కేక్‌ తిందామా..

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

ఏ చిన్న సెలబ్రేషన్‌ అయినా ఇంట్లో కేక్‌ కట్‌ చేయాల్సిందే. అలాంటిది క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకల్లో తప్పక కేక్‌ రుచి చూడాల్సిందే. ...

కేక్‌ తిందామా..

ఏ చిన్న సెలబ్రేషన్‌ అయినా ఇంట్లో కేక్‌ కట్‌ చేయాల్సిందే. అలాంటిది క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకల్లో  తప్పక కేక్‌ రుచి చూడాల్సిందే.  అస్తమానం కేక్‌లు తయారీచేసే బేకరీలను నమ్ముకోకుండా.. మీ  ఇంట్లోనే సులువుగా ఇలా కేక్స్‌ తయారు చేసుకోండిలా... 


మార్బుల్‌ కేక్‌

కావలసినవి

పెరుగు - ఒకకప్పు, పంచదార - ఒకకప్పు, నూనె - అరకప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - రెండు టీస్పూన్లు, మైదా - రెండు కప్పులు, బేకింగ్‌ సోడా - కొద్దిగా, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, కోకో పౌడర్‌ - పావు కప్పు, ఉప్పు - తగినంత, ఒక బేకింగ్‌ టిన్‌. 

తయారీ విధానం

ఒక పాత్రలో పావుకప్పు పెరుగు తీసుకుని అందులో పావుకప్పు పంచదార, పావుకప్పు నూనె, ఒక టీస్పూన్‌ వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి పంచదార కరిగే వరకు బాగా కలియబెట్టాలి.

తరువాత అందులో ఒకకప్పు మైదా, చిటికెడు బేకింగ్‌ సోడా, అర టీస్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.

 ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మళ్లీ బాగా కలిపితే వెనీలా కేక్‌ మిశ్రమం రెడీ.

 మరొక పాత్రలో మిగిలిన పావుకప్పు పెరుగు తీసుకుని అందులో పావుకప్పు పంచదార, పావుకప్పు నూనె, ఒక టీస్పూన్‌ వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి పంచదార కరిగే వరకు కలియబెట్టాలి.

 అందులో ఒకకప్పు మైదా, కోకో పౌడర్‌, చిటికెడు బేకింగ్‌ సోడా, అర టీస్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.

 తరువాత కొన్ని నీళ్లు పోసి మళ్లీ బాగా కలిపితే చాక్లెట్‌ కేక్‌ మిశ్రమం రెడీ.

 ఇప్పుడు కేక్‌ టిన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల వెనీలా కేక్‌ మిశ్రమం వేయాలి. దానిపైన రెండు టేబుల్‌స్పూన్ల చాక్లెట్‌ కేక్‌ మిశ్రమం వేయాలి. 

 అలా లేయర్లుగా వేసుకోవాలి. తరువాత 180 డిగ్రీల సెల్సియ్‌సకు ప్రీహీట్‌ చేసిన ఓవెన్‌లో 50నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి.

 తర్వాత కేక్‌ టిన్‌లో నుంచి తీసి ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


చాక్లెట్‌ కేక్‌

కావలసినవి

మైదా - ఒక కప్పు, పంచదార పొడి - ఒక కప్పు, కొకో పౌడర్‌ - అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - ఒక టీస్పూన్‌, ఉప్పు - అర టీస్పూన్‌, నూనె - అర కప్పు, వేడి నీళ్లు - అర కప్పు, పాలు - అర కప్పు, వెనీలా ఎసెన్స్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, ఒక బేకింగ్‌ టిన్‌. 

తయారీ

 ఒక పాత్రలో మైదా, పంచదార, కొకో పొడి, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

 మరొక పాత్రలో అరకప్పు నూనె, అరకప్పు వేడి నీళ్లు పోసి రెండూ కలిసే వరకు కలియబెట్టాలి. 

 తరువాత దీనిలో పాలు, వెనీలా ఎసెన్స్‌, పెరుగు వేసి కలుపుకోవాలి.జ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా పోస్తూ కలియబెట్టాలి. మెత్తటి మిశ్రమంలా తయారు

చేసుకోవాలి. జ ఈ మిశ్రమాన్ని టిన్‌లో పెట్టి 160 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్‌ చేస్తే చాక్లెట్‌ కేక్‌ రెడీ.


యాపిల్‌ కేక్‌

కావలసినవి

మైదా - 150 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెన్న - 50 గ్రాములు,  పంచదార - 150 గ్రాములు, కోడిగుడ్లు - రెండు, పాలు - ఒకకప్పు, యాపిల్స్‌ - మూడు, దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూన్‌, ఒక బేకింగ్‌ టిన్‌. 

తయారీ

 ఒక పాత్రలో మైదా తీసుకొని బేకింగ్‌ పౌడర్‌ వేసి కలుపుకోవాలి.

 తరువాత వెన్న, పంచదార, కోడిగుడ్లు, పాలు వేసి బాగా కలియబెట్టాలి. 

 ఈ మిశ్రమాన్ని కేక్‌ టిన్‌లో పోసి, పైన చిన్నగా కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు ఉంచాలి. దానిపై పంచదార, దాల్చిన చెక్క పొడి  చల్లాలి. 

 ఈ టిన్‌ను ఓవెన్‌లో 190 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత వద్ద 30 నుంచి 35 నిమిషాల బేక్‌ చేస్తే యాపిల్‌ కేక్‌ రెడీ అయినట్టే!


బనానా జామ్‌ కేక్‌

కావలసినవి

అరటిపండ్లు - మూడు, కోడిగుడ్లు - మూడు, నూనె - అరకప్పు, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ - పావుకప్పు, పంచదార - ఒకకప్పు, గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ సోడా - ఒక టీస్పూన్‌, వెనీలా ఎసెన్స్‌ - ఒక టీస్పూన్‌, ఒక బేకింగ్‌ టిన్‌.  

తయారీ

 ఒక పాత్రలో పిండి తీసుకుని కొద్దిగా బేకింగ్‌ సోడా వేసి కలుపుకొని పక్కన పెట్టాలి.

 మరొక పాత్రలో పంచదార, నూనె, జామ్‌ వేసి కలపాలి. తరువాత అరటిపండ్లను గుజ్జుగా చేసి వేయాలి. వీటన్నింటినీ బ్లెండర్‌తో వేసి ప్యూరీ తయారుచేసుకోవాలి.

 ఇప్పుడు కోడిగుడ్లు, వెనీలా 

ఎసెన్స్‌ కలిపి మరికొద్ది సేపు బ్లెండ్‌ చేయాలి.

 దీన్ని పక్కన పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకొని మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. 

 టిన్‌కు కొద్దిగా నూనె రాసి మిశ్రమం వేసుకోవాలి. ఓవెన్‌లో 180 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద అరగంట పాటు బేక్‌ చేయాలి. చల్లారిన తరువాత సర్వ్‌ చేసుకోవాలి.



పౌండ్‌ కేక్‌

కావలసినవి

మైదా పిండి - రెండు కప్పులు, వెన్న - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, కోడిగుడ్లు - నాలుగు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెనీలా ఎసెన్స్‌ - రెండు  టీస్పూన్లు, ఉప్పు - పావు టీస్పూన్‌, ఒక బేకింగ్‌ టిన్‌.

తయారీ విధానం

 ఒక పాత్రలో పంచదార, వెనీలా ఎసెన్స్‌, కోడిగుడ్లు, వెన్న వేసి బాగా కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి. 

 మరొక పాత్రలో మైదా తీసుకుని అందులో బేకింగ్‌ పౌడర్‌, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్న పంచదార మిశ్రమంలో వేసి అన్నీ కలిసేలా కలియబెట్టుకోవాలి.

 ఈ మిశ్రమాన్ని టిన్‌లోకి మార్చుకోవాలి.

 ప్రీ హీటెడ్‌ ఓవెన్‌లో 30 నుంచి 

35 నిమిషాల పాటు పెట్టాలి. 

అంతే.. పౌండ్‌ కేక్‌ రెడీ.

Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST