పెద్దల పండుగ సంబరాలు మెండుగా..

ABN , First Publish Date - 2021-01-13T05:43:35+05:30 IST

కర్మసాక్షి, ఆరోగ్యప్రదాత అయిన ఆదిత్యుడు ఉత్తర యాత్ర ప్రారంభించే సందర్భమైన ఈ పర్వదినానికి ఇతర పండుగల్లా తిథి,

పెద్దల పండుగ సంబరాలు మెండుగా..

సనాతన ధర్మంలో ‘సంక్రమణం’ పవిత్రమైన పండుగ. సూర్యుడు ప్రతి మాసం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంక్రమించడాన్ని ‘సంక్రమణం’ లేదా ‘సంక్రాంతి’ అంటారు. అలా సూర్యుడు పన్నెండు రాశులలో సంక్రమిస్తాడు. కాబట్టి సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ధనూరాశి నుంచి మకర రాశిలోకి సంక్రమించిన కాలం మకర సంక్రమణం. అది దివ్యమైన కాలం. అత్యంత పవిత్రమైన పర్వం. మకర సంక్రాంతి భారతదేశంలో హిందువులందరూ జరుపుకొనే పెద్ద(ల) పండుగ.


కర్మసాక్షి, ఆరోగ్యప్రదాత అయిన ఆదిత్యుడు ఉత్తర యాత్ర ప్రారంభించే సందర్భమైన ఈ పర్వదినానికి ఇతర పండుగల్లా తిథి, వార, నక్షత్రాలతో పని లేదు. ఆదిత్యుడి సంచారాన్ని బట్టి చేసుకొనే వేడుక ఇది. సౌరమానాన్ని అనుసరించి... సంక్రాంతినాడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే ఆదిత్యుడి ప్రభ సందడి చేస్తుంది. ధనూరాశిలో సూర్యుడు ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దేవాలయాల్లో ఉత్సవాలు మొదలవుతాయి.


వైష్ణవులు ‘మార్గళి’ (ధనుర్మాస) వ్రతాలనూ, వైదికులు శివ వ్రతాలనూ సంబంధిత ఆలయాల్లో ఆచరిస్తారు. చలికాలంలో వచ్చే ఈ పండుగ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ధనుర్మాసంలో సంక్రాంతి శోభ వెల్లి విరుస్తుంది. రైతులు పండిన పంటలను ఇంటికి తెచ్చి, గాదెల్లో నింపుకొంటారు. రైతులకూ, ఆరుగాలం వారికి సాగులో సాయపడిన పశు సంతతికి ఇది విశ్రాంతి సమయం. మరోవైపు ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో ఈ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వేకువ జామునే మహిళలు లేచి, ఇంటి ముంగిళ్ళను అలికి, రంగవల్లులు దిద్ది, గొబ్బెమ్మలు పెడతారు. వాటిని బంతి, చేమంతి, గుమ్మడి పూలతో అలంకరించి, గొబ్బెమ్మ పాటలు పాడతారు. ప్రతిరోజూ పేడతో చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా మార్చి... భోగి పండుగ నాటికి సిద్ధం చేస్తారు.


భోగాల వేడుక... భోగి పండుగ

మకర సంక్రాంతి మూడు రోజుల పండుగ. తొలి రోజు భోగి... అది ధనుర్మాసం చివరిరోజు. సంక్రాంతి ప్రధానంగా పితృతర్పణాలకూ, కనుమ పశుసంపదకు కృతజ్ఞత చెప్పుకోవడానికీ నిర్దేశించిన రోజులు కాబట్టి ఈ పండుగల్లో భోగమంతా వేడుక చేసుకొనేది ఈ మొదటి రోజే! అందుకే దీన్ని ‘భోగి’ అంటారు. తెల్లవారుజామునే మహిళలు ముంగిళ్లలో కల్లాపి జల్లి రంగురంగుల ముగ్గులు పెడతారు. గుమ్మాలను పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. గడపలకు తోరణాలు కడతారు. ఆపై వీధుల్లో జనమంతా చేరి భోగి మంటలు వేస్తారు.


ఇంట్లో పనికిరాని వస్తువులు, కట్టెలు, భోగి పిడకలను మంటలో వేస్తారు. అభ్యంగన స్నానాలు చేసి, కొత్త దుస్తులు ధరించి, పెద్దల ఆశీస్సులు పొందుతారు. దేవాలయాలను దర్శిస్తారు. ఆ సాయంత్రం ఇంట్లోని పసిపిల్లలకు రేగు పండ్లు, చెరకు ముక్కలు, చిల్లర నాణేలు, సెనగలు కలిపి... పెద్ద ముత్తయిదువులతో దిష్టి తీయించి... భోగి పండ్లు పోస్తారు. అనంతరం పేరంటం చేస్తారు. సెనగలు గురువుకు ప్రీతికరం. వాటిని పంచితే పిల్లలను గురువు అనుగ్రహిస్తాడని నమ్మకం. ఆ రోజు వైష్ణవాలయాల్లో ఆండాళ్‌-రంగనాథుల కల్యాణాన్నీ, శివాలయాల్లో ఉమా-సదాశివుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు.  వామనావతారంలో మహావిష్ణువు పాతాళానికి పంపిన బలి చక్రవర్తి ఈ మూడు రోజులూ భూలోక సంచారానికి వస్తాడని పురాణ కథనం.ఉత్తరాయణ పుణ్యకాలం... సంక్రాంతి

రెండో రోజు ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ధనూరాశి నుంచి ఈ రోజున మకర రాశిలో ప్రవేశిస్త్తాడు. ఉత్తర దిశగా పయనాన్ని ప్రారంభిస్తాడు. ‘ఉత్తరాయణ పుణ్యకాల’మని దీన్ని పిలుస్తారు. ఈ సందర్భంగా నదుల్లో స్నానం చేయడం పుణ్యప్రదమనీ, లేకుంటే చెరువుల్లో, బావి నీటితో స్నానాలు ఆచరించాలనీ శాస్త్రాలు చెబుతున్నాయి.

సంక్రాంతి రోజున కుటుంబంలో పూర్వులకు తర్పణాలు వదలడం, గతించిన వారి పేరు మీద గుమ్మడికాయలు, తాంబూలాదులతో స్తోమతను బట్టి ధన ధాన్యాలు, సువర్ణం దానం చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ విధంగా దీనికి ‘పెద్దల పండుగ’ అని పేరు వచ్చింది. అదే ‘పెద్ద పండుగ’గా మారింది.


గృహిణులు గౌరీ దేవికి పసుపు, కుంకుమలను నివేదించి, ముత్తయిదువులకు పంచుతారు. కొత్త అల్లుళ్ళను ఆహ్వానించి, ఆదరించి, ఆతిథ్యం ఇస్తారు. ఈ రోజు నుంచి మహిళలు కొత్త నోములను పట్టి ఏడాది పొడుగునా ఆచరించే సంప్రదాయం కూడా ఉంది. బంధుమిత్రులతో రోజంతా విందు వినోదాలతో సంతోషంగా గడిపే పండుగ సంక్రాంతి.


వ్యవసాయ సంస్కృతికి అద్దం కనుమ

మూడో రోజు కనుమ. ఇది ప్రత్యేకించి కర్షకుల పండుగ. వ్యవసాయాధారితమైన భారతీయ సంస్కృతికి ఇది అద్దం పడుతుంది. రైతులు పశువుల కొట్టాలనూ శుభ్రం చేస్తారు. పశువులకు స్నానాలు చేయించి, వాటి నుదుట పసుపు, కుంకుమలను అద్ది, అందంగా అలంకరిస్తారు. కొత్తగా వచ్చిన బియ్యంతో పొంగలి వండి నివేదించి, పశువులకు తినిపిస్తారు. వ్యవసాయ పనుల్లో తమకు సాయపడిన బసవన్నలకు ఈ విధంగా కృతజ్ఞత తెలియజేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కనుమ మరుసటి రోజును ‘ముక్కనుమ’గా నిర్వహిస్తారు.

చరాచరాత్మకమైన ప్రాణుల భవితను తీర్చిదిద్దేది సర్వదేవాత్మకుడైన సూర్యుడి కృపే. అందుకే సూర్యుణ్ణి ఆరాధించి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మకర సంక్రాంతి కాలాన్ని వినియోగించుకోవాలి. అలాగే, ప్రతిరోజూ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఎ.సీతారామారావు

8978799864

Updated Date - 2021-01-13T05:43:35+05:30 IST