నేటి నుంచి పోలీసులకు మళ్లీ వీక్లీ ఆఫ్‌లు

ABN , First Publish Date - 2021-10-21T15:24:51+05:30 IST

దేశం మొత్తం నేడు..

నేటి నుంచి పోలీసులకు మళ్లీ వీక్లీ ఆఫ్‌లు

సీఎం జగన్


విజయవాడ: దేశం మొత్తం నేడు అమరవీరుల దినం జరుపుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పోలీసు అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరంచంద్, ఆయన సహచరుల ధైర్యాన్ని 62 యేళ్లుగా గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు సమాజం అండగా ఉంటుందన్నారు. గత యేడాది కాలంలో మరణించిన పోలీసు సోదరులకు ప్రభుత్వం తరపున శ్రద్దాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమాజం కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసు సేవలను గుర్తించామన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా దేశంలో తొలిసారిగా వీక్లీ ఆఫ్‌లు అమలు చేశామని ఆయన చెప్పారు.


కోవిడ్ వల్ల ఇది కొంతకాలంగా అమలు చేయలేక పోయామని...నేటి నుంచి మళ్లీ వీక్లీ ఆఫ్‌లను అమలు చేస్తామని ప్రకటించారు. 2017 నుండి బకాయిపెట్టిన రూ.1500 కోట్లను తాము విడుదల చేశామని తెలిపారు. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసేలా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. హోంగార్డుల గౌరవ వేతనం కూడా ఈ ప్రభుత్వమే పెంచిందని పేర్కొన్నారు. పోలీసు శాఖలో‌ నూతనంగా 16వేల మందిని గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో నియమించామన్నారు. కరోనాతో మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులకు ఐదు లక్షలు మంజూరు చేశామని సీఎం తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్‌గా మరో ఐదు లక్షలు ఇస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్స్ గ్రేషియా, ఇతర సదుపాయాలు కల్పించామన్నారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ అమల్లోకి తెచ్చామని చెప్పారు. దిశ బిల్లును ఉభయ సభలు ఆమోదించి.. కేంద్రం ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. మహిళా హోంమంత్రి ఆధ్వర్యంలో అనేక రక్షణ చర్యలు చేపట్టామన్నారు. జాతీయ స్థాయిలో  ఈ‌సేవలకు ఆదరణ లభిస్తుందన్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో పోలీసుల బాధ్యతలు మరింత విస్తరించాలని తెలిపారు. వైట్ కాలర్ నేరాలను నియంత్రించేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ వెల్లడించారు. 

Updated Date - 2021-10-21T15:24:51+05:30 IST