ఆమె లక్ష్యం... బాలల వికాసం

ABN , First Publish Date - 2021-08-16T05:30:00+05:30 IST

‘జవహర్‌ బాల కేంద్రం’... పని చేసేది మూడు గంటలే. కానీ ఆమెకు రోజంతా అదే పని. లలిత కళలు బాలల మనోవికాసానికి బాటలు వేసి... వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయనేది ఆమె నిశ్చితాభిప్రాయం. అందుకే కరోనా సమయంలోనూ పిల్లలను వాటికి దూరం కానివ్వలేదు...

ఆమె లక్ష్యం... బాలల వికాసం

‘జవహర్‌ బాల కేంద్రం’... పని చేసేది మూడు గంటలే. కానీ ఆమెకు రోజంతా అదే పని. లలిత కళలు బాలల మనోవికాసానికి బాటలు వేసి... వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయనేది ఆమె నిశ్చితాభిప్రాయం. అందుకే కరోనా సమయంలోనూ పిల్లలను వాటికి దూరం కానివ్వలేదు. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘బాల కేంద్రం’ ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణను తీసుకువచ్చి... ఎంతో మంది చిన్నారులను కళల వైపు ప్రోత్సహిస్తున్న సూర్యాపేట జిల్లా ‘బాల కేంద్రం’ సూపరింటెండెంట్‌ బండి రాధాకృష్ణారెడ్డి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి... 


గత ఏడాది కరోనా విజృంభించినప్పుడు అందరం ఇళ్లల్లోనే బందీలైపోయాం. పెద్దలకు ఆఫీసులు లేవు. పిల్లలకు స్కూళ్లు లేవు. మనమైతే పరిస్థితిని అర్థం చేసుకోగలం. మరి పిల్లల మాటేమిటి? ఒక్కసారిగా నాలుగు గోడల మధ్యే రోజంతా గడపాలంటే ఎంత కష్టం? అది వారిని మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. బడికి వెళితే చదువుతో పాటు ఆటలుంటాయి. తోటి విద్యార్థులుంటారు. వీటన్నిటికీ దూరంగా... ఎటూ కదలనీయకుండా నెలలకు నెలలు కట్టేసినట్టు పడేస్తే భవిష్యత్తులో ఆ ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించాక వాళ్లను ఈ ఖాళీ సమయంలో ఫైన్‌ఆర్ట్స్‌ (లలిత కళలు) వైపు తిప్పితే బాగుంటుందనిపించింది. ఎలా? విద్యా బోధనకైతే ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి. అదే తరహాలో నాట్యం, సంగీతం, డ్రాయింగ్‌ వంటి కళలు నేర్పిస్తే? 


ఆ మాట చెప్పగానే... 

‘బాల కేంద్రం’ తొలి ప్రాధాన్యం పేద పిల్లలకు కళలను పరిచయం చేయడం. బయట ప్రైవేట్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో ఒక డ్యాన్స్‌ క్లాస్‌కు వెళ్లాలంటే వందల రూపాయలు చార్జ్‌ చేస్తారు. అదే ‘బాల కేంద్రం’లో అయితే ఏడాదికి యాభై రూపాయలకు మించదు. కరోనా వల్ల కేంద్రానికి వచ్చే పిల్లలందరూ ఆసక్తి ఉన్నా కళలకు దూరమయ్యారు. అందుకే ఇంట్లోనే ఉంటూ అభ్యసించేలా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలనుకున్నా. విషయం పై అధికారులకు చెబితే ముందు భయపడ్డారు. ‘పాఠాలైతే చెప్పచ్చు. నాట్యం, సంగీతం లాంటివి ఆన్‌లైన్‌లో ఎలా నేర్పగలం? సాధ్యమవుతుందా?’ అని సందేహం వ్యక్తం చేశారు. ఆ మాటకొస్తే యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ ఉన్న ఫైన్‌ఆర్ట్స్‌ వీడియోలు ఎన్ని లేవు? అలాంటప్పుడు శిక్షణ తీసుకున్న టీచర్లం మేమెందుకు చెప్పలేము? అధికారులకు అదే చెప్పి ఒప్పించాను. 


పక్క రాష్ట్రాల వారు కూడా... 

చివరకు గత ఏడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా సూర్యాపేట కేంద్రం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాం. అనూహ్య స్పందన వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ప్రధాన కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. మా కేంద్రంలో ఆఫ్‌లైన్‌లో అయితే 800 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో దాదాపు 600 మంది నేర్చుకొంటున్నారు. ఒక్క తెలంగాణవారే కాదు... ఆంధ్రా, బెంగళూరు, ముంబయి తదితర ప్రాంతాల వారు కూడా అడిగి మరీ తమ పిల్లలను చేర్పించారు. మేం చేస్తున్న ప్రయత్నాన్ని తల్లితండ్రులు, అధికారులు అభినందించారు. ఇది మాకు ఎనలేని ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ నాట్యం, కర్ణాటక సంగీతం, చిత్రలేఖనం, కుట్టు, అల్లికలు, తబల, మృదంగం, వయోలిన్‌లో శిక్షణనిస్తున్నాం. అంతేకాదు... తల్లితండ్రులు అడిగారని మా దగ్గర లేకపోయినా యోగ, కరాటేలో కూడా తర్ఫీదునిస్తున్నాం. 5 నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా... ఎక్కడివారైనా ఆసక్తి ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా నేర్చుకోవచ్చు. రాష్ట్రంలోని పన్నెండు బాల కేంద్రాల్లో ఈ సౌకర్యం కల్పిస్తున్న కేంద్రం మాదొక్కటే. 


సంస్కారవంతులుగా... 

పిల్లలకు విద్యతో పాటు లలితకళలు కూడా నేర్పిస్తే... ఏకాగ్రత పెరుగుతుంది. శారీరకంగానే కాకుండా మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆ ప్రభావం చదువులోనూ కనిపిస్తుంది. ‘డ్యాన్స్‌ చేస్తే, బొమ్మలు గీస్తే ఏమొస్తుంద’ని చాలామంది అంటుంటారు. అయితే మన కళల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. నాట్యం వల్ల శరీరానికి వ్యాయామం... సంగీతంతో బ్రీతింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌... డ్రాయింగ్‌, క్రాఫ్ట్స్‌ సాధన చేస్తే సృజన, మేథస్సు పెరుగుతాయి. విద్యతో పాటు కళలను కూడా అభ్యసించడంవల్ల పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు అలవడతాయి. ఉదాహరణకు నాట్యం ప్రారంభించే ముందు గురు వందనం చేస్తాం. అంటే గురువుకు, పెద్దలకు గౌరవం ఇవ్వడం బాల్యంలోనే నేర్చుకొంటారు. చదువు కంటే ముందు కావల్సింది సంస్కారం. అది లలితకళల అభ్యాసంతో వస్తుంది. 


నానమ్మ... నాన్నల నుంచి... 

నేను కళల వైపు రావడానికి ప్రధాన కారణం మా నానమ్మ, నాన్న. మాది సూర్యాపేట. నానమ్మకు జానపదాలంటే చాలా ఇష్టం. నాన్నకు సినిమా పాటలు పాడడం, నవలలు చదవడం అలవాటు. వారి ప్రభావం నా మీద చిన్నప్పటి నుంచీ ఉంది. ఎప్పుడూ క్రాఫ్ట్స్‌... అవీ చేస్తుండేదాన్ని. లలిత సంగీతం కూడా నేర్చుకున్నాను. ఏంసీజే చదివాను. తరువాత ఎంఏ ఆర్ట్స్‌, బీఎడ్‌, టీటీసీ చేశాను. అంత చదువుకున్నా కళలపై మక్కువతోనే 2013లో ‘బాల కేంద్రం’లో చేరాను. 


ఉదయం నుంచి... 

సూర్యాపేట బాల కేంద్రం సూపరింటెండెంట్‌గా నాకు వచ్చేది నాలుగు వేల రూపాయల జీతమే. ఇది పార్ట్‌టైమ్‌ ఉద్యోగంలాగా! శిక్షణ ఇచ్చేది సాయంత్రం మూడు గంటలే అయినా... నేను ఉదయం నుంచి అదే పనిలో ఉంటాను. కొన్ని స్కూల్స్‌కు వెళ్లి కూడా ఫైన్‌ఆర్ట్స్‌ నేర్పిస్తుంటాను. పేద మహిళలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో బ్యూటీషియన్‌ కోర్స్‌ చేశాను. మా కేంద్రంలోని పిల్లల తల్లితండ్రులతో ఒక కమిటీ వేశాను. ఆ కమిటీ ద్వారా మహిళలకు కుట్టు, అల్లికలు, బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణనిస్తున్నా. దాతల సాయంతో ఉచితంగా మేకప్‌ కిట్లు ఇచ్చాను. దానివల్ల వారు ఉపాధి పొందుతారు. భర్తపైనే పూర్తిగా ఆధారపడకుండా కుటుంబ భారాన్ని కొంత పంచుకొంటారు. ఆసక్తి ఉన్నవారితో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ రాయిస్తున్నాను. ఎందు కంటే చదువుతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మా కేంద్రానికి వచ్చే పిల్లలు మధ్యలో మానేస్తే అందుకు కారణాలు కనుక్కొంటాం. వారి కుటుంబానికి చేతనైన విధంగా సహకరించి, పిల్లవాడిని తిరిగి కేంద్రానికి వచ్చేలా చూస్తున్నాం. 


అవార్డులు... అభినందనలు... 

మేం చేస్తున్న నిరంతర కృషి వల్ల మా బాల కేంద్రం పిల్లలు నాట్యం, సంగీతం తదితర పోటీల్లో సత్తా చాటారు. ఆ విజయాలను గుర్తిస్తూ గవర్నర్‌, జిల్లా కలెక్టర్‌, డీఈఓ, ఇతర ప్రముఖులు నన్ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు... రాష్ట్ర మంత్రి, కలెక్టర్ల నుంచి మూడుసార్లు ‘బెస్ట్‌ సర్వీస్‌’ అవార్డు అందుకున్నాను. ముంబయిలోని ‘అబ్దుల్‌ కలామ్‌ మెమోరియల్‌ ఆర్గనైజేషన్‌’, ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రముఖ కళా సంస్థల నుంచి పురస్కారాలు లభించాయి. ఇవి నా సేవలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చాయి. 


అప్‌గ్రేడ్‌ కోసం... 

ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఒక్కటే... సూర్యాపేట బాల కేంద్రాన్ని ‘బాల భవన్‌’గా మార్చాలని. ప్రభుత్వం తలుచుకొంటే ఇది పెద్ద పనేమీ కాదు. దాని కోసం మా జిల్లా మంత్రికి విన్నవించాం. త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాం. ‘బాల కేంద్రం’ రోజుకు మూడు గంటలే పని చేస్తుంది. అదే ‘బాల భవన్‌’ అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల పిల్లలు ఏ సమయంలోనైనా వచ్చి నేర్చుకొనే వెసులుబాటు ఉంటుంది. 

- హనుమా 

Updated Date - 2021-08-16T05:30:00+05:30 IST