విజయవాడ ‘సిద్ధార్థ’ తీరే వేరు!
ABN , First Publish Date - 2021-10-25T14:52:43+05:30 IST
విజయవాడ..

బోధనాస్పత్రుల్లో సీసీ కెమెరాలేవీ?
ఢిల్లీ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ గగ్గోలు
పట్టించుకోని బోధనాస్పత్రి, మెడికల్ కాలేజీలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకే కాకుండా నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు కూడా ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు స్పందించడం లేదు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కాలేజీలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని పర్యవేక్షించేందుకు ఎన్ఎంసీ ఆయా కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 11 మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల పనితీరును సీసీ కెమెరాల ద్వారానే ఎన్ఎంసీ పర్యవేక్షిస్తోంది. అయితే చాలా బోధనాస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఇవన్నీ మూలనపడ్డాయి. దీంతో ఎన్ఎంసీ పలుసార్లు కాలేజీ అధికారులకు ఫోన్‌చేసి హెచ్చరిస్తూనే ఉంటోంది. ఎన్ఎంసీ నుంచి మెయిల్స్ రాగానే కొన్ని కాలేజీల్లో సీసీ కెమెరాలను పునరుద్ధరిస్తున్నా, కొన్ని కాలేజీల్లో అసలు పట్టించుకోవడమే మానేశారు.
విజయవాడ సిద్ధార్థ కళాశాలలో...
విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఏడాదిన్నర నుంచి ఎన్ఎంసీ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఇప్పటికే ఎన్ఎంసీ అధికారులు.. మెయిల్స్, ఫోన్ కాల్స్ చేసినా స్పందించడం లేదు. దీంతో సిద్ధార్థ మెడికల్ కాలేజీతో ఎన్ఎంసీకి లింక్‌లు తెగిపోయాయి. అసలు సిద్ధార్థ మెడికల్ కాలేజీ, విజయవాడ బోధనాస్పత్రుల్లో ఏం జరుగుతోందో ఎన్ఎంసీకి సమాచారం ఉండడం లేదు. ఈ విషయాన్ని ఎన్ఎంసీ అధికారులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి కూడా తీసుకువచ్చారు. డీఎంఈ నుంచి ఫోన్లు చేసినా స్పందించిన పరిస్థితి లేదు. దీంతో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రత్యేక వ్యవస్థ నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటే నేరుగా ఎన్ఎంసీ అధికారులు రంగంలోకి దిగే ప్రమాదం ఉందని డీఎంఈ అధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులైనా దీనిపై దృష్టిసారిస్తారో లేదో చూడాలి మరి!