దేని దారి దానిదే..
ABN , First Publish Date - 2021-01-20T13:36:05+05:30 IST
వేగంగా వచ్చిన వాటర్‌ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఢీకొంటూ నాలుగు వాహనాలను ధ్వంసం చేసింది. నలుగురిని గాయాలపాలు చేసింది. మైలార్దేవుపల్లి ...

సిటీ రోడ్లపై ప్రయాణం జీవన్మరణ సమస్యగా పరిణమిస్తోంది. మనం ఎంత బాగా, ఎంత జాగ్రత్తగా వాహనం నడుపుతున్నా ... మిగతా వారు అలాగే ప్రవర్తిస్తారన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఏదో ఫుట్‌పాత్‌పై ఒద్దికగా నడుచుకుంటూ పోతున్నా మనపైకి ఎవరూ దూసుకురారు అన్న ధీమా లేదు. రహదారుల భద్రతా మాసం సందర్భంగా అధికారులు ప్రమాదాలు తగ్గించేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అయినా పౌరులలో అవగాహన ఎంత పెరుగుతోందన్నది డౌటే..!
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఫరిష్తే పేరిట ట్రాఫిక్ వలంటీర్లతో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ కూడళ్లలో 16మంది వలంటీర్లు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ల వాడకం, సిగ్నళ్ల వినియోగం గురించి అవగాహన కల్పించారు.
రాజేంద్రనగర్: వేగంగా వచ్చిన వాటర్‌ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఢీకొంటూ నాలుగు వాహనాలను ధ్వంసం చేసింది. నలుగురిని గాయాలపాలు చేసింది. మైలార్దేవుపల్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. దీంతో చౌరస్తాలో చాలా సమయం ట్రాఫిక్ స్తంభించిపోయింది. వివరాలిలా ఉన్నాయి.
మైలార్దేవుపల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ఇండియన్ స్వీట్ హౌజ్ సమీపంలో ఏర్పాటు చేసిన సిగ్నల్ వద్ద వాటర్‌ట్యాంకర్ (ఏపీ16-టీసీ6331) ముందుగా వెళుతున్న టాటాఏస్ ఆటో(ఏపీ12వీ-2938), ప్యాసింజర్ ఆటో(ఏపీ 09-వై8538)తో పాటు, స్విఫ్ట్ కారు(టీఎస్ 7యూఈ7417)ను బలంగా ఢీ కొట్టింది. వీటితోపాటు వాటర్ ట్యాంకర్ కింద పడి నూతన యాక్టివా పూర్తిగా నుజ్జునుజ్జయింది. మరో ద్విచక్ర వాహనం (టీఎస్8 ఈడబ్ల్యూ 2155 ఎఫ్‌జెడ్) వెనుకభాగం పగిలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, మైలార్దేవుపల్లి ఇన్స్పెక్టర్ కె.నర్సింహ క్షతగాత్రులను సమీప ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మహ్మద్ నయీమ్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకర్‌కు బ్రేకులు సరిగా లేవని అంటున్నారు.