క్షమాగుణం లేకపోతే...

ABN , First Publish Date - 2021-08-27T06:09:14+05:30 IST

విశ్వాసుల ప్రవర్తన ఎలా ఉండాలో, ఎటువంటి నడవడికను దైవం మెచ్చుకుంటాడో, భూమి మీద చేసిన పనులకు పరలోకంలో లభించే ప్రతిఫలం ఎలాంటిదో అనేక సందర్భాల్లో తన శిష్యులకు, తనను దర్శించుకున్న వారికి ఏసు ప్రభువు వెల్లడి చేశాడు.

క్షమాగుణం లేకపోతే...

విశ్వాసుల ప్రవర్తన ఎలా ఉండాలో, ఎటువంటి నడవడికను దైవం మెచ్చుకుంటాడో, భూమి మీద చేసిన పనులకు పరలోకంలో లభించే ప్రతిఫలం ఎలాంటిదో అనేక సందర్భాల్లో తన శిష్యులకు, తనను దర్శించుకున్న వారికి ఏసు ప్రభువు వెల్లడి చేశాడు. అచంచలమైన నమ్మకం, ఇతరుల తప్పులను క్షమించే స్వభావం, నైతికత లాంటి విషయాలకు కథల రూపంలో ఉదాహరణలు చెప్పాడు. మనం ఎవరిపట్లయినా తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరుకుంటాం. కానీ వేరొకరు మన పట్ల అంతకన్నా చిన్న తప్పు చేసినా క్షమించడానికి అంగీకరించం. 

ఒక రాజుకు అతని సేవకుడు పెద్ద మొత్తంలో బంగారం అప్పు పడ్డాడు. అతను ఆ అప్పు తిరిగి చెల్లించే పరిస్థితి కనిపించకపోవడంతో.... అతనికి ఉన్నవన్నీ అమ్మేసి, తనకు ఇవ్వాల్సిన దానికింద జమకట్టాలని రాజు ఆదేశించాడు.

దాంతో రాజు కాళ్ళమీద పడి, కాస్త సమయం ఇస్తే అప్పు తీర్చేస్తానని ఆ సేవకుడు మొరపెట్టుకున్నాడు. రాజుకు జాలి కలిగింది. సేవకుడి అప్పు రద్దు చేశాడు. ఇది జరిగిన తరువాత, ఆ సేవకుడు బయటికి వచ్చి, తనకు కొంచెం డబ్బు బాకీ పడిన మరో సేవకుడి గొంతు పట్టుకున్నాడు. ‘‘నా డబ్బు వెంటనే ఇవ్వు’’ అని బెదిరించాడు. ఆ వ్యక్తి కొంచెం సమయం అడిగినా వినిపించుకోకుండా, అతణ్ణి ఖైదులో వేయించాడు. ఇదంతా చూసిన తోటి సేవకులు వెళ్ళి రాజుకు చెప్పారు. ఆ సేవకుణ్ణి రాజు పిలిపించి, ‘‘నువ్వు చెడ్డవాడివి. నన్ను నువ్వు బతిమాలితే నీ అప్పు మొత్తం నేరు రద్దు చేశాను. నేను నీపట్ల చూపించిన క్షమను నీ తోటి వ్యక్తి మీద నువ్వు చూపించాలి. కానీ నువ్వలా చెయ్యలేదు’’ అంటూ తన అప్పు పూర్తిగా తీర్చే వరకూ ఆ సేవకుణ్ణి జైల్లో ఉంచాలని భటులను ఆదేశించాడు. 

పేతురుకు ఏసు ప్రభువు ఈ కథ చెప్పి, తమ సోదరులను మనస్ఫూర్తిగా క్షమించనివారి పట్ల పరలోకంలో దైవం కూడా అలాగే వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు.

Updated Date - 2021-08-27T06:09:14+05:30 IST