చిన్నారులకు చిరుదీపం

ABN , First Publish Date - 2021-05-08T05:30:00+05:30 IST

‘‘ఓ పదమూడేళ్ల పిల్లాడు. అతడి తల్లితండ్రులకు కరోనా సోకింది. వైద్యులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండమన్నారు. ఒకే గది ఉన్న చిన్న ఇల్లు వారిది. వైరస్‌ బారి నుంచి తమ పిల్లాడిని కాపాడుకోవాలన్న

చిన్నారులకు చిరుదీపం

కరోనా విలయంతో కుటుంబాలు అస్తవ్యస్తమవుతున్నాయి. 

‘పాజిటివ్‌’ వచ్చిన తల్లితండ్రులు తమ పిల్లలను ఇంట్లో ఉంచుకోలేక... వేరొక చోటికి పంపే దారి లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముంబయి వంటి మహానగరాల్లో ఇది దాదాపు ప్రతి ఇంటి సమస్య. 

ఈ విపత్కర పరిస్థితుల నుంచి చిన్నారులను రక్షించాలనుకున్నారు ప్రముఖ కళాకారిణి, సామాజికవేత్త రూబుల్‌ నేగి. అందుకోసం తన డే-కేర్‌ సెంటర్లను పిల్లలకు కొవిడ్‌ కవచాలుగా మార్చారు. అక్కడ ఉచిత వసతి మాత్రమే కాదు... భోజనం పెట్టి, విద్యాబుద్ధులు కూడా నేర్పిస్తున్నారు...


‘‘ఓ పదమూడేళ్ల పిల్లాడు. అతడి తల్లితండ్రులకు కరోనా సోకింది. వైద్యులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండమన్నారు. ఒకే గది ఉన్న చిన్న ఇల్లు వారిది. వైరస్‌ బారి నుంచి తమ పిల్లాడిని కాపాడుకోవాలన్న ఆలోచనతో దగ్గర్లోని మరో ఇంటికి మారారు అతడి తల్లితండ్రులు. చిన్నారి ఒంటరైపోయాడు. నిత్యం వార్తల్లో, చుట్టుపక్కలవారి కళ్లల్లో కరోనా కల్లోలం పిల్లవాడిలో ఆందోళన పెంచాయి. కొన్ని రోజులు గడిచాయి. తన తల్లితండ్రుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారు చనిపోయారని భావించాడతడు. అమ్మానాన్నలు లేని జీవితం తనకూ వద్దనుకున్నాడు. అతడొక్కడే కాదు... కొవిడ్‌ దెబ్బకు ఇలా ఎంతోమంది చిన్నారులు ఏ దిక్కూ లేక అల్లాడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు నాకు నిద్దర పట్టనివ్వలేదు. అందుకే మా స్వచ్ఛంద సంస్థ ‘రూబుల్‌ నేగి ఆర్ట్‌ ఫౌండేషన్‌’ (ఆర్‌ఎన్‌ఏఎఫ్‌) ద్వారా కొవిడ్‌ బాధిత కుటుంబాల్లోని పిల్లలకు వసతి కల్పించాలని నిర్ణయించాను. అభాగ్యులు, అనాథ పిల్లలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్నేళ్ల కిందట ఈ సంస్థను స్థాపించాను. 


కరోనా కేర్‌ సెంటర్లుగా... 

మా సంస్థ ఆధ్వర్యంలో ముంబయితో పాటు ఢిల్లీ, రాజస్తాన్‌, నోయిడా తదితర తొమ్మిది ప్రాంతాల్లో డే-కేర్‌ సెంటర్లు ఉన్నాయి. వాటినే ఇప్పుడు కరోనా కేర్‌ కేంద్రాలుగా మార్చాను. కొవిడ్‌ సోకిన తల్లితండ్రులు తమ బిడ్డలను నిరభ్యంతరంగా ఇక్కడ వదిలేసి వెళ్లవచ్చు. వాళ్లకు వసతి, బోజనం, అవసరమైతే వైద్య సదుపాయం... అన్నీ మేమే చూసుకొంటాం. దీనికి ఒక్క రూపాయి కూడా తీసుకోవడంలేదు. ఇక్కడ బెడ్లు, నిత్యావసరాలు, స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉన్నాయి. ఆ పదమూడేళ్ల పిల్లవాడు కూడా ప్రస్తుతం సంతోషంగా ఉన్నాడు. కరోనా నుంచి కోలుకొంటున్న అతడి తల్లితండ్రులతో ఫోన్‌లో మాట్లాడిస్తున్నాం. 


మానసిక ఒత్తిడి... 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం కరోనా మరణాలు 45-60 సంవత్సరాల మధ్య వయస్కుల్లో 35 శాతం, 26-44 మధ్య వయసువారిలో 10 శాతం ఉన్నాయి. అంటే వీరి పిల్లలు యవ్వనంలోనో లేదా అంతకంటే చిన్నవారై ఉంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఈ వయసువారికి ఎంతోకొంత అవగాహన ఉంటుంది. పైగా స్కూల్స్‌ బంద్‌. డిజిటల్‌ ప్రపంచంలో గంటలకొద్దీ గడపడంవల్ల ఆ కంటెంట్‌ అంతా వారి మెదడుకు ఎక్కుతోంది. దీంతో తమ తల్లితండ్రులకు ఎవరికైనా వైరస్‌ సోకితే ఆందోళన చెందుతున్నారు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఇరుకు ఇళ్లలో ఉండే దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఐసొలేషన్‌కు సరైన వసతి కోసం తల్లితండ్రులు వెతుక్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ ఆలోచించాక తక్షణ కర్తవ్యంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చాను. 


పంజరంలో ఉన్నట్టు... 

తల్లితండ్రులకు దూరమై ఇంట్లో ఒంటరిగా ఉన్న పిల్లలకు పంజరంలో బంధించినట్టు అనిపిస్తుంది. లాక్‌డౌన్‌ వంటి వాటివల్ల వారికి శారీక శ్రమ కూడా లేకుండా పోతుంది. ఫలితంగా ఫిట్‌నెస్‌ కోల్పోయి, అధిక బరువు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటప్పుడు వారికి అందుబాటులో ఉన్న ఏకైక సాధనం, నేస్తం ఆన్‌లైన్‌ ప్రపంచం. ఈ పరిస్థితుల్లో ఒకవేళ వారి తల్లితండ్రులో ఎవరైనా మరణిస్తే ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో బతుకు చాలించాలనే తీవ్ర నిర్ణయాలకు కూడా వస్తున్నారు. వీటన్నిటికీ దూరంగా ఉంచాలనే లక్ష్యంతో మా కేర్‌ సెంటర్లలో పిల్లలకు ముందుగా మానసిక ప్రశాంతత కల్పిస్తున్నాం. దాంతోపాటు బలవర్దకమైన ఆహారం అందిస్తున్నాం. స్కూళ్లు లేక ఆగిపోయిన చదువుని ఇక్కడ కొనసాగిస్తున్నాం. కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్ట్‌ ఉన్న పిల్లల్నే చేర్చుకొంటాం. వారిక్కడ 14 రోజులు ఉంటారు. తల్లితండ్రులు కోలుకున్నాక ఇంటికి పంపిస్తాం. ఈ సేవలు ఆర్థిక స్థోమత లేని పిల్లలకు మాత్రమే. 


బంధం బలపడుతుంది... 

మా కరోనా కేర్‌ సెంటర్లలో ఉదయం లేవగానే అల్పాహారం ఇస్తాం. 9 గంటలకు తరగతులు మొదలవుతాయి. సైన్స్‌, అర్థమెటిక్‌, ఇంగ్లిష్‌, హిస్టరీ తదితర పాఠ్యాంశాలు బోధిస్తాం. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం. ఓ గంట విరామం తరువాత ఆటలు ఆడిస్తాం. కథలు చెబుతాం. రాత్రి ఏడున్నరకు భోజనం చేసి, నిద్రపోతారు. దేశమంతా కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ... పిల్లలకు ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంవల్ల వారి మనసుల్లో కల్లోలం తగ్గుతుంది. అంతా సవ్యంగానే సాగుతుందన్న భావన కలుగుతుంది. ఇళ్లల్లో ఒంటరిగా ఉండే పిల్లలు ఇక్కడ ఒకరితో ఒకరు కలిసి మెలిసి గడపడంవల్ల బంధాలూ బలపడతాయి. అంతిమంగా మా కేంద్రం నుంచి వెళ్లే ప్రతి పిల్లవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే నా ఆకాంక్ష.


ఆమె ఒక చైతన్యమూర్తి...

కశ్మీర్‌లో పుట్టిన రూబుల్‌ నేగి ప్రముఖ కళాకారిణి. సామాజిక కార్యకర్త. శిల్ప, చిత్రకళల్లో నిష్ణాతులు. అణగారిన వర్గాల పిల్లల జీవితాల్లో కళ ద్వారా వెలుగులు నింపాలనే ఉద్దేశంతో పదేళ్ల కిందట ‘రూబుల్‌ నేగి ఆర్ట్‌ ఫౌండేషన్‌’ స్థాపించారు. ‘మిసాల్‌ ముంబయి’ క్యాంపెయిన్‌లో భాగంగా ఇప్పటి వరకు మురికివాడల్లోని 24 వేలకు పైగా ఇళ్లకు పెయింటింగ్స్‌తో హంగులు అద్దారు. ఆమె కళాకృతులు సెలబ్రిటీలు, కార్పొరేట్‌ దిగ్గజాల ఇళ్లు, మ్యూజియంలలో లెక్కకు మించి ఉన్నాయి. 

Updated Date - 2021-05-08T05:30:00+05:30 IST