చీరమీను భోజనం..

ABN , First Publish Date - 2021-08-21T08:00:13+05:30 IST

గోదావరి జిల్లాల్లో పులస తర్వాత అరుదుగా దొరికే అతి చిన్న చేప ‘చీరమీను’. ఇవి

చీరమీను భోజనం..

గోదావరి జిల్లాల్లో పులస తర్వాత అరుదుగా దొరికే అతి చిన్న చేప ‘చీరమీను’. ఇవి ఎంత చిన్నవంటే చేతి వేళ్ల మధ్య జారిపోతాయి. ఒకప్పుడు వలకి కూడా దొరికేవి కావు. అందుకే వీటిని చీరలతో పట్టేవారు. అందుకే వీటికి ఈ పేరొచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దొరికే ఈ చేపలు చూడటానికి చాలా చిన్నవి.. అయినా ధర మాత్రం ఎక్కువే. పరిమాణం బట్టి గ్లాసు, తవ్వ, సేరు, క్యారేజ్‌, బకెట్‌లతో కొలిచి అమ్ముతారు. అరుదుగా దొరికే ఈ చేపల్ని ఒకప్పుడు కొబ్బరి చెట్లకు ఎరువుగా వేసేవారు. ఈ చేపలతో మసాలా చీరమీను, చీరమీను-గారెలు, చింత చిగురు-చీరమీను, చీరమీను-మామిడి కాయ, చీరమీను-గోంగూర.. లాంటి వంటకాలు చేస్తారు.

చీరమీను మసాల కూర..


కావాల్సినవి

నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడిని రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. గరం మసాలా పొడి- ఒక టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయలు-3 (పెద్దవి), ఉప్పు-కారం తగినంత.


తయారీ విధానం

తవ్వ చీరమీను(సుమారు అరకిలో) తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడగాలి. వీటిలో నీటిశాతం ఎక్కువ కాబట్టి జల్లెడలో వేసి నీరు పోయేంత వరకూ ఉంచాలి. కడాయిలో మూడు టేబుల్‌ స్పూన్ల నూనె పోసి.. ముందుగా తయారు చేసిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి వేయాలి. పచ్చి వాసన పోయే వరకూ వే గించాలి. ఉప్పుకారం వేసుకోవాలి, కడిగి పెట్టుకున్న చీరమీను వేయాలి. ఎక్కువగా చీరమీను కలిపితే విడిపోయే అవకాశం ఉంది కాబట్టి మెల్లగా కలపాలి. చుక్క నీరు కూడా వేయకుండా స్టవ్‌ను సిమ్‌లో ఉంచాలి. పదిహేను నిమిషాలు ఉంచితే చీరమీను మసాలా కూర తయారవుతుంది. స్టవ్‌పై నుంచి కిందికి దించే సమయంలో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చితో పాటు కొద్దిగా ఉప్పు వేసుకుంటే కూర మరింత రుచికరంగా ఉంటుంది. 

 విత్తనాల వేంకటేశ్వరరావు, యానాం


Updated Date - 2021-08-21T08:00:13+05:30 IST