గెలిచాక తూచ్!
ABN , First Publish Date - 2021-12-15T13:49:39+05:30 IST
రాష్ట్రంలో దాదాపు..

ఎన్నెన్నో చెప్పి గెలిచేశారు.. ఆపై హామీల తెప్ప తగలేశారు
వైసీపీని విజయ తీరం చేర్చిన సీపీఎస్ రద్దు, పీఆర్సీ
ఎన్నికల ముందు ఉద్యోగులపై తెలివిగా వల
13 లక్షల కుటుంబాలు... వారి ఓట్లతో పండగ
ఇప్పుడు నాలుక మడతేసిన జగన్ సర్కారు
అవగాహన లేకే సీపీఎస్‌పై హామీ ఇచ్చారట
పాత పెన్షన్‌కు బడ్జెట్ కూడా సరిపోదన్న సజ్జల
గద్దెనెక్కిన 30 నెలలకు చావుకబురు చల్లగా!
అవగాహన లేకే మేనిఫెస్టోలో చేర్చారా?
పీఆర్సీపైనా, ‘కాంట్రాక్టు’పైనా పిల్లిమొగ్గలు
మండిపడుతున్న ఉద్యోగ వర్గాలు
ఇదీ లెక్క..
రాష్ట్రంలో ఉద్యోగుల కుటుంబాల ఓట్లు 39 లక్షలు
గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ల తేడా 32 లక్షలు
విపక్షంలో ఉన్నప్పుడు...
‘ఈ చంద్రబాబు ప్రత్యేక హోదా ఎందుకు సాధించడంలేదు? వాళ్ల ఎంపీలు ఎందుకు రాజీనామా చేయరు? మేం కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తాం!’
అధికారంలోకి రాగానే...
‘కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఇప్పుడు ప్రాధేయపడటం తప్ప ఏమీ చేయలేం. దేవుడు సహకరిస్తే, వాళ్లకు మన అవసరం వస్తే అప్పుడు హోదా తెస్తాం!’
విపక్షంలో ఉన్నప్పుడు...
‘ఉద్యోగులకు షెడ్యూలు తప్పకుండా టైమ్ ప్రకారం పీఆర్సీ అమలు చేస్తాం!’
అధికారంలోకి వచ్చాక...
ఐఆర్ 27 శాతంతో సరిపెట్టారు. 30 నెలలు గడిచినా పీఆర్సీకి దిక్కులేదు. పైగా... ఇప్పుడు జీతం పెరిగే సంగతి అటుంచి, తగ్గిస్తామని బెదిరిస్తున్నారు.
విపక్షంలో ఉన్నప్పుడు...
‘మేం అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం!’
అధికారంలోకి వచ్చిన తర్వాత...
‘అబ్బే... సాంకేతిక అంశాలపై అవగాహన లేనందునే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చాం. నిజానికి, అది కుదిరే పని కాదు’ అని చల్లగా చెబుతున్నారు.
మరి... ‘చెప్పాడంటే, చేస్తాడంతే! మాట తప్పడు... మడమ తిప్పడు’ అనే మాటలో నిజముందా? ఇది ఉద్యోగులు, సామాన్యుల ప్రశ్న!
(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఉద్యోగుల కుటుంబాలు! ఇంటికి 3 ఓట్లు వేసుకున్నా దాదాపు 39 లక్షల ఓట్లు! గత ఎన్నికల్లో వీరందరినీ ప్రభావితం చేసిన హామీలు రెండే రెండు! ఒకటి... కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేస్తాం. రెండు... షెడ్యూలు ప్రకారం పీఆర్సీ అమలు చేస్తాం! ఇవి రెండూ... జగన్ ఊరూరా మైకు పట్టుకుని, హోరెత్తించిన హామీలు. దీంతో ఉద్యోగులు కదిలిపోయారు. జగన్‌కు ఓట్లు వేశారు! వేయించారు! వెరసి... ఈ రెండు హామీలే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార పీఠాన్నే తలకిందులు చేశాయి. టీడీపీని గద్దెదించి... వైసీపీకి పట్టం కట్టబెట్టాయి. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లే 39 లక్షలు. కానీ... గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ల తేడా 32 లక్షలు మాత్రమే!
ఇప్పుడు... తనను విజయం తీరం చేర్చిన ‘తెప్ప’నే జగన్ తగలబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీఆర్సీపై ఇప్పటికే కొన్నాళ్లుగా పిల్లిమొగ్గలు వేస్తున్నారు. ఇప్పుడు... సీపీఎస్‌పై ఏకంగా నాలుకను అడ్డదిడ్డంగా మడతేశారు. ‘సాంకేతిక సమస్యలున్నాయని తెలియనందునే సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఇచ్చారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చల్లగా చెప్పారు. మంగళవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపిన తర్వాత... ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ రద్దు గురించి ప్రశ్నించగా... ‘‘సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్లు అమలు చేస్తే... చెల్లింపులకు బడ్జెట్ కూడా సరిపోదు. సీపీఎస్‌లో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు పరిశీలిస్తే... అది రాష్ట్ర బడ్జెట్‌ను దాటేస్తుంది’’ అని సజ్జల చెప్పారు. అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత జగనన్న మెల్లగా నాలుక మడతేశారంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు.
తెచ్చింది వైఎస్...
సీపీఎస్‌ను రాష్ట్రంలో అమలులోకి తెచ్చింది నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే! ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన అంశం. ఇదోరకం పద్మవ్యూహం! లోపలికి ప్రవేశించడమే తప్ప... బయటికి రావడం రాష్ట్రాల చేతుల్లో లేదు. ఆ అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వలేదు. సీపీఎస్ రద్దు చేయాలని చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు... ఇది తమ వల్ల కాదని చేతులెత్తేశాయి. చంద్రబాబు ప్రభుత్వం కూడా వీటన్నింటినీ పరిశీలించింది. చివరికి... రిటైర్ అయిన ఉద్యోగులకు మేలు చేసే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. సరిగ్గా ఇదే సమయంలో ‘మేం అధికారంలోకి వచ్చాక సీపీఎస్ రద్దు చేస్తాం’ అని జగన్ ఊదరగొట్టారు. ఉద్యోగులను, వారి కుటుంబాలను అలా ఆకట్టుకున్నారు.
అంత ఆషామాషీనా...
‘సాంకేతిక అంశాలపై అవగాహన లేకే సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఇచ్చారు’... అని అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత చెప్పడం గమనార్హం. ఏదో ఒక చోట, ఆవేశంలోనో, మాటల సందర్భంలోనో ఇచ్చిన హామీ కాదిది! ప్రచార సమయంలో ఉద్యోగులు ప్లకార్డులతో ఎక్కడ కనిపిస్తే అక్కడ జగన్ ఈ మాట చెప్పారు. ‘అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ను రద్దు చేస్తా’ అని చెప్పారు. అంతేకాదు... తాను భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని పదేపదే చెప్పుకొనే ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. అప్పటికి... వైసీపీ కొత్తగా ఏర్పడిన పార్టీకూడా కాదు. బలమైన ప్రతిపక్షంగా ఉంది. జగన్ చుట్టూ ఎంతోమంది నిపుణులున్నారు. అంతా కలిసి, ఆలోచించే ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేశారు. ఇప్పుడేమో... ‘అవగాహన లేకే సీపీఎస్ రద్దు చేస్తామన్నాం’ అని చెబుతున్నారు.
పీఆర్సీపైనా అంతే...
పీఆర్సీ విషయంలోనూ జగన్ మడమ తిప్పేశారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ‘షెడ్యూలు ప్రకారం పీఆర్సీ’ అనే హామీని మాత్రం తుంగలో తొక్కారు. మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇస్తామని సంకేతాలు పంపిన వైసీపీ... ఇప్పుడు 14.29 శాతం అంటూ ఉద్యోగులను బెంబేలెత్తిస్తోంది. 2018 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని 2022 నవంబరు నుంచి అమలుచేస్తామని సంకేతాలు పంపుతోంది. అదికూడా... జీతం తగ్గించి!
ఉద్యోగులను వలలో వేసుకుని...
సీపీఎస్ రద్దు, పీఆర్సీ! సరిగ్గా ఉద్యోగులకు ఏవి కావాలో ఆ రెండు హామీలను ఎన్నికల ముందు ఏమాత్రం జంకు లేకుండా ఇచ్చారు. ఉద్యోగులు చెబుతున్న ప్రకారమే, వైసీపీకి తామంతా ఓట్లు వేయడమే కాదు, వేయించారు కూడా! కేవలం ఆ రెండు హామీలతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉద్యోగ వర్గాలు టీడీపీవైపు మొగ్గు చూపితే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి... తమను గెలిపించిన రెండు హామీలనే వైసీపీ అటకెక్కించిందని పేర్కొంటున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులపైనా...
‘‘కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తాం. వీలైనంత మందిని ప్రభుత్వంలోకి తీసుకుని, రెగ్యులరైజ్ చేస్తాం’ అని ఎన్నికల ముందు జగన్ పదేపదే చెప్పారు. ‘మాట తప్పని నేతకదా!’ అని కాంట్రాక్టు కార్మికులంతా ఆయన మాట నమ్మారు. జగన్ వారికి కూడా చుక్కలు చూపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కుదరదని తేల్చేశారు.
