మతమార్పిళ్లు చేశారని మిషనరీ స్కూలు వద్ద రచ్చ

ABN , First Publish Date - 2021-12-08T15:40:08+05:30 IST

ఎనిమిది మంది విద్యార్థులను మతమార్పిడి చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లోని గంజ్‌ బసౌదా పట్టణంలో సెయింట్‌ జోసెఫ్‌ మిషనరీ పాఠశాల వద్ద..

మతమార్పిళ్లు చేశారని మిషనరీ స్కూలు వద్ద రచ్చ

పాఠశాల భవనంపై రాళ్లు.. పోలీసుల అదుపులో నలుగురు


భోపాల్‌, డిసెంబరు 7: ఎనిమిది మంది విద్యార్థులను మతమార్పిడి చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లోని గంజ్‌ బసౌదా పట్టణంలో సెయింట్‌ జోసెఫ్‌ మిషనరీ పాఠశాల వద్ద హిందూ సంస్థల కార్యకర్తలు సోమవారం రచ్చరచ్చ చేశారు. స్కూల్‌ భవనంపై రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. దీంతో నలుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా పోలీసులను ఆదేశించారు. విదేశీ నిధులను పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్జీవోలు, మిషనరీ బడులు మతమార్పిళ్ల కోసం వాడుతున్నాయన్న ఆరోపణలున్నాయని, అలాంటి సంస్థలపై దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. కాగా, తమ పాఠశాలలో ఎలాంటి మతమార్పిళ్లు జరగలేదని సెయింట్‌ జోసెఫ్‌ స్కూలు యాజమాన్యం పేర్కొంది. పాఠశాల భవనం వైపు ఆందోళనకారులు రాళ్లు విసురుతుండగా తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మరోవైపు తమ కార్యకర్తలు పాఠశాల వద్ద శాంతియుతంగానే నిరసన తెలిపారని, ఎటువంటి హింసకు పాల్పడలేదని మధ్యప్రదేశ్‌ వీహెచ్‌పీ నాయకుడు నీలేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-08T15:40:08+05:30 IST