11వ PRC నివేదిక బహిర్గతం చేయాలి

ABN , First Publish Date - 2021-10-21T15:34:49+05:30 IST

11వ పీఆర్సీని నివేదికను..

11వ PRC నివేదిక బహిర్గతం చేయాలి

ఏపీజేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు


అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): 11వ పీఆర్సీని నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు అందజేయాలని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, కార్యదర్శి హృదయరాజు డిమాండ్‌ చేశారు. బుధవారం ఏపీ జేఏసీ సెక్రటరేయట్‌ సమావేశం విజయవాడలోని ఏపీ ఎన్జీవో భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ నెల 27న సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందే పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. 


27న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ నేతృత్వంలో ఈ నెల 27న రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలోనే 11వ పీఆర్సీ కమిషన్‌ ఇచ్చిన నివేదికను బహిరంగపర్చాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ జేఏసీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2021-10-21T15:34:49+05:30 IST