జేజేల కోసమే ‘బెంబేలు’

ABN , First Publish Date - 2021-12-15T15:07:39+05:30 IST

‘‘కత్తులతో చీరేస్తారేమో! కొరడాలతో కొడతారేమో! కర్రు కాల్చి వాతలు పెడతాడేమో!’ అని భయంతో వణుకుతున్న వాళ్లను... రాజుగారు బెత్తంతో..

జేజేల కోసమే ‘బెంబేలు’

ఉద్యోగులతో జగన్‌ సర్కారు ‘మైండ్‌ గేమ్‌’

వ్యూహాత్మకంగానే తెరపైకి సీఎస్‌ కమిటీ

జీతాలు తగ్గించాలంటూ సిఫారసు

ఉద్యోగులను ఆందోళనలోకి నెట్టేందుకే 

తర్వాత... 27 నుంచి 30 శాతం ఫిట్‌మెంట్‌ 

ఆపై సీఎంది పెద్ద మనసు అని కీర్తించడమే!


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘కత్తులతో చీరేస్తారేమో! కొరడాలతో కొడతారేమో! కర్రు కాల్చి వాతలు పెడతాడేమో!’ అని భయంతో వణుకుతున్న వాళ్లను... రాజుగారు బెత్తంతో పది దెబ్బలు గట్టిగా కొట్టి సరిపెట్టారనుకోండి! ‘మీరు మాపాలిట దేవుడు సామీ!’ అని మొక్కి మరీ వెళ్లిపోతారు! బయటికి వెళ్లి జేజేలు కొడతారు! ఉద్యోగుల వేతన సవరణ విషయంలోనూ ఇదే జరుగుతోందా? ‘ఫిట్‌మెంట్‌ 27శాతం కూడా అక్కర్లేదు. 14.29శాతం ఇస్తే చాలు. హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలి. సీసీఏ ఎత్తేయాలి. కేంద్ర ప్రభుత్వ తరహాలో పదేళ్లకోసారి పే కమిషన్‌ ఇవ్వాలి’ అంటూ ఉద్యోగుల జీతాలు తగ్గుతాయని భయపెట్టి, చివరికి ‘మరేం ఫర్వాలేదు. మీ  జీతాలు తగ్గించం. యథాతథంగా కొనసాగిస్తాం’ అని సరిపెడతారా? లేదా... ఇప్పుడు వస్తున్న ఐఆర్‌కు మరో3 శాతం, అంటే 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించి ‘జగనన్న దయార్థ్ర హృదయుడు! మా జీతాలు తగ్గించలేదు! ఆయన చల్లగా ఉండాలి’ అని కొందరితో వ్యూహాత్మకంగా జేజేలు కొట్టించుకుని, ఫొటోలకు పాలాభిషేకాలు చేయించుకుంటారా?.. ఇవి ఉద్యోగ వర్గాల్లోనే తలెత్తుతున్న సందేహాలు! ఎందుకంటే... 11వ పీఆర్సీపై అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన పూర్తి నివేదికను సర్కారు బయటపెట్టలేదు. ఎలాంటి విలువా లేని సీఎస్‌ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. ఆ కమిటీ నివేదికను చూసిన ఉద్యోగులు విస్తుపోయారు. ఆ సిఫారసులను యథాతథంగా అమలుచేస్తే... 2022 నవంబరు నుంచి జీతం పెరగడం అటుంచి, భారీగా కోత పడుతుంది. ఇది ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం. 


సీఎస్‌ కమిటీ పేరిట హైడ్రామా

ఇప్పటిదాకా ఐఆర్‌ కంటే అదనంగానే ఫిట్‌మెంట్‌ను మంజూరు చేస్తూ వచ్చారు. 11వ పీఆర్సీ ఐఆర్‌తో సమానంగా, అంటే 27శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సిఫారసు చేసినట్లు సీఎస్‌ కమిటీ వెల్లడించింది. అయితే... అదీ అక్కర్లేదని 14.29ు ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఇంకా... హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, గృహ-వాహన రుణాలతో సహా అనేక అంశాలపై ఉద్యోగుల ప్రయోజనాలకు వాతలు పెట్టే అనేక సిఫారసులు చేసింది. తాజాగా... కేంద్ర వేతన కమిషన్‌ను తెరపైకి తెచ్చింది. సీసీఏ కేంద్రంలో లేదు కాబట్టి తీసేస్తామని పేర్కొంది. కేంద్రం సీసీఏ తీసేసినా ట్రాన్స్‌పోర్టు అలవెన్సు ఇస్తోంది. కేంద్రం సిఫారసుల్లో నచ్చినవి తీసుకుని, తమకు మేలు చేసేవి వదిలేయడమేమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వెరసి... తమను ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టేందుకే వ్యూహాత్మకంగా సీఎస్‌ కమిటీని తెరపైకి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. 


అంతా ఏకమై చెప్పినా...

ఇప్పుడు వస్తున్న ఐఆర్‌ 27 శాతాన్నే సీఎం జగన్‌ ఫిట్‌మెంట్‌గా నిర్ణయించే అవకాశముందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు! అత్యున్నత స్థాయి అధికారి సీఎస్‌, ఇతర కార్యదర్శులంతా కలిసి... జీతాలు పెంచొద్దు, తగ్గించాలి అని చెప్పినా... జగన్‌ పెద్ద మనసుతో 27 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు’’ అని జేజేలు కొట్టించుకోవడమే ఈ వ్యూహం అసలు ఉద్దేశమని అనుమానిస్తున్నారు. 


ఏం చెబుతారో...

‘పీఆర్సీపై సీఎం మూడు రోజుల్లో తేల్చేస్తారు’... అని సీఎస్‌ చెప్పి రెండు రోజులు గడిచిపోయాయి. బుధవారం ఉద్యోగ సంఘాలతో జగన్‌ సమావేశమవుతున్నారు. దీంతో ఆయన నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 9వ పీఆర్సీని 39శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించారు. అప్పుడు మినిమం బేసిక్‌(అటెండర్‌స్థాయి) 6,700కి పెరిగింది. అనంతరం, నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు 10వ పీఆర్సీని 43ు ఫిట్‌మెంట్‌తో ప్రకటించారు. దీంతో బేసిక్‌ రూ.13వేలకు చేరింది. ఇప్పటి వరకు దాదాపు ప్రతి పీఆర్సీలో ఉద్యోగుల బేసిక్‌ రెట్టింపయింది. గత పీఆర్సీలో వేతనాల్లో భారీ పెరుగుదల కనిపించింది. ‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. రెండున్నరేళ్లు గడిచినా పీఆర్సీ ఊసెత్తలేదు. ఇప్పుడు... సీఎస్‌ కమిటీని తెరపైకి తెచ్చి బెంబేలెత్తిస్తోంది. ఉద్యోగ సంఘాలు, జేఏసీలు 50ు పైగా ఫిట్‌మెంట్‌  ఇవ్వాలని 11వ పీఆర్సీ కమిషన్‌కు ప్రతిపాదనలు ఇచ్చాయి. ఇప్పటికీ ఇదేడిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం కనీసం 30శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తుందని కొందరు, 34శాతానికి తగ్గదని మరికొందరు అంచనా వేస్తూ వస్తున్నారు. పీఆర్సీ ధరల పెరుగుదల ఆధారంగా అమలవుతుంది. ప్రతి నాలుగు పాయింట్లకు మాస్టర్‌ స్కేల్‌ మారుతుంది. ఇప్పుడున్న ధరలతో పోల్చితే 34 శాతానికి మించి పీఆర్సీ ఇస్తేనే కొంతైనా ప్రయోజనం కలుగుతుందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాడు విభజన కష్టాల్లోనూ చంద్రబాబు 10వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 43 శాతం ఇచ్చారని, ప్రతి విషయంలో ‘నాడు-నేడు’ అంటూ గత ప్రభుత్వంతో పోల్చుకునే వైసీపీ ప్రభుత్వం దీనికి మించి ఇవ్వాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి. అయితే... సీఎస్‌ కమిటీ సిఫారసుల దెబ్బతో ఉద్యోగ సంఘాల్లో గుబులు రేగుతోంది.

Updated Date - 2021-12-15T15:07:39+05:30 IST