బెంచీకి ఒక్కరే..!

ABN , First Publish Date - 2021-01-20T13:29:36+05:30 IST

మూతపడిన పాఠశాలలు మరో 12 రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ ఇంటిలోనే ఆన్‌లైన్‌ క్లాసులను వీక్షించిన 9,10 తరగతి విద్యార్థులు తిరిగి...

బెంచీకి ఒక్కరే..!

స్కూల్ బెల్ -2

ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులకు సీటింగ్‌

థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌, మిడ్‌డే మీల్స్‌కు స్పెషల్‌ టీం

సైన్స్‌ టీచర్లకు తాగునీటి పర్యవేక్షణ బాధ్యత 

పాఠశాలలు, హాస్టళ్లలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ రూమ్‌

అందుబాటులో వేర్వేరు బెడ్లు, పీపీఈ కిట్లు

కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆస్పత్రికి తరలింపు

తల్లిదండ్రులు నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇస్తేనే పిల్లలకు అనుమతి

12 రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలు


హైదరాబాద్‌ సిటీ: మూతపడిన పాఠశాలలు మరో 12 రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ ఇంటిలోనే ఆన్‌లైన్‌ క్లాసులను వీక్షించిన 9,10 తరగతి విద్యార్థులు తిరిగి తమ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనలకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల ఉపాధ్యాయులు స్కూళ్లలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటి నుంచి క్షేమంగా వస్తున్న పిల్లలు తిరిగి అదే రీతిలో ఇంటికి ఆరోగ్యంగా వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సర్కారు బడుల్లో రెండురోజుల నుంచి తరగతి గదులను, టాయిలెట్లను శుభ్రం చేయిస్తూ, కొవిడ్‌ నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు జూలై మొదటి వారం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించాయి. కొవిడ్‌ అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి టీశాట్‌, దూరదర్శన్‌ ఛానళ్ల ద్వారా సాంకేతిక తరగతులను నిర్వహిస్తున్నారు. 


ఎన్‌వోసీ తప్పనిసరి..

కొవిడ్‌కు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో తరగతి గదిలో 40 మంది వరకు కూర్చోబెట్టి బోధించేవారు. అయితే ప్రస్తుతం కరోనాని దృష్టిలో ఉంచుకుని క్లాసుల్లో గదికి కేవలం 20 మందిని, బెంచీకి ఒక్కరి చొప్పున మాత్రమే కూర్చోబెట్టి బోధనలు చేపట్టాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. అలాగే విద్యార్థులకు రోజూ థర్మల్‌ స్ర్కీనింగ్‌, గదుల శానిటైజేషన్‌, మిడ్‌ డే మీల్స్‌ పర్యవేక్షణ బాధ్యతలను ఐదుగురు ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందానికి అప్పగించనున్నారు. తాగునీటి పర్యవేక్షణను సైన్స్‌టీచర్లు చూసుకోవాలని, పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రుల నుంచి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాలని, లేకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశముందని స్పష్టం చేశారు. 


హాస్టళ్లలో ఐసోలేషన్‌ గది..

కరోనా నేపథ్యంలో పాఠశాలలు, హాస్టళ్లకు వస్తున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఆయాచోట్ల ఒక ఐసోలేషన్‌ గదిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. పాఠశాలలోని ఒక గదిని ఐసోలేషన్‌గా ఏర్పాటు చేసి, క్లాసు సమయంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను అక్కడికి పంపించి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల్లో కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేషన్‌ గదిలో ఉంచి సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్సలు అందించి, ఇతర విద్యార్థులు కరోనా బారిన పడకుండా చూడాలని తెలిపారు. వైద్యశాఖ సహకారంతో పాఠశాలలు, హాస్టళ్లలో రెండు బెడ్లు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. 


వేధిస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్య..

ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్‌తో మార్చి నుంచి బడులు మూతపడడంతో వారిని కూడా తొలగించారు. 2020 ఆగస్టు 27 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా పారిశుధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో మరుగుదొడ్ల నిర్వహణ లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. బడులు ప్రారంభమైన తర్వాత టాయిలెట్లు, తరగతి గదుల శుభత్ర, శానిటైజేషన్‌ ఎలా అని వారు ఆందోళనకు గురవుతున్నారు. పారిశుధ్య కార్మికుల వేతనాలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.


పాఠశాల నిర్వహణపై కలెక్టర్‌ దృష్టి..

ఫిబ్రవరి 1 నుంచి 9, 10 విద్యార్థులకు తరగతి గది బోధనలు ప్రారంభించనున్న తరుణంలో కలెక్టర్‌ శ్వేతామహంతి బడుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, కొవిడ్‌ జాగ్రత్తలను గట్టిగా పాటించాలని విద్యాశాఖాధికారులకు సూచిస్తున్నారు. బోధనలు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఏమాత్రం అస్వస్థతకు గురైనా వెంటనే  డాక్టర్లను పిలిపించి వైద్యం అందించాలని, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంటున్నారు.


జిల్లాలోని పాఠశాలలు

ప్రభుత్వ -689, 9, 10వ తరగతి విద్యార్థులు 21వేలు

ప్రైవేట్ 2,400, 9, 10వ తరగతి విద్యార్థులు 2.30 లక్షలు (సుమారు)




Updated Date - 2021-01-20T13:29:36+05:30 IST