కుల నిర్మూలన ఉద్యమంలో నావంతుగా...

ABN , First Publish Date - 2021-02-01T05:51:32+05:30 IST

తెలుగు నేలను విశాలభావాలతో నింపేందుకు పరితపించిన ఒకనాటి సామాజిక కార్యకర్త ఆమె. కుల, మతాలకు అతీతమైన కుటుంబానికి పెద్ద. సంఘసంస్కరణోద్యమాలకు ప్రత్యక్ష సాక్షి. ఎనిమిది

కుల నిర్మూలన ఉద్యమంలో నావంతుగా...

తెలుగు నేలను విశాలభావాలతో నింపేందుకు పరితపించిన ఒకనాటి సామాజిక కార్యకర్త ఆమె. కుల, మతాలకు అతీతమైన కుటుంబానికి పెద్ద. సంఘసంస్కరణోద్యమాలకు ప్రత్యక్ష సాక్షి. ఎనిమిది దశాబ్దాల కిందటే మూఢవిశ్వాసాలను ధిక్కరించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించి, ప్రజాస్వామిక సమాజాన్ని కలలుగన్నారు. ఆమే హేతువాద ఉద్యమ స్మృతుల జీవధార గుత్తా జవహరీబాయీ. నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి, ఆదర్శంగా నిలిచిన 98 ఏళ్ల జవహరీ తన ఉద్యమ జ్ఞాపకాలను నవ్యతో పంచుకున్నారు.


మా కుటుంబానికి కులమతాల్లేవు. నాకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ల ఐదుగురి వివాహాలను కులాలకు అతీతంగా జరిపించాం. మా చిన్నోడు క్రాంతి, చైనా అమ్మాయి ఎలెన్‌ (జ్వాల తల్లితండ్రులు) ప్రేమించుకొని ఒక్కటయ్యారు. ఇక మా పిల్లల పెళ్లిళ్లకు శుభముహూర్తాలేమీ చూడలేదు. వేదమంత్రాలు, తాళి, తలంబ్రాలు వంటి సంప్రదాయ పద్ధతులూ పాటించలేదు. కట్నకానుకల సంగతికొస్తే మేము ఇవ్వలేదు, తీసుకోలేదు. అన్నీ రిజిస్టర్‌ మ్యారేజీలే. పిల్లల్ని కని, పెంచినంత మాత్రాన వాళ్లపై సర్వహక్కులూ తల్లిదండ్రులవే అనుకోవడం సరికాదు. అందుకే చదువు, పెళ్లి వంటి ప్రతి విషయంలో పిల్లల ఇష్టాయిష్టాల ప్రకారమే నడుచుకున్నాం. కన్నవాళ్లు అలానే వ్యవహరించాలి. మాదీ కులాంతర వివాహమే. సుమారు 78 ఏళ్ల కిందట ఒక అమావాస్య రోజున దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నాం. మా సొంతూరు రేపల్లె వద్ద పెద్ద పులివర్రు. నా జీవిత సహచరుడు గుత్తా సుబ్రహ్మణ్యంది గుత్తావారి పాలెం. మా రెండు కుటుంబాలది జాతీయోద్యమ కాలం నాటి పరిచయం. 


జైల్లోనే కన్నుమూసిన తోటి కోడలు

మా అత్తింటివాళ్లది పెద్ద కుటుంబం. అయితే, వాళ్లు పెద్దగా చదువుకోకున్నా, విశాలభావాలు గలవారు. నా భర్త సుబ్రహ్మణ్యం, మా బావ రామానుజయ్య హేతువాద ఉద్యమంలో గోపరాజు రామచంద్రరావు (గోరా)తో కలిసి పనిచేశారు. ఆచార్య ఎన్జీరంగాతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొన్నారు. తర్వాత కమ్యూనిస్టు పార్టీకి దగ్గరయ్యారు. తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులు ఎన్నోసార్లు మా ఇంట్లోని సమావేశాలకు హాజరయ్యారు. మా బావలు రామానుజయ్య, రాఘవయ్య, చలమయ్య దేశం కోసం పోరాడి జైలుకెళ్లారు. మా ఆడపడుచు రాజరత్నం, పెద్ద తోటికోడలు సుందరమ్మ మహాత్మాగాంధీ పిలుపుతో ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలో పాల్గొని, అరెస్టు అయ్యారు. జైలు నిర్బంధంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సుందరమ్మను విడుదల చేసినా, ‘భారతదేశానికి స్వాతంత్య్రం వస్తేగానీ జైలు నుంచి బయటకెళ్లన’ని భీష్మించింది. చివరికి ‘నా దేశం..నా దేశం’ అని కలవరిస్తూ రాయవెలూర్‌ కారాగారంలోనే చనిపోయింది.  


ఊరి వాళ్లు వెలేశారు!

కులం పోకడలు, కట్టుబాట్లు బలంగా ఉన్న ఆ రోజుల్లో కులాంతర వివాహాలు చాలా తక్కువ. మేనరికం వల్ల కలిగే నష్టాలను ఆ రోజుల్లోనే మా ఆయన ప్రచారం చేసేవారు. కులాంతర వివాహాల వల్ల కలిగే జన్యుపరమైన మేలును వివరించేవారు. మా కుటుంబంలో తొలి అభ్యుదయ వివాహం మాదే. సంప్రదాయవాదులైన మా అత్తమామలు మా పెళ్లిని స్వాగతించారు. కానీ గ్రామస్థుల్లో కొందరు సహించలేకపోయారు. ‘మీరు వేరేకులం అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నారు. అలా మీ ఇంటి ఆడపిల్లనూ మరో కులపోళ్లకు ఇస్తారా’ అని ఊర్లోవారెవరో మా బావతో వాదులాడారట. ఆ మాటకి ఆయన తన కూతురు భారతికి హైదరాబాద్‌లోని అరిగె రామస్వామి కొడుకు భాస్కరరావుతో కులాంతర వివాహం చేశారు. ఆ పెళ్లిని అభినందిస్తూ మహాత్మాగాంధీ ఉత్తరం రాశారు. మా ఇంట్లో రెండు కులాంతర పెళ్లిళ్లు జరగడంతో ఊళ్లో వారంతా మమ్మల్ని వేడుకలకు పిలవడం మానేశారు. రజకులు, నాయిబ్రాహ్మణులను పనుల్లోకి రానివ్వలేదు. దాంతో మా ఇంట్లోని మగవాళ్లే ఒకరికొకరు క్షవరం చేసుకునేవారు. పొలం పనులకు కూలీలూ వచ్చేవారు కాదు. చాలా ఇబ్బందులెదుర్కొన్నాం. కానీ సమాజానికి మాత్రం భయపడ లేదు. 


మా నాన్న నేతాజీకి ఆత్మీయుడు

మా నాన్న గుంటూరు సుబ్బారావు కోల్‌కతా ఓరియెంటల్‌ కాలేజీలో హోమియోపతి, ఆయుర్వేదం కోర్సు చదివారు. అప్పుడే ఆయనకి నేతాజీ సుభా్‌షచంద్ర బోస్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ మా నాన్న నేతాజీ ఇంటికి వెళ్లొస్తుండేవారు. ఒకసారి ఆరునెలలు అక్కడే ఉన్నారు. నేతాజీ అన్నయ్య శరత్‌ చంద్రబోస్‌ కూడా నాన్నకి మంచి సన్నిహితుడు. మా రెండో చెల్లి పుట్టినప్పుడు ‘‘మళ్లీ అమ్మాయే’’అని మా నాన్న నేతాజీతో అన్నారట. ‘‘ఆడపిల్లలే కన్నవాళ్లను ప్రేమతో చూసుకుంటారు. కనుక నీవేమీ దిగులుపడకు’’ అని ఆయన నవ్వారట. ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌లోనూ నాన్న పనిచేశారు. బ్రిటిష్‌ అధికారులతో ఆయన ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడేవారు. అందుకేనోమో పెద్దపులివర్రు చుట్టుపక్క ఊళ్ల ప్రజలు మా నాన్నను ‘ఇంగ్లీషు సుబ్బారావు’ అనేవాళ్లు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నందుకు నాన్న ఆరు నెలలు జైలు జీవితం గడిపారు. మూడు నెలలు గృహనిర్బంధంలో ఉన్నారు. ధైర్యంగా మెలగటాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నాన్న నుంచే నేర్చుకున్నా. అదే నన్ను మనిషిగా నిలబెట్టింది.


సేవాగ్రామ్‌లో కొన్నేళ్లు...

ఉద్యమాల్లో నిమగ్నమైన మా కుటుంబానికి మొదటి నుంచి ఆస్తిపాస్తుల మీద ధ్యాస లేదు. మా బావలు జైల్లో ఉన్న సమయంలో పన్ను వసూలు పేరుతో బ్రిటిష్‌ అధికారులు మా ఇంట్లోని బంగారం, డబ్బు అంతా తీసుకెళ్లారు. చివరికి ఇంటి దర్వాజనూ వదల్లేదు. అలా కొన్నాళ్లకు సొంతిల్లు కూడా మిగల్లేదు. గాంధేయవాది ఆచంట లక్ష్మీపతి సలహాతో 1948లో సేవాగ్రామ్‌ చేరుకున్నాం. అప్పుడు నేను నిండు గర్భవతిని. మా పెద్దమ్మాయి అక్కడే కస్తూర్బా ఆస్పత్రిలో పుట్టింది. అక్కడే నలభై ఏళ్లు ఉన్నాం. అక్కడి కస్తూర్బా గాంధీ మెడికల్‌ కాలేజీ ఆవరణలో ఒక చిన్నహోటల్‌ నడుపుతూ, వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చదివించాం. అలా అని మేము సామాజిక ఉద్యమాలకు దూరం కాలేదు. కులనిర్మూలన ఉద్యమంలో నా వంతుగా పనిచేశా. ఎన్నో కులాంతర వివాహాలను నా చేతులతో జరిపించా.


నా భర్త శరీరాన్ని....

తొలి నుంచి తాళి, మెట్టెలు వంటి సంప్రదాయాలకు నేను దూరం. భర్త చనిపోతే పసుపు, కుంకుమ తీసేయాలి వంటి మూఢాచారాలను అస్సలు అంగీకరించను. నా భర్త దూరమై ఇప్పటికి ఐదేళ్లు. ఆయన కళ్లు, శరీరాన్ని ఒక మెడికల్‌ కాలేజీకి అప్పగించాం. మనిషి మరణించాక కూడా నలుగురికి సాయపడాలి అనేది మా ఉద్దేశ్యం. మా పిల్లలంతా స్థిరపడ్డారు. అలా అని వాళ్ల మీద ఆధారపడటం నాకిష్టం లేదు. ఒంట్లో ఓపికున్నంత వరకూ స్వతంత్రంగా బతకాలని కోరిక. ఇప్పటి వరకైతే బీపీ, షుగర్‌ వంటి సమస్యలేమీ లేవు. చిన్నప్పటి నుంచి ఆరోగ్యం మీద నాకు శ్రద్ధ ఎక్కువే. భోజనంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ తినడం అలవాటు. ఉదయం ఇడ్లీ, ఉప్మా వంటివి తీసుకుంటా. మధ్యాహ్నం అన్నం, రాత్రికి చపాతీ తింటా. రోజుకి రెండుసార్లు పండ్లు, కూరగాయల రసం తాగుతా. రోజూ పేపర్‌ చదువుతా. టీవీ చూస్తాను. ఇంటికొచ్చిన బంధుమిత్రులతో తనివితీరా కబుర్లాడతాను. అలా సంతోషంగా గడిపేస్తున్నా.


ఇప్పుడే ఆ అవసరం పెరిగింది

ఒకసారి స్కూల్లో మా పిల్లల్ని ‘మీది ఏ కులం’ అనడిగారు. వీళ్లేమో ‘మాకు తెలియదు’ అన్నారు. నిజంగానే మా పిల్లలకు కులం తెలియదు. అలా పెంచాం. స్కూలు సర్టిఫికేట్‌లో ఏదో ఒక కులం రాయాలని, స్కూలు టీచర్లే తమకు తోచిన కులాన్ని ఒక్కొక్కరి సర్టిఫికెట్‌లో ఒక్కోలా రాశారు. ఆ సంగతి పిల్లలు ఇంటికి వచ్చి చెబితే మేమంతా నవ్వుకున్నాం. కులమతాల పేరుతో పసిహృదయాలను మనమే కలుషితం చేస్తున్నాం! వారిపై మూఢవిశ్వాసాలను రుద్దుతున్నాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు అఘాయిత్యాలు పెరిగాయి. ప్రేమించి పెళ్లాడితే పిల్లల్ని చంపేస్తున్నారు. మూఢభక్తితో పిల్లల్ని బలి ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అప్పటి కంటే ఇప్పుడే సామాజిక మార్పు కోసం పోరాడాల్సిన అవసరం పెరిగిందనిపిస్తోంది.


ఎలా ఉండాలో ఆచరించి చూపించారు

మా ఇంటికి వాస్తుండదు. మా ఇంట్లో కుల, మత అంతరాలుండవు. మా అమ్మమ్మ జవహరీబాయి, తాతయ్య సుబ్రహ్మణ్యం హేతువాద ఆలోచనలను ఆస్తిగా మాకిచ్చారు. ప్రశ్నించేతత్వాన్ని వారసత్వంగా అందించారు. కులనిర్మూలన పోరాటంలో తాతయ్యతో సమంగా అమ్మమ్మా పనిచేశారు. ఆమె ఎన్నో కులాంతర వివాహాలను దగ్గరుండి మరీ జరిపించారు. ఆ సమయంలో వధూవరుల పెద్దల నుంచి వచ్చే దాడులనూ ధైర్యంగా ఎదుర్కొన్నారు. అందుకే ఆమె మా అందరి దృష్టిలో ఒక ధీశాలి. తాతయ్య ఉద్యమాలకే పరిమితమైతే, అమ్మమ్మ ఉద్యమంతో పాటు కుటుంబ బాధ్యతనూ నిర్వర్తించారు. సేవాగ్రామ్‌లో చిన్నహోటల్‌ నడుపుతూ, తద్వారా వచ్చే సంపాదనతో ఆరుగురు సంతానాన్ని చదివించారు. అమ్మమ్మ, తాతయ్య మాకెప్పుడూ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పలేదు. ఎలా ఉండాలో తమ ఆచరణ ద్వారా చూపించారు.

 కమల్‌కామరాజు, సినీనటుడు


ఆదర్శమూర్తి

మా కుటుంబ సభ్యులందరివీ కులాంతర వివాహాలే. మా అమ్మ, నాన్నలదైతే దేశాంతర వివాహం. ప్రతి విషయాన్ని రీజన్‌, లాజిక్‌తో ఆలోచించడం నాన్నమ్మ, తాతయ్యల నుంచే మేమంతా నేర్చుకున్నాం. మా ఇద్దరు పెద్దనాన్నలు, నాన్నతో పాటు ముగ్గురు మేనత్తలనూ సమానంగా పెంచారు. కొడుకులతో పాటు కూతుళ్లనూ బాగా చదివించారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని ఆచరించి, మాకు ఆదర్శంగా నిలిచారు. కులనిర్మూలన ఉద్యమానికి తమ జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తులు మా నానమ్మ, తాతయ్య. ఆ రోజుల్లోనే మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను ధిక్కరించడమంటే సాధారణ విషయం కాదు కదా! అందులో మా నానమ్మ జవహరీబాయి కృషి మరికాస్త ఎక్కువ అంటాను.

గుత్తా జ్వాల, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి


కారుసాల వెంకటేశ్‌

ఫొటోలు: అశోకుడు

Updated Date - 2021-02-01T05:51:32+05:30 IST