‘‘నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే హేళన చేస్తారా? ఈ కుక్కలను తరిమితరిమి కొట్టే రోజు చాలా త్వరలోనే వస్తుంది’’

ABN , First Publish Date - 2021-10-29T14:00:56+05:30 IST

‘‘నిరుద్యోగుల కోసం..

‘‘నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే హేళన చేస్తారా? ఈ కుక్కలను తరిమితరిమి కొట్టే రోజు చాలా త్వరలోనే వస్తుంది’’

ఆ కుక్కకు కవిత ఏమైతరో మీరే అడగండి?

ప్రభుత్వంలో మంత్రులుగా సంస్కారం లేని కుక్కలు

నిరుద్యోగ నిరాహార దీక్షలు చేస్తే హేళన చేస్తారా..?

ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల మండిపాటు

హైదరాబాద్‌లో మంత్రుల నివాసాల వద్ద కార్యకర్తల ధర్నా

ఠాణాకు తరలింపు.. సీఐపై ఫోన్లో షర్మిల ఆగ్రహం


ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్‌/ఆదిభట్ల: ‘‘చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం. వాటి బుద్ధి ఎక్కడికి పోతుంది? సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఆ మంత్రికి భార్యాబిడ్డలు, తల్లీ, చెల్లి లేరా? కవిత (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) ఏమైతరో ఆ కుక్కను మీరే అడగండి’’ అంటూ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. తాను చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షలను ఉద్దేశించి మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే హేళన చేస్తారా? ఈ కుక్కలను తరిమితరిమి కొట్టే రోజు చాలా త్వరలోనే వస్తుంది’’ అని అన్నారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు నుంచి మొదలై కప్పాడు, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నం వరకు సాగింది. 13 కిలోమీటర్లు నడిచారు. ఎలిమినేడు క్రాస్‌ రోడ్డు, ఇబ్రహీంపట్నం చౌరస్తాలో షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.


అసైన్డ్‌, పట్టా భూముల్లో ఫార్మా సిటీ

ఫార్మా సిటీని ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు మాట మార్చి యాచారం, కందుకూరు ప్రాంతాల్లో అసైన్డ్‌, పట్టా భూములనూ కారుచౌకగా తీసుకుంటూ రైతులను ఇబ్బంది పెడుతోందని షర్మిల ఆరోపించారు. భూ సేకరణ చట్టం ప్రకారం మూడింతలు పరిహారం ఇవాల్సి ఉన్నా పట్టా భూములకు రూ.10 లక్షలు, అసైన్డ్‌కు రూ.7 లక్షల చొప్పున ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.  భూములు కోల్పోతున్న రైతులకు వైఎస్సార్‌టీపీ అండగా ఉంటుందన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం ఒకటేనని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ సీఎం కేసీఆర్‌కు సప్లయింగ్‌ పార్టీగా మారిందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు అమ్ముడుపోయారంటే అది రాజకీయ వ్యభిచారం కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో లిక్కర్‌ ఆదాయంలాగే.. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు 300 శాతం పెరిగాయన్నారు. ఈ పాలన మనకు అవసరమా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో రూ.33 వేల కోట్లతో చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు పునాదులు వేస్తే.. రీడిజైనింగ్‌ పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లతో కాళేశ్వరం  చేపట్టి అప్పులు చేసిందన్నారు. ఉప ఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయని, ఎన్నికలైపోగానే అవి బందవుతాయని అన్నారు. షర్మిల పాదయాత్ర ఎలిమినేడు క్రాస్‌ వద్ద వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తల్లి వైఎస్‌ విజయలక్ష్మి షర్మిలతో కలిసి కేక్‌ కోసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 


మంత్రుల నివాసం వద్ద కార్యకర్తల ఆందోళన

షర్మిలకు మంత్రి నిరంజన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ గురువారం పార్టీ నాయకురాలు గడ్డ హిందూజ ఆధ్వర్యంలో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయం వద్ద ఆందోళనకు యత్నించారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. దీంతో వారిని బంజారాహిల్స్‌ ఠాణాకు తరలించారు. ఈ విషయం షర్మిలకు తెలియడంతో సీఐకి ఫోన్‌ చేశారు. ‘‘హిందూజను స్టేషన్‌లో ఎలా ఉంచుతారు? ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామంటున్నారట? వాళ్లేమైన రాళ్లు, కట్టెలు, బాంబులు తెచ్చారా? మహిళలపై నీచంగా మాట్లాడిన మంత్రిపై ఏం చర్యలు తీసుకోని మీరు.. మా వాళ్ల స్టేషన్‌లో పెడతారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం వద్ద దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2021-10-29T14:00:56+05:30 IST