు అనుకుంటారు?  ఒకటికి మనసు లేదని మీకు తెలుసా? నాలుగు తన ముందు మరో ముగ్గురు ఉన్నారని ఫీల్‌ అవదా? (నవ్వుతూ)


3మీ కథల్లో లెక్కలు, సైన్స్‌ సూత్రాలు, లాజిక్కులు కనిపించేవి. ‘రంగస్థలం’తో వాటిని పూర్తిగా పక్కన పెట్టారు. ‘పుష్ప’కూడా అంతే. కారణం ఏమిటి?

వయసు పెరుగుతోంది కదా? ఇది వరకు ప్రేమకథా చిత్రాలే సినిమాలు అనుకునేవాడ్ని. ‘ఇదేంటి... అందరూ ఎంచక్కా లవ్‌ స్టోరీలు తీయొచ్చు కదా’ అనిపించేది. నేనూ.. ప్రారంభంలో ప్రేమకథలే చెప్పా. ఆ తరవాత పరిణతి వచ్చింది. వయసు పెరుగుతూ పోయే కొద్దీ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఏదైనా మనసుకు కదిలించే విషయం గురించి తెలుసుకున్నా, అలాంటి ఘటన చూసినా... కన్నీళ్లు పొంగుకొచ్చేస్తున్నాయి. లోలోపల ఎంత ఎమోషన్‌ ఉంటుందో అర్థమైంది. ‘రంగస్థలం’ మన మూలాల్లోకి వెళ్లి తీసిన సినిమా. అలాంటి చోట... లెక్కలు, సైన్స్‌ సూత్రాలు అవసరం లేదు.


 ప్రేక్షకుడిగా సుకుమార్‌కి.. దర్శకుడిగా సుకుమార్‌కి  ఉన్న తేడా ఏంటి?

దర్శకుడ్ని అవ్వాలనుకున్నప్పుడు ఒకటే అనిపించేది. ‘నా సినిమాతో ప్రపంచాన్ని మార్చేయాలి’ అనేంత కసి ఉండేది. ఆ వయసులో అందరూ అలాంటి ఫేక్‌ ఆలోచనలతో బతుకుతుంటారేమో..?  సినిమా ఽఽధ్యేయం ప్రధానంగా ప్రేక్షకుడికి వినోదం పంచివ్వడమే అని క్రమంగా తెలిసింది. ‘ఆర్య’ రోజుల్లో కూడా.. ‘ఇదేంటి.. నేను తీయాలనుకకున్న సినిమా ఏమిటి? తీస్తున్న సినిమా ఏమిటి’ అని బాధపడేవాడిని. నాకు బాగా తెలిసిన ఓ మాస్టారు.. ‘సమాజాన్ని మార్చాలనుకుంటే... నీ రాతలతో ఉత్తేజ పరచాలనుకుంటే.. పెన్నూ పేపరూ పట్టుకుని ఓ కవితో, కథో రాయి. దానికి పెద్దగా ఖర్చుండదు... సినిమా దానికి తగదు.. ఆ లెక్కలు వేరే’ అని చెప్పారు. ఇప్పటికీ ఆ మాటలే గుర్తొస్తాయి. 


 సినిమాని ప్రేక్షకులకు అందించే తీరులో అనేక మార్పులు వచ్చాయి కదా. భవిష్యత్తులో సినిమా ఎలా ఉండబోతోంది?

సినిమా అనేది కాలాన్ని బట్టి మారుతూ వెళ్తోంది. ‘అసలు సినిమా’ తీయడం మానేశాం కాబట్టి... మనకిన్ని నిర్వచనాలు కనిపిస్తున్నాయేమో? నా చిన్నప్పుడు ‘బాపు.. విశ్వనాథ్‌ ఎంత గొప్ప సినిమాలు   తీశారో’ అని ముచ్చటపడుతూ చెప్పుకునేవాళ్లం. ఇప్పుడూ ఆ పేర్లే చెప్పుకుంటున్నాం. అల్టిమేట్‌ అనదగ్గ సినిమాలు ఇది వరకే వచ్చేశాయి. అవి డైలాగులతో నడిచే సినిమాలా?  విజువల్‌ వండర్సా అనేది చెప్పలేను. ‘మిస్సమ్మ’లో డైలాగులు గొప్పగా ఉంటాయి. ‘మాయా బజార్‌’లో విజువల్స్‌ చూస్తే మతిపోతుంది. మనం మళ్లీ ఆ కాలంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదో సర్కిల్‌. ఎప్పటికైనా ఆరోజుల్లోకి వెళ్లాల్సిందే. దానికి ఎంత సమయం పడుతుందో, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో నిర్దిష్టంగా చెప్పలేం అంతే.


 వెబ్‌ సిరీస్‌ వల్ల సినిమాకొచ్చిన నష్టం ఏమిటి?

నష్టం ఏమీ లేదు. అదో మాధ్యమం అంతే. ఓటీటీల్లో లక్షల కొద్దీ సబ్‌ స్కైబర్లు ఉన్నారు. అంతమందికి సినిమాని అందుబాటులోకి తీసుకెళ్లడానికి ఓటీటీలు ఉపయోగపడతాయి. అమెరికాలో చూడండి. అక్కడ ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన హోం థియేటర్‌ ఫెసిలిటీ ఉంది. కానీ వాళ్లు  కూడా సినిమాల్ని థియేటర్లలోనే చూడాలనుకుంటున్నారు. ఎన్నేళ్లయినా, ఎన్ని వేదికలు వచ్చినా... థియేటర్లో సినిమా చూసిన అనుభవం ఎక్కడా రాదు. 


 పాన్‌ ఇండియా అనే కాన్సెప్టుని మన దర్శకులు పూర్తిగా అర్థం చేసుకున్నారా?

మన తెలుగు హీరోల మార్కెట్‌ బాగా విస్తరించింది. దేశంలోని ఏమూలకెళ్లినా మన అల్లు అర్జున్‌ గురించో, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల గురించో మాట్లాడుకుంటున్నారు. వాళ్లందరికీ మన హీరోల సినిమాల్ని చూపించే మార్గం దొరికింది. అయితే... అన్ని భాషల వాళ్లనీ కనెక్ట్‌ చేసే కథలు ఎంచుకోవాలి. ‘బాహుబలి’ చూడండి విజువల్స్‌ ఎంత గొప్పగా ఉన్నాయో. విజువల్‌కి భాషతో పనిలేదు. ఎక్కడైనా చూసి తీరాల్సిందే. బలంగా పట్టేసే ఎమోషన్లు ఉన్నా సరే, పాన్‌ ఇండియా వ్యాప్తంగా అభిమానుల్ని మెప్పించవచ్చు. 


 మీకు నచ్చిన ఐటెమ్‌ సాంగ్‌ ఏది?

‘పుట్టింటోళ్లు తరిమేశారు...’ పాట వినండి. ఎంత సరదాగా ఉంటుందో? చమత్కారం, శృంగారం కలిసి కనిపిస్తుంటాయి. అలాంటి పాటలిష్టం. పల్లెటూరి నుంచి వచ్చినవాడ్ని. అక్కడ దసరా, సంక్రాంతికి రికార్డింగ్‌ డాన్సులు పెట్టేవారు. జాన పద గీతాలు వినిపించేవి. ఆ పాటలెంత బాగుండేవో? అందుకనే నాకు ప్రత్యేక గీతాలంటే ఆసక్తి పెరిగిందేమో..?


 అప్పట్లో కవిత్వం బాగా రాసేవారు. ఇప్పుడు సమయం దొరుకుతుందా?

నిజం చెప్పాలంటే పుస్తకాలు చదవడానికీ, సినిమాలు చూడ్డానికీ కూడా టైమ్‌ లేకుండా పోయింది. ఓ పుస్తకం చదివేంత తీరిక ఉంటే.. దాన్ని కూడా సినిమాలపై ఖర్చు చేస్తున్నా. అప్పట్లో చలం పుస్తకాలు బాగా చదివాను. ఆ ఫిలాసఫీ అర్థం చేసుకున్నా. మో, శివారెడ్డి, నగ్నముని కవిత్వం నన్ను చాలా ప్రభావితం చేసింది. వాళ్ల కవిత్వంలో కనిపించే అర్థం ఒకటి. లోపల ఉన్న అర్థం మరోటి. నేనూ ఆ శైలిలో కవిత్వం రాసేవాడ్ని.


సినిమా పూర్తయిన తర్వాత ఎలా అనిపిస్తుంది?

ప్రతీ సినిమా అయిపోగానే... ఓరకమైన వైరాగ్యం ఆవహిస్తుంది. ‘ఇంత టెన్షన్‌ పడాలా... ఇంత హడావుడి అవసరమా’ అనిపిస్తుంది. ‘ఇదే నా చివరి సినిమా.. ఇక చేయను...’ అనుకుంటా. ప్రతి సినిమా నా చివరి సినిమా అనిపిస్తుంది. కానీ ఆ తరవాత మళ్లీ మామూలే. క్రియేటీవ్‌ డైరెక్టర్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ అని అనిపించుకోవాలని నాకు ఉండదు. ప్రేక్షకుల్ని వినోదపరిచే సినిమా తీయగలనా? లేదా? అనేదే చూసుకుంటా. ఆ విషయంలో సక్సెస్‌ అయితే చాలు


324 గంటలూ మీ చుట్టూ సినిమానే తిరుగుతుంది. ఆ ధ్యాసలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారా?

నిజంగానే నేను ఫ్యామిలీ లైఫ్‌ చాలా మిస్‌ అయ్యా. నా కూతురు ఇప్పుడు ‘నాన్నా ఎన్నింటికి వస్తావ్‌... నా కబుర్లు ఎప్పుడు వింటావ్‌’ అని అడుగుతోంది. తనది ఎదిగే వయసు. తన స్కూల్లో జరిగే విషయాల గురించి, ఫ్రెండ్స్‌ గురించీ నాతో పంచుకోవాలనుకుంటుంది. ఇప్పుడు తన మాటలు వినే వాళ్లు కావాలి. నా కొడుకు ‘నాన్నా నాతో షటిల్‌ ఎప్పుడు ఆడతావ్‌’ అని నిలదీశాడు. ‘పుష్ప’ పనులన్నీ అయిపోయాక.. నీకు టైమ్‌ ఇస్తా అని వాడికి మాటిచ్చా. తప్పకుండా కొన్ని రోజులు నా పిల్లలకు, కుటుంబానికీ కేటాయిస్తా. మా ఆవిడ మంచిది కాబట్టి సరిపోయింది. లేదంటే.. ఎన్ని గొడవలు అయిపోయేవో. 


‘‘ఐటెమ్‌ గీతంలో సమంతని తీసుకురావాలన్న ఆలోచన నాదే. అయితే ఈ విషయంలో సమంతని ఒప్పించడం కష్టమైపోయింది. నేను అడిగిన వెంటనే తను ఒప్పుకోలేదు. ‘ఇప్పుడు అవసరమా? వద్దులే..’ అని చెప్పింది. నేను సర్దిచెప్పా. ‘అన్ని రకాల పాత్రలూ చేశావ్‌... ప్రత్యేక గీతంలోనూ కనిపిస్తే ఓ సర్కిల్‌ పూర్తయినట్టు అవుతుంది’ అని చెప్పా. చాలా విధాలుగా కన్విన్స్‌ చేశా. చివరి క్షణం వరకూ... ‘చేయాలా.. వద్దా’ అని సందేహిస్తూనే ఉంది’’



‘‘ఓ వెబ్‌ సిరీస్‌ కోసం స్ర్కిప్టు రాస్తున్నప్పుడు పుష్ప ఆలోచన వచ్చింది. పుష్పని ఆ స్థాయిలో చూపిస్తే బాగుంటుంది కదా అనిపించింది. ‘పుష్ప 1’లో పాత్రలన్నీ పరిచయం చేసి, వాటి మోటో చెప్పాం. పుష్ప 2లో అసలు కథ దాగి ఉంది. ప్రతీ పాత్రకూ ఓ ముగింపు ఉంటుంది. కొత్త పాత్రలు ఒకట్రెండు వస్తాయేమో..?


ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓసారి పాట రాయలనుకున్నా. కానీ చంద్రబోస్‌తో పరిచయం అయ్యాక.. ఆ ఆలోచనే రాలేదు. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న పాయింట్‌ ఆయన పాటలో టక్కున పెట్టేస్తున్నారు. ఆయన స్పాంటినిటీ చూసి నేను షాకైపోతున్నా. ‘పాట రాయడానికి ఆయన ఉన్నారు.. నేను అవసరం లేదు’ అనిపించింది. 


సిరివెన్నెల సినిమా నుంచీ ఆయన పాటలు వింటూనే ఉన్నా. ప్రతీ పాటనీ ఆయన తన సొంత బిడ్డలా చూసుకున్నారు. హైదరాబాద్‌ రాగానే నేను కలవాలనుకున్న తొలి వ్యక్తి ఆయనే. ఆయన్ని తాకాలని, చూస్తూ ఉండిపోవాలని అనుకునేవాడ్ని. తొలిసారి ఆయన్ని కలిసినప్పుడు నా కళ్ల నిండా.. నీరే. ఆయన్ని సరిగా చూడలేకపోయా. అంతిష్టం ఆయనంటే. ఆయన రాసిన ప్రతీ పాటా ఇష్టమే. ‘తెల్లారింది లెగండోయ్‌..’ ఓ అద్భుతం. ప్రతీ లైనూ.. గొప్పగా ఉంటుంది. అంత గొప్ప భావ వ్యక్తీకరణ నేనెక్కడా చూడలేదు.

                                                                                                                  అన్వర్‌

                                                                                                     ఫొటోలు: లవ కుమార్‌


Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST