ఎలక్ర్టానిక్స్‌లో 3 లక్షల ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-03-21T17:15:13+05:30 IST

3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని..

ఎలక్ర్టానిక్స్‌లో 3 లక్షల ఉద్యోగాలు

నాలుగేళ్లలో కల్పించాలన్నది లక్ష్యం

స్థానికులకు ఈఎస్డీఎంలో శిక్షణ

రాష్ట్రానికి 40 కొత్త పరిశ్రమలొచ్చాయి

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో కేటీఆర్‌ వెల్లడి


హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టానిక్స్‌, విద్యుత్తువాహన రంగాల్లో రానున్న నాలుగేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎలక్ర్టానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఈఎస్డీఎం)లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 60 వేల మందికి శిక్షణ ఇవ్వగా, 30 వేల మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. శనివారం శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. రాష్ట్రానికి కొత్తగా 40 పరిశ్రమలు వచ్చాయని, రూ.2 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని వివరించారు. దివిటిపల్లి, చందన్‌వెల్లిలో విద్యుత్తువాహనం, ఇంధన నిల్వ వ్యవస్థల అభివృద్ధికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. ఇక టీఎస్‌ బీపా్‌సను ప్రారంభించిన వంద రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చామని ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమధానంగా మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 600 గజాల వరకు స్వయం దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్‌ అనుమతులు ఇస్తున్నామన్నారు. కాగా, కేపీహెచ్‌బీలో ఇళ్ల పునర్మిర్మాణానికి ఉచితంగా అనుమతులు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేయగా.. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి రూ. 589 కోట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విదేశీ విద్యను అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి గత ఆరేళ్లలో ప్రభుత్వం రూ.589 కోట్లు ఖర్చు చేసిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. గతంలో దీనికి రూ.10 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.20 లక్షలు చెల్లిస్తున్నామన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు ఎస్టీలు 240 మంది, ఎస్సీలు 581, బీసీలు 1171, మైనారిటీలు 1684 మంది చొప్పున మొత్తం 3676 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు వెల్లడించారు.   

Updated Date - 2021-03-21T17:15:13+05:30 IST