ఆటో చిత్ర రూటే వేరు!

ABN , First Publish Date - 2021-12-30T05:30:00+05:30 IST

తమిళనాడులోని విల్లుపురంలో ‘ఆటో చిత్ర’ అంటే తెలియనివాళ్ళు ఎవరూ లేరు. ‘‘ఆటో నడపడం నాకు జీవనోపాధి మాత్రమే కాదు. ...

ఆటో చిత్ర రూటే వేరు!

తమిళనాడులోని విల్లుపురంలో ‘ఆటో చిత్ర’ అంటే తెలియనివాళ్ళు ఎవరూ లేరు. ‘‘ఆటో నడపడం నాకు జీవనోపాధి మాత్రమే కాదు. సరదా కూడా! అందుకే ఇన్నేళ్ళుగా ఈ వృత్తిలో కొనసాగగలుగుతున్నా...’’ అని చెబుతారు చిత్ర.. ఆటో నడిపే మహిళగా కొందరికి ఆమె వింత కావచ్చు... కానీ  చాలామంది మహిళల దృష్టిలో ఆమె... తమను ఇంటికి క్షేమంగా చేరవేసే భరోసా.ల్లుపురం పాత బస్టాండ్‌ దగ్గరున్న ఆటో స్టాండ్‌లో బారులు తీరిన పసుప్పచ్చటి ఆటోల్లో ఒకటి మాత్రం ప్రత్యేకం. బస్సులు దిగిన మహిళలు ఆ ఆటో ఎక్కడుందా? అని వెతుకుతారు. డ్రైవర్‌ను ఆప్యాయంగా పలకరిస్తారు. ‘‘ఇలా నన్ను అభిమానంగా చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు’’ అంటారు ఆ ఆటో డ్రైవర్‌ కె.చిత్ర. ఆ అభిమానం ఇరవై రెండేళ్ళ ఆటో డ్రైవింగ్‌ వృత్తిలో ఆమె సంపాదించుకున్న ఆస్తి. ఆటోలు నడిపే మహిళలు కొత్త కాదు... కానీ ఏడాది, రెండేళ్ళ కన్నా ఈ వృత్తిలో కొనసాగేవాళ్ళు చాలా తక్కువ. అలాంటిది... రెండు దశాబ్దాలకు పైగా చిత్ర ఆటో నడుపుతున్నారు.

 

సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్‌ ఇప్పుడు చిత్ర కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తోంది. ఆమె పుట్టిందీ, పెరిగిందీ పుదుచ్చేరిలో. అక్కడ మొదట్లో మహిళలకు లైసెన్సులు ఇచ్చేవారు కాదు. 1999లో పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నిబంధనను సడలించడంతో... ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో చిత్ర లైసెన్స్‌ తీసుకున్నారు. పుదుచ్చేరి నుంచి విల్లుపురం వచ్చి... ఆటోను అద్దెకు తీసుకొని నడపడం మొదలుపెట్టారు. ‘‘ఇప్పుడు కూడా మహిళలు ఆటో నడిపితే వింతగా చూస్తారు. అలాంటిది... ఇరవై ఏళ్ళ కిందట పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. డ్రైవింగ్‌ సీట్‌లో నన్ను చూసి చాలామంది నా ఆటో ఎక్కేవారు కాదు. కొత్త వాళ్ళతో ఇప్పటికీ ఆ ఇబ్బంది ఉంది. మగ డ్రైవర్లను వదిలేసి... నా లైసెన్స్‌, పేపర్లు మాత్రం పోలీసులు చెక్‌ చేసేవారు. ఛార్జీల దగ్గర ప్యాసింజర్లు గీచిగీచి బేరమాడేవాళ్ళు. మొదట్లో ఇదంతా కష్టంగా ఉండేది. ఆ తరువాత... నేను వసూలు చేసే ఛార్జీ ఎంతో ముందే గట్టిగా చెప్పడం, అంతకు రూపాయి తగ్గినా రానని స్పష్టం చెయ్యడం అలవాటు చేసుకున్నాను. ఇలాంటి ధైర్యం అనుభవంతోనే వస్తుంది’’ అని నవ్వుతూ చెబుతారు చిత్ర. 


ప్రస్తుతం చిత్ర ఆటోలో రోజూ ప్రయాణించేవారిలో విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు... ఇలా ఎన్నో వర్గాలవారు ఉన్నారు. ఉదయాన్నే నాలుగున్నరకు ఆమె దినచర్య మొదలవుతుంది. ఇంటి పనులు పూర్తి చేసుకొని, ఆరున్నరకల్లా రోడ్డెక్కుతారు. విద్యార్థులను స్కూళ్ళకు తీసుకువెళ్తారు. సాయంత్రం మళ్ళీ వారిని తీసుకొస్తారు. ‘‘మహిళ ఆటో నడపడం మగాళ్ళకు ఎగతాళిగా ఉండొచ్చు... కానీ మహిళలకు కాదు. వాళ్ళు నా ఆటోలో భద్రంగా ఉన్నట్టు భావిస్తారు. అలాగే అర్థరాత్రి, తెల్లవారుజామున ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు, ఊర్ల నుంచి ఒంటరిగా తిరిగివచ్చే మహిళలు ఉంటారు. వాళ్ళు ముందుగా ఫోన్‌ చేస్తే... నేను వెళ్తూ ఉంటాను’’ అని చెప్పారామె.  రోజుకు ఆమె ఆదాయం మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకూ ఉంటుంది. పండగ రోజుల్లో ఒక్కోసారి రెండువేలు కూడా సంపాదిస్తారు. ‘‘ఏ పనికీ పురుషులూ, మహిళలూ అనే తేడా ఉండదు. పని ఏదైనా చిత్తశుద్ధితో చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది’’ అంటున్నారు నలభై మూడేళ్ళ ఆటో చిత్ర.

Updated Date - 2021-12-30T05:30:00+05:30 IST