వచ్చే రెండు వారాల్లో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు బీభత్సంగా ఉంటాయట!

ABN , First Publish Date - 2021-05-19T01:34:01+05:30 IST

తమిళనాడు, అస్సాం, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల్లో కరోనా కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని

వచ్చే రెండు వారాల్లో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు బీభత్సంగా ఉంటాయట!

న్యూఢిల్లీ: తమిళనాడు, అస్సాం, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల్లో కరోనా కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని కోవిడ్-19 పథాన్ని సూచించే సూత్ర మోడల్ (SUTRA) చెబుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజారాత్, మధ్యప్రదేశ్‌లు ఈ స్థాయిని ఇప్పటికే దాటినట్టు సూత్ర మోడల్ పేర్కొనడం కొంత ఉపశమనం కలిగిస్తోంది.


ఈ నెల 4 నాటికి దేశవ్యాప్తంగా రోజు వారీ కొవిడ్ కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పడతాయని కూడా ఇదే మోడల్ పేర్కొంది. ఈ నెల 7 దేశంలో 4,14,188 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక రోజు ఇన్ని కేసులు నమోదు కావడంతో అదే తొలిసారి.  


తమిళనాడు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కేసులు ఇంకా తీవ్రస్థాయికి చేరుకోలేదని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం. విద్యాసాగర్ పేర్కొన్నారు. ఈ మోడల్  కోసం పనిచేస్తున్న ముగ్గురు శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. ఈ నెల 29-31 మధ్య తమిళనాడులో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతాయని, పుదుచ్చేరిలో 19-20 మధ్య కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని ఈ సూత్ర మోడల్ చెబుతోంది.


ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఈ నెల 20-21 మధ్య కేసులు భయంకరంగా వెలుగు చూస్తాయని వివరించింది. మేఘాలయలో 30-31 మధ్య, త్రిపురలో 26-27 తేదీల మధ్య కేసులు తీవ్రస్థాయికి చేరుకుంటాయని మోడల్ పేర్కొంది. అలాగే, హిమాచల్‌ప్రదేశ్‌లో 24, పంజాబ్‌లో 22వ తేదీల్లో కేసులు ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది.


మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, గోవాల్లో కేసులు ఇప్పటికే తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్లలో కేసులు తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నేడు తెలిపింది. ఈ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు కూడా తగ్గినట్టు పేర్కొంది.  


సూత్ర మోడల్ గతేడాదే ఉనికిలోకి వచ్చింది. కరోనా కేసుల పెరుగుదలను అంచనా వేసేందుకు మేథమెటికల్ మోడల్స్‌పై పనిచేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొందరు శాస్త్రవేత్తలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, సెకండ్ వేవ్ కచ్చితమైన స్వభావాన్ని అంచనా వేడయంలో ఈ మోడల్ విఫలం కావడంతో విమర్శలు కూడా వెల్లువెత్తాయి.


అయితే, కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ను గణిత నమూనా సరిగానే అంచనా వేసిందని, రోజుకు లక్ష కేసులతో ఏప్రిల్ మూడో వారంలో పతాకస్థాయికి చేరుకుంటుందని చెప్పిందని విద్యాసాగర్ సహా పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-19T01:34:01+05:30 IST